సాక్షి, న్యూఢిల్లీ : రెండేళ్ల కిందట చేపట్టిన నోట్ల రద్దు దుష్ర్పభావాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న సమస్యలు నోట్ల రద్దు పర్యవసానమేనని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అనాలోచిత చర్యగా ఆయన అభివర్ణించారు.
భారత ఆర్థిక వ్యవస్థ, సమాజంపై నోట్ల రద్దు విరుచుకుపడిన తీరు ఇప్పుడు అందరికీ తేటతెల్లమైందన్నారు. ఆర్థిక వృద్ధిపైనా నోట్ల రద్దు ప్రభావం కనిపిస్తోందని, యువతకు ఉద్యోగాలు కొరవడటం, చిన్నతరహా పరిశ్రమలు నగదు లభ్యత లేకపోవడంతో కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక దుస్సాహసాలు దేశంపై దీర్ఘకాల ప్రతికూల ప్రభావాన్ని ఎలా చూపుతాయో ఈ రోజు మనకు గుర్తుకుతెస్తోందని, ఆర్థిక విధాన నిర్ణయాలను అప్రమత్తతో, ఆచితూచి తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నదని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment