సాక్షి,న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కిందట ప్రధాని మోదీ ఇచ్చిన నోట్ల రద్దు షాక్‌కు సామాన్యులు విలవిలలాడారు. అవినీతి, నల్లధనం అంటూ చెలామణిలో ఉన్న నగదును చెప్పాపెట్టకుండా రద్దు చేసి బ్యాంకుల ముందు పడిగాపులు కాసేలా చేశారు. అయితే నోట్ల కష్టాలకు ఏడాది అవుతున్న సందర్భంగా ఓ సర్వే ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది. నోట్ల రద్దును ప్రజలు ఇప్పటికీ స్వాగతిస్తున్నారని, మోదీ మ్యాజిక్‌కు వెన్నుదన్నుగా నిలిచారని ఈటీ ఆన్‌లైన్ సర్వే తేల్చింది.
నోట్ల రద్దు విజయవంతమైందని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 38 శాతం మంది పేర్కొనగా, 32 శాతం మంది విఫలమైందని చెప్పారు. 30 శాతం మంది మిశ్రమంగా ప్రతిస్పందించారు. ఈటీ ఆన్‌లైన్ సర్వేలో పదివేల మందికి పైగా తమ స్పందన తెలియచేశారు. దీర్ఘకాలంలో నోట్ల రద్దు దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని 26 శాతం మంది అభిప్రాయపడగా, వ్యవస్థలో పారదర్శకతను తీసుకొస్తుందని 32 శాతం మంది చెప్పారు. 42 శాతం మంది ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకు ఉపకరిస్తుందని, అయితే కొంతమేర ఎకానమీకి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఉపాధి రంగంపై మాత్రం నోట్ల రద్దు ప్రభావంపై కొంత ప్రతికూలత ఎదురైంది. ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదని 32 శాతం మంది పేర్కొనగా, దీర్ఘకాలంలో ఉద్యోగాలపై నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం చూపుతుందని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసివచ్చిందని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇక మోదీ రూ 2000 నోటును రద్దు చేస్తే నల్ల కుబేరులకు షాక్ ఇచ్చినట్టవుతుందని 56 శాతం మంది అభిప్రాయపడగా, ఆర్థిక వృద్ధికి విఘాతమవుతుందని 31 శాతం మంది పేర్కొన్నారు. ఈ నిర్ణయం నిజాయితీగా నడిచే వ్యాపారాలను దెబ్బతీస్తుందని 12 శాతం మంది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment