న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయులు, దేశీ సంస్థలకు సంబంధించిన మరిన్ని వివరాలు భారత ప్రభుత్వానికి అందాయి. ఆటోమేటిక్ వార్షిక సమాచార మార్పిడి (ఏవోఈఐ) ఒప్పందం కింద స్విట్జర్లాండ్ నాలుగో విడత వివరాలు (వరుసగా నాలుగో ఏడాది) వీటిని అందజేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో వందల కొద్దీ వ్యక్తిగత, కార్పొరేట్ల, ట్రస్టుల ఖాతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, తదుపరి విచారణలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున పేర్లు, వివరాల విషయంలో గోప్యత పాటిస్తున్నట్లు వివరించారు.
తదుపరి విడత స్విస్ ఖాతాల వివరాలు మళ్లీ 2023 సెప్టెంబర్‌లో భారత్‌కు అందనున్నాయి. ఏవోఈఐ కింద ఈ ఏడాది 101 దేశాలకు 34 లక్షల ఖాతాల వివరాలు అందించినట్లు, ప్రతిగా ఆయా దేశాల నుంచి 29 లక్షల ఖాతాల వివరాలు పొందినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) వెల్లడించింది. సంపన్నులు అక్రమంగా సొమ్ము దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయన్న అపప్రదను తొలగించుకునే ప్రయత్నాల్లో భాగంగా 2018 నుంచి స్విట్జర్లాండ్ ఏఈవోఐ అమలు చేస్తోంది. భారత్‌తో ఒప్పందం 2019 నుంచి అమల్లోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment