‘బ్లాక్‌మనీ’పై దర్యాప్తు పూర్తి
♦ హెచ్‌ఎస్‌బీసీ, లీక్టెన్‌స్టీన్ జాబితాలపై విచారణ జరిపాం
♦ రూ. 15 వేల కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించాం: జైట్లీ
న్యూఢిల్లీ: విదేశాల్లోని భారతీయుల నల్లధనానికి సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ, లీక్టెన్‌స్టీన్ బ్యాంకుల జాబితాల్లో ఉన్న వారిపై ప్రభుత్వం దర్యాప్తును పూర్తి చేసిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం రూ. 15వేల కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించామని మంగళవారం రాజ్యసభకు తెలిపారు.‘హెచ్‌స్‌బీసీ జాబితాలోని 628 మందిపై దర్యాప్తు పూర్తయింది.
409 కేసుల్లో రూ. 8,437 కోట్ల డబ్బు ఉన్నట్లు అంచనా వేశారు. 190 విచారణలు మొదలయ్యాయి’ అని వెల్లడించారు. లీక్టెన్‌స్టీన్ జాబితాలోని వారిపై జరిపిన దర్యాప్తులో రూ. 6,500 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడిందన్నారు. పనామా పత్రాల్లోని ఖాతాలపై దర్యాప్తు మొదలైందని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్రవాదోపవాదాలు జరిగాయి. జైట్లీ అబద్ధాలాడుతున్నారని జెఠ్మలానీ ఆరోపించారు. ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రులు, అధికార పక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు ఎంత డబ్బు చేరిందో ప్రస్తుతానికి చెప్పలేమని జైట్లీ తెలిపారు.
జైట్లీకి ఆరోగ్యం బాగుండదా: జైరాం
‘రేపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జబ్బుపడతారా?’ అని రాజ్యసభలో జైరామ్ రమేశ్(కాంగ్రెస్) ఎద్దేవా చేశారు. బుధవారం సభలో చర్చకు రావాల్సిన ఆధార్ అంశాన్ని వాయిదావేయడంతో ఇలా ప్రశ్నించారు. ఆర్థికమంత్రికి ఆరోగ్యం బాగాలేదు కనుక ఆయన బుధవారం చర్చలో పాల్గొనరని తమకు సమాచారం అందిందని జైరామ్ తెలిపారు. సభలో చలాకీగా కనిపిస్తున్న జైట్లీ ఈ అంశం ఎందుకు వాయిదాపడిందో చెప్పాలంటూ.. ‘రేపు ఆయనకు ఆరోగ్యం బాగుండదా? అని అన్నారు.
‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా’ వాయిదా
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగింపు, దీని కోసం జాతీయ అభివృద్ధి మండలి భేటీ ప్రతిపాదనపై మంగళవారం రాజ్యసభలో జరగాల్సిన చర్చ..ఆర్థిక మంత్రి జైట్లీ లేకపోవడంతో వాయిదాపడింది.
దాడుల్లో 21,454 కోట్లు
రెండేళ్లలో ఆదాయపు పన్ను అధికారులు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో రూ.21,454 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో చెప్పారు. మొత్తం 992 కంపెనీలు/వ్యక్తుల స్థావరాల్లో అధికారులు సోదాలు చేశారన్నారు. ఆర్మీలో సహాయకులుగా పనిచేస్తున్న వారు కూడా యుద్ధవీరులేననీ, వారిని చిన్న పనులకు వినియోగించ కుండా ఆదేశాలిచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఎయిడ్స్ రోగులు చికిత్స, విద్య, ఉద్యో గాలు తదితరాల్లో ఇతరులతో సమానం గా హక్కులను పొందేందుకు ఉద్దేశించిన ‘హెచ్‌ఐవీ/ఎయిడ్స్(ప్రివెన్షన్, కంట్రోల్) బిల్లు’ను రాజ్యసభ ఆమోదించింది.