స్విస్ అకౌంట్లపై సర్జికల్ స్ట్రైక్స్కు రంగం సిద్ధం!
Published Tue, Nov 22 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ దేశంలో బ్లాక్మనీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న కేంద్రప్రభుత్వం.. స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న నల్లకుబేరుల బాగోతం కూడా ఇక గుట్టురట్టు చేయనుంది. స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న భారతీయుల అకౌంట్ల ఫైనాన్సియల్ సమాచారాన్ని 2019 నుంచి ఆటోమేటిక్ రూపంలో భారత్ పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీబీడీటీ చైర్మన్ సుశిల్ చంద్రా, ఇండియాలో స్విస్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ గిల్లెస్ రోడ్యూట్లు ఇరుదేశాల మధ్య ఆటోమేటిక్ రూపంలో సమాచార మార్పిడికి సంబంధించిన జాయింట్ డిక్లరేషన్పై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో విదేశాల్లో దాగిఉన్న లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం బయటకి రాబట్టనుంది. నేడు కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో 2019 నుంచి స్విట్జర్లాండ్లో ఉన్న భారతీయుల ఫైనాన్సియల్ అకౌంట్ల సమాచారం ఆటోమేటిక్గా పొందే సౌకర్యం భారత్కు లభించనుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ సమాచార మార్పిడికి సంబంధించి జూన్ 6 ప్రధాని నరేంద్రమోది, జెనీవాలో స్విస్ అధ్యక్షుడు జోహన్ ష్నీదర్-అమ్మన్తో భేటీ అయ్యారు. పన్ను ఎగవేసి, స్విస్లో దాచుకున్న నల్లధన వివరాలతో పాటు, నల్లకుబేరుల వివరాలను ఆటోమేటిక్గా ఇరు ప్రభుత్వాలు మార్పిడి చేసుకునేలా అవకాశం ఉండాలనే దానిపై ఆ దేశ అధ్యక్షుడితో చర్చించారు. మోదీ భేటీ అనంతరం నుంచి సమాచార మార్పిడి ఒప్పందంపై పలు దఫాల చర్చలు జరుగుతూ వచ్చాయి. నల్లధనంపై సర్జికల్ స్టైక్ చేస్తూ దేశంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. నల్లధనమంతా విదేశాల్లో దాగి ఉందని, స్విస్ బ్యాంకులపై సర్జికల్ స్టైక్ చేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చాయి. వారి విమర్శలకు కళ్లెం వేస్తూ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న సమాచారాన్ని ఆటోమేటిక్గా రాబట్టడానికి నేడు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Advertisement
Advertisement