మరింత బ్లాక్మనీ బయటికొస్తుంది
♦ వేగంగా దర్యాప్తు నిర్వహిస్తాం: జయంత్ సిన్హా
♦ నల్లధనం వెల్లడిపై నేడు వివిధ వర్గాలతో జైట్లీ భేటీ
న్యూఢిల్లీ: విదేశాల్లో దాచి ఉంచిన నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు పనామా పత్రాలతో సహా వివిధ మార్గాల్లో తెలిసిన సమాచారం ఆధారంగా వేగవంతమైన దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, మరిన్ని నల్లధనం కలుగుల సమాచారం బయటకు వస్తుందని చెప్పారాయన. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సిన్హా ఈ అంశంపై మాట్లాడుతూ... ‘‘హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐజే పత్రాల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా విదేశీ బ్యాంకుల్లో దాచి ఉంచిన రూ.13వేల కోట్ల రూపాయల నల్లధనం వివరాలను ఐటీ శాఖ ఇప్పటికే సేకరించింది. ఇక దేశీయంగా దాచి పెట్టుకున్న నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఆ తర్వాత జరిమానాలు విధిస్తాం’’ అని చెప్పారు. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రధాని మోదీ సైతం సూచించారు. ఇదే చివరి అవకాశమని, దీన్ని కోల్పోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కూడా.
⇒ బ్రెగ్జిత్‌తో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు: బ్రెగ్జిట్‌పై ఓ ప్రశ్నకు సిన్హా స్పందిస్తూ... ‘‘ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి రెండు మూడేళ్ల సమయం పడుతుంది. తగిన సర్దుబాటు చేసుకునేందుకు, మార్పులను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం ఉంది’’ అన్నారు. మరోవైపు, దేశీయంగా దాగి ఉన్న నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంపై (ఐడీఎస్) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం వివిధ వాణిజ్య సంఘాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏ), ఇతర వృత్తి నిపుణులతో సమావేశమవుతారు. నిబంధనల గురించి వారికున్న సందేహాలు తీరుస్తారు.
⇒ సెప్టెంబర్ 30 వరకూ అవకాశం: స్వచ్చందంగా నల్లధనం వివరాలు వెల్లడించేందుకు వీలుగా ‘ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) 2016’ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టింది. జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇందులో భాగంగా తమ రహస్య ఆస్తులు, నిధుల వివరాలు స్వచ్చందంగా వెల్లడించి వాటి మొత్తం విలువపై పన్ను, జరిమానా రూపంలో 45 శాతం మేర చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్‌ఆర్‌ఐలకూ ఐడీఎస్.. పాన్ తప్పనిసరి
నల్లధనం వెల్లడికి ప్రభుత్వం కల్పించిన ఏకైక అవకాశం ‘ఐడీఎస్’ విషయంలో తలెత్తే పలు సందేహాలకు స్పష్టతనిస్తూ ఆదాయపన్ను శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో 14 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా... తాజాగా మరో 11 సందేహాలకు స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం... స్వచ్చందంగా నల్లధనం గురించి సమాచారం బయటకు వెల్లడించే వారు తమ పాన్ నంబర్ ను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారు నిబంధనల మేరకు పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యక్ష పన్నులకు పాన్ నంబర్ ప్రత్యేక గుర్తింపు అని, ప్రయోజనాలు, మినహాయింపులు పొందాలన్నా ఇది తప్పనిసరి అని పేర్కొంది.
దేశంలో నివసించే వారితోపాటు ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ)లు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, ఐటీ శాఖ ఎవరి విషయంలోనైనా దాడులు నిర్వహించి, సెక్షన్ 153ఏ కింద నోటీసులు జారీ చేస్తే అటువంటి వారు ఈ పథకానికి అర్హులు కారు. పన్ను వర్తించే ఆదాయ శ్లాబ్‌లో ఉండి రిటర్నులు దాఖలు చేయనందుకు సమన్లు అందుకుని, తదుపరి చర్యల విషయంలో ఎలాంటి నోటీసులు జారీ కాకుండా ఉంటే అటువంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఒక కంపెనీ మరో కంపెనీలో విలీనమైనా లేదా పరిమిత బాధ్యతతో కూడిన భాగస్వామ్యం కుదుర్చుకున్నా (ఎల్‌ఎల్‌పీ)... విలీనం చేసుకున్న కంపెనీ పేరుమీద లేదా ఎల్‌ఎల్‌పీ పేరు మీద అయినా ఆస్తులు వెల్లడించవచ్చు.