
అహ్మదాబాద్: నోట్లరద్దు, జీఎస్టీలతో దేశ ప్రజలకు ఒరిగిందేమిలేదని, దీంతో పక్క దేశం చైనా లాభపడిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సూరత్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానన్న కమిట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి సెల్యూట్ అన్న మన్మోహన్.. నోట్ల రద్దుతో నల్లధనం కాస్త వైట్ మనీగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ అనాలోచిత నిర్ణయంతో పేద ప్రజలు నగదు మార్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సుమారు 100 మంది క్యూలలో నిలబడి మరణించారని తెలిపారు. దుఃఖాన్నే మిగిల్చిన నవంబర్ 8 ఓ బ్లాక్ డేగా నిలిచిపోయిందన్నారు.
ఇక జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థపై కుదిబండగా మారిందన్నారు. నోట్లరద్దుతో చితికిపోయిన చిన్నతరహా పరిశ్రమలు, జీఎస్టీతో పూర్తిగా మూతబడ్డాయన్నారు. దీంతో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు పెరిగాయని ఈ అనాలోచిత నిర్ణయంతో చైనా బాగుపడిందన్నారు. జీఎస్టీ వ్యాపారులపై పన్నుల తీవ్రవాదంగా మారిందని విమర్శించారు. ఈ రెండు నిర్ణయాలతో భారత జీడీపీ గ్రోత్ పూర్తిగా పడిపోయిందన్నారు. ఈ మూడున్నరేళ్ల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.