సాక్షి,న్యూఢిల్లీ: అవినీతి...నల్లధనం...ఉగ్రవాదం..నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని సరిగ్గా ఏడాది అవుతోంది. ఏడాదిలో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా..? సగటు భారతీయుడికి ప్రయోజనాలు దక్కాయా..? ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి..? అందరి మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు. నోట్ల రద్దు పర్యవసానాలను బేరీజు వేసేందుకు ఏడాది సమయం స్వల్పకాలికమైనా ఈ వ్యవధిలో మోదీ నిర్ణయంతో సానుకూల ఫలితాల కన్నా ప్రతికూలతలే ఎదురయ్యాయి. చెలామణిలో ఉన్న 86 శాతం నగదు చెల్లదని ప్రకటిస్తూ మోదీ ప్రవచించిన ఉద్దేశాలు మొక్కుబడి మాటలుగా మిగిలాయి.
వృద్ధి రేటు వెనక్కు...
నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా పరుగులు పెట్టిన దేశ వృద్ధి రేటు నగదు కొరతతో డీలా పడింది. జీడీపీ వృద్ధి రేటు కనిష్టస్థాయికి పతనమైంది. విపక్షాలు, రాజకీయ పరిశీలకులతో పాటు ఆర్థిక నిపుణులూ నోట్ల రద్దు బెడిసికొట్టిందని విశ్లేషించారు. నల్లధనం, అవినీతి నియంత్రణ ప్రక్రియ నోట్ల రద్దుతో ముగిసేది కాదంటూ నోమురా హోల్డింగ్స్ చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ సొనాల్ వర్మ స్పష్టం చేశారు. నల్లధనం కేవలం నగదులోనే ఉండదని, అది రియల్ ఎస్టేట్, బంగారం వంటి పలు రూపాల్లో ఉంటుందని వర్మ అన్నారు.
నకిలీ కరెన్సీ
సరిహద్దుల నుంచీ వెల్లువెత్తుతున్న నకిలీ నోట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు నోట్ల రద్దు ఉపకరిస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అతిపెద్ద నిర్ణయం ఈ దిశగానూ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. నోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 0.07గా ఉన్న నకిలీ నోట్లు ఈ ఏడాది జూన్ 30 నాటికి 0.08 శాతానికి పెరిగాయి. మరోవైపు ఆర్‌బీఐ నూతనంగా ప్రవేశపెట్టిన రూ 2000 నోట్లలోనూ నకిలీలు ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున రూ 2000, రూ 500 నకిలీ నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి.
నల్లధనం
గత ఏడాది నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే సుప్రీం కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం చెలామణిలో ఉన్న రూ 15 లక్షల కోట్ల కరెన్సీలో మూడింట ఓ వంతు బ్యాంకుల్లో జమ కాదని, ఆ మేరకు పెద్దమొత్తంలో నల్లధనమంతా చెల్లుబాటు కాకుండా పోతుందని ప్రభుత్వం నివేదించింది.అయితే రద్దయిన నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరినట్టు ఆర్‌బీఐ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రద్దయిన నోట్లన్నీ బ్యాంకు డిపాజిట్ల రూపంలో నేరుగా వ్యవస్థలోకి ప్రవేశించడంతో ఇక బ్లాక్‌మనీని తుడిచిపెట్టడం ఎలా సాధ్యమని ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ సీనియర్ ఎకనమిస్ట్ అర్జెన్ డికుజెన్ విస్మయం వ్యక్తం చేశారు.
డిజిటల్ లావాదేవీలు
నోట్ల రద్దుకు ప్రభుత్వాన్ని ప్రేరేపించిన నగదు రహిత లావాదేవీలూ ఆశించిన మేర పుంజుకోలేదు. డిజిటల్ పేమెంట్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న పేటీఎం నోట్ల రద్దు అనంతరం తన సబ్‌స్క్రైబర్‌లను భారీగా పెంచుకుని లాభాలు దండుకుంది. మ్యూచ్‌వల్ ఫండ్లలోకీ నిధులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి నగదు చెలామణి సాధారణ స్థితిలోకి చేరగానే డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి.అయితే నోట్ల రద్దు నిర్ణయం లేకుంటే ఈ మాత్రమైనా డిజిటల్ లావాదేవీలు జరిగేవి కాదని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుభాష్ గార్గ్ అంచనా వేశారు.
ఉగ్రవాదం
నోట్ల రద్దుతో ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చని ప్రధాని మోదీ చెప్పినట్టుగా జమ్మూ కశ్మీర్‌లో నోట్ల రద్దు అనంతరం రాళ్ల దాడులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినా మళ్లీ క్రమంగా కశ్మీర్‌లో రాళ్ల దాడులు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల రద్దుతో వీటికి నేరుగా సంబంధం ఉన్నదా అనేది అస్పష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment