పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం చితికిపోయింది. ఉరుములేని పిడుగులా విరుచుకుపడిన నోట్లరద్దు దెబ్బకు వాణిజ్య గృహనిర్మాణ రంగంలో దాదాపు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. 2016 సంవత్సరం ప్రథమార్థంలో (మొదటి ఆరు నెలల్లో) ఏడుశాతం వృద్ధిని నమోదుచేసిన రియల్ ఎస్టేట్ రంగం ద్వితీయార్థంలో ఏకంగా 23శాతం పతనమైంది.
దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లోనూ నోట్లరద్దు దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతిన్నదని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. నోట్ల రద్దు ప్రభావంతో రియల్ రంగంలో కొత్త వెంచర్లు ఏకంగా 46శాతం పడిపోయాయని పేర్కొంది. ఇక 2016 సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో.. గడిచిన ఆరేళ్లలో ఎన్నడూలేనంత గడ్డు పరిస్థితిని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొన్నదని పేర్కొంది. గత ఏడాది చివరి మూడు నెలల్లో అమ్మకాలు 44శాతం పడిపోగా, కొత్త వెంచర్లు 61శాతం పడిపోయి.. రియల్టీ రంగం కుదులైందని నివేదిక స్పష్టం చేసింది. ఇటీవలి చరిత్రలోనే చూసుకుంటే 2016లోనే అత్యంత దారుణమైన పరిస్థితిని ఈ రంగం ఎదుర్కొన్నదని నివేదిక పేర్కొంది.
అయితే, రియల్టీ రంగంలో దేశంలోని నగరాలన్నీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోగా.. ఒక్క పుణె మాత్రం జూలై-డిసెంబర్ 2016 కాలంలో 29శాతం వృద్ధిని నమోదుచేయగలిగిందని నివేదిక పేర్కొంది. నోట్ల రద్దు తర్వాతి త్రైమాసికంలో ఈ నగరంలో 35శాతం పతనం నమోదైనప్పటికీ, అక్టోబర్ నెలలో అత్యధికంగా అమ్మకాలు జరగడం, కొత్త వెంచర్లు ఏర్పాటుకావడంతో ఆ ప్రభావాన్ని కొంతమేరకు నివారించగలిగాయని నివేదిక విశ్లేషించింది. నోట్ల రద్దు వల్ల రిజిస్ట్రేషన్లు పడిపోవడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల స్టాంప్ డ్యూటీ రూపంలో రూ. 1200 కోట్లు నష్టపోయాయని పేర్కొంది.
ఇప్పుడేంటి పరిస్థితి?
2012 నుంచి ఇళ్ల ధరలు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నదని, ఈ నేపథ్యంలో పెరిగిన కొత్త ఆదాయ వర్గాలను ఆకట్టుకునేలా ధరలపై సమీక్ష చేసి ముందుకు సాగాల్సిన అవసరం డెవలపర్లపై ఉందని నివేదిక సూచించింది. అదేవిధంగా ఆర్బీఐ రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో 25-50 బేసిస్ పాయింట్ల వరకు బ్యాంకు రుణాలు వడ్డీరేట్లను తగ్గిస్తే.. రియల్ రంగంలో కొనుగోళ్ల డిమాండ్ పెరిగే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. రానున్న కేంద్ర బడ్జెట్ పైనా రియల్ ఎస్టేట్ రంగం భారీ ఆశలు పెట్టుకున్నదని, గృహరుణాల వడ్డీలపై పన్ను మినహాయింపు పరిమితిని బడ్జెట్‌లో పెంచితే అది మరింత ఊపునిచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.