బంగారంగా మారిన నగదెంతో తెలుసా?
బంగారంగా మారిన నగదెంతో తెలుసా?
Published Sat, Dec 24 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన అనంతరం నల్లధనాన్ని తెల్లగా మార్చడం కోసం బ్లాక్మనీ హోల్డర్స్ ఒక్కసారిగా బంగారం దుకాణాలకు పరిగెత్తిన సంగతి తెలిసిందే. ఇదే అవకాశంగా తీసుకుని బంగారం వర్తకులు మనీ లాండిరింగ్ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బంగారం వర్తకులపై కొరడా ఝళిపించడం ప్రారంభించింది. దేశరాజధాని పరిధిలోని బంగారం వర్తకులపై ఐటీ డిపార్ట్మెంట్ తాజాగా జరిపిన దాడుల్లో లెక్కల్లో తేలని రూ.250 కోట్ల బంగారం విక్రయాలు వెలుగులోకి వచ్చాయి.
అంతేకాక పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ జరిపిన దాడుల్లో దేశరాజధానిలో రూ.400 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో తేలని బులియన్ విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. కరోల్ బాగ్, చాందినీ చౌక్ ప్రాంతాల్లోని నలుగురు బులియన్ డీలర్స్ను శుక్రవారం ఐటీ డిపార్ట్మెంట్ విచారించింది. ఈ విచారణలో గత కొన్ని వారాల్లో రూ.250 కోట్లకు పైగా రద్దయిన నగదును మార్చిపెట్టినట్టు తెలిసింది. ఈ వర్తకులకు సంబంధించిన 12 దుకాణాలు, 8 నివాస ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఇంకా దాడులు నిర్వహిస్తోంది. మొదటగా రూ.250 కోట్ల రద్దయిన నోట్లను వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా బంగారంలోకి మార్చినట్టు గుర్తించామని ఓ సీనియర్ ఐటీ అధికారి పేర్కొన్నారు.
ఈ నలుగురి ట్రేడర్ల దుకాణాలు పాత ఢిల్లీ పరిధిలోని కుచ మహాజని ప్రాంతంలో ఉన్నాయని, మరికొన్ని దుకాణాలు కరోల్ బాగ్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరి బ్యాంకు అకౌంట్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దయిన అనంతరం మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వార్తలతో కుచ మహాజని బులియన్ డీలర్స్పై మొదటి రైడ్ నిర్వహించామని, ఆ దాడుల్లో రూ.100 కోట్లకు పైగా గోల్డ్ బార్స్ను వీరు విక్రయించినట్టు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. అప్పుడే మనీ లాండరింగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విషయంలో ఈడీ ఇప్పటికే ఇద్దరు బ్యాంకు మేనేజర్లను, ఇద్దరు మధ్యవర్తులను అరెస్టు చేసింది.
Advertisement
Advertisement