సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు మిగిల్చిన కష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించి ఏడాది అవుతున్న సందర్భంగా నవంబర్ 8న బ్లాక్ డే పాటించాలని పలు విపక్ష పార్టీలు ప్రకటించాయి. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన తీరును ప్రతిబింబిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ శతాబ్ధంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచినందునే ఆ రోజు బ్లాక్‌డే పాటించాలని పిలుపు ఇచ్చామని కాంగ్రెస్ నేత, రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.
నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా తొందరపాటు చర్యని ఆయన అభివర్ణించారు.ప్రజలకు కడగండ్లు మిగిల్చిన నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా నవంబర్ 8న దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు మరణించిన ఘటన ప్రపంచ చరిత్రలో ఇదేనని అన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని విపక్షాల భేటీ అనంతరం తృణమూల్ నేత డెరెక్ ఒబ్రెన్, జేడీయూ నేత శరద్ యాదవ్‌లు పేర్కొన్నారు.నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడాలని కాంగ్రెస్, తృణమూల్,ఎస్‌పీ, బీఎస్‌పీ, డీఎంకే, వామపక్షాలు, జేడీ(యూ) చీలిక వర్గం సహా 18 రాజకీయ పార్టీలు నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment