సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు కష్టాలపై ఇప్పటికే పలు సర్వేలు, అథ్యయనాలు వెలువడగా ఈ నిర్ణయంతో ఉద్యోగాలు 2-3 శాతం మేర దెబ్బతినడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీసిందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. బ్లాక్ మనీ నిరోధించడం, ఉగ్ర నిధులకు కళ్లెం వేసే లక్ష్యంతో 2016 నవంబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నోట్ల రద్దుతో ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక వేత్తలు గాబ్రియల్ చోడ్రో-రీచ్, ఐఎంఎఫ్‌కు చెందిన గీతా గోపినాథ్‌ల నేతృత్వంలో తాజా అథ్యయనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వృద్ధిని తగ్గించడంతో పాటు 2-3 శాతం ఉద్యోగాలు ఊడిపోయాయని ఈ సర్వే స్పష్టం చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో 2016 నవంబర్, డిసెంబర్ మధ్య ఆర్థిక కార్యకలాపాలు 2.2 శాతం తగ్గాయని వీరు వెల్లడించిన పరిశోధన నివేదిక తెలిపింది. నోట్ల రద్దుకు ముందు ఆర్బీఐ పెద్దమొత్తంలో కొత్త నోట్లను ముద్రించకపోవడంతో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment