నోరు విప్పనేల? గుట్టు చెప్పనేల? | issue of Swiss bank accounts | Sakshi
Sakshi News home page

నోరు విప్పనేల? గుట్టు చెప్పనేల?

Published Sun, Oct 26 2014 11:48 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నోరు విప్పనేల? గుట్టు చెప్పనేల? - Sakshi

నోరు విప్పనేల? గుట్టు చెప్పనేల?

టెలివిజన్ ప్రజాసామ్యం పార్టీలను ఇరకాటాల్లోకి తోసేసే పగుళ్ల మయం. రోజుకు సరిపడే సౌండ్ బైట్లకు అవసరమయ్యేటన్ని డెసిబుల్స్ శబ్దాలతో అది పర్యవసానాల ఆలోచనే రాకుండా ముంచెత్తుతుంది. కాబట్టే ప్రత్యర్థిపై దాడి అతి సునాయసంగా వారికే  బెడిసికొడుతుంటుంది. స్విస్ బ్యాంకు ఖాతాలపై ఆర్థిక మంత్రి జైట్లీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన దాడి విషయంలో అదే జరిగింది. ఆయనకు  దాచుకోవాల్సిందేదీ లేదని, కాపాడాల్సిన వాళ్లెవరూ లేర ని కాంగ్రెస్ విస్మరించింది. స్విస్ బ్యాంకులు వెల్లడి చేయబోయే ఏమంత గౌరవప్రదం కాని జాబితాలోతమ పార్టీకి చె ందిన గొప్ప వ్యక్తులు ఉన్నారని దానికి తెలుసు. కాబట్టే యూపీఏ ప్రభుత్వం స్విస్ ఖాతాల వెల్లడి సమస్యను ఎక్కడికీ చేర్చని నత్తనడక దారి పట్టించింది.
 
మౌనంగా భరించడమే బాధను అనుభవించే అత్యుత్తమ మార్గమంటూ మతం చాలానే బోధిస్తుంది. దురదృష్టవశాత్తూ మౌనం ప్రజాస్వామ్య సహజ లక్షణం కాదు. ఎన్నికల్లో ఓడిన వారి మొహంలో బాధ కొట్ట వచ్చినట్టు కనబడుతున్నప్పుడు సైతం మౌనం వహించడం అంతగా కనబడదు. మరులు గొలిపే టెలివిజన్ ప్రలోభపెడుతుండగా నోరు విప్పాలా, వద్దా?  అనే సందిగ్ధం మరింత పెరుగుతుంది. టీవీ ఎప్పుడూ మాట్లాడమనే శాసిస్తుంది.  
 
చట్ట విరుద్ధమైన స్విస్ బ్యాంకు ఖాతాలపై కాంగ్రెస్ మౌనం వహించడమే ఆ పార్టీ ప్రయోజనాలకు తగిన అత్యుత్తమమైన పని అయి ఉండేది. కానీ అందుకు విరుద్ధంగా అది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా మీడియా దాడిని చేపట్టింది. జైట్లీకి దాచుకోవాల్సినదిగానీ, కాపాడాలని ఆసక్తి చూపా ల్సిన వాళ్లు గానీ లేరు. ఈ సామాన్యమైన విషయాన్ని ఆ పార్టీ, దాని మద్దతుదార్లు విస్మరించారు. భారతీయుల స్విస్ ఖాతాల సమస్యపై యూపీఏ ప్రభుత్వం స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఒక ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం మన ప్రభుత్వం చార్జిషీట్లను దాఖలు చేసిన తర్వాత మాత్రమే స్విస్ బ్యాంకులు ఆ భారతీయ ఖాతాదార్ల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం సృష్టించిన ఈ సాంకేతికపరమైన అడ్డంకి కారణంగా స్విస్ ఖాతాదార్ల పేర్లను వెల్లడి చేయడం కేవలం కొంత సమయం పట్టే ప్రక్రియ మాత్రమే. స్విస్ బ్యాంకులు వెల్లడి చేయబోయే ఏమంత గౌరవప్రదం కాని ఆ జాబితాలో తమ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తులు  ఉన్నారని కాంగ్రెస్‌కు తెలుసు. కాబట్టే అది తన మోసకారితనానికి ఈ సాంకేతిక అడ్డంకిని నిరంతర రక్షణకవచంగా వాడుకుంది.  

నల్లధనం సమస్యను బహు లాఘవంగా దాటవేయడం కోసం యూపీఏ ఓ అంతుబట్టని వ్యూహాన్ని అనుసరించింది. స్విస్ ఖాతాదార్ల పేర్లను వెల్లడించే ప్రక్రియను అది ఎక్కడికీ చేర్చని ఓ నత్తనడక దారి పట్టించింది. తద్వారా 2014 సార్వత్రిక ఎన్నికల వరకు గడువును సంపాదించడమే దాని ఏకైక లక్ష్యం. దిగ్భ్రాంతికరమైన ఏ మాయో జరిగి కాంగ్రెస్ గనుక ఈ ఏడాది ఎన్నికల్లో ఏదో ఒక అతుకుల బొంత కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తగినన్ని సీట్లను దక్కించుకుని ఉంటే... ఆ నత్తనడక దారి కూడా మటుమాయమై ఉండేది. నల్లధనం బందిపోట్లు నవ్వులు చిందిస్తూ స్విస్ బ్యాంకుల బాట పట్టేవారు.

అందుకు నిదర్శనం కావాలంటే, స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు వెల్లడించిన ఒక వాస్తవాన్ని ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక ఈ నెల 22న ప్రచురించింది. దాన్ని చూడండి: ‘‘స్విస్ నేషనల్ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాల్లోని డబ్బు 2013లో 40 శాతం పెరిగింది. 2012లో 134 వందల కోట్ల స్విస్ ఫ్రాంకులుగా (రూ.9,514 కోట్లు) ఉన్న ఆ డబ్బు 2013లో దాదాపు రెండు వందల కోట్ల స్విస్ ఫ్రాంకులకు (రూ. 14,000 కోట్లు) చేరింది.’’

హఠాత్తుగా ఇలా చట్ట విరుద్ధ మార్గాల్లో స్విస్ ఖాతాల్లోని నల్లధనం రూ. 4,500 కోట్ల హైజంప్ చేయడానికి కారణమేమిటి? అక్రమార్జనాపరుల డబ్బులతో నిండిన బ్యాంకుల నుండి మాత్రమే వచ్చే రాబడిపై బతికే జలగల్లాంటి చిన్న చిన్న ద్వీప దేశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక  నేరాల వల్ల అత్యధికంగా లబ్ధిపొందేవి అవే. అలాంటి చోట్లకు ఇంకెంత డబ్బు తరలిపోయిందో మనకు తెలియదు. తాము ఖాతాదార్లకు చేసిన ప్రమాణాన్ని పాటిస్తున్నామనే సాకుతో ఆ బ్యాంకులు తమ వద్ద డిపాజిట్ చేస్తున్న డబ్బు ఎక్కడిదని అడగవు. మన దేశం నుండి డబ్బును బయటకు తరలించింది ఎవరో విద్యావంతులమైన మనం తేలికగానే ఊహించగలం. ఇందులో కొంత భాగం వ్యాపారస్తులు పంపినదై ఉంటుంది. కానీ 2013 వ్యాపారపరంగా వికాసాన్ని చవి చూసిన సంవత్సరమేమీ కాదు. పైగా తీవ్ర ఆర్థిక క్షీణత కనిపించింది. అయితే ఒక రంగం మాత్రం భారీ గెంతు వేసి మరీ వృద్ధి చెందింది... అది అవినీతి.  ఈ క్రీడలో పెద్ద పెద్ద ఆటగాళ్లంతా అధికార వర్గ రాజకీయవేత్తలే.

2014 సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు 2013 సంవత్సరం ముగియడమనే విషయానికి ప్రాధాన్యం ఉంది. చలి కాలం వచ్చేసరికే పూర్తిగా గుడ్డివాళ్లయితే తప్ప రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గురికానున్నదని అందరికీ సుస్పష్టంగా తెలుసు. ఇంకా ఏమైనా అనుమానాలు మిగిలి ఉంటే అవి కూడా సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో, ఆయన సభలకు ప్రజలు చరిత్రాత్మక స్థాయిలో విరగబడు తుండటంతో మటుమాయమై పోయి ఉంటాయి. యూపీఏ ప్రభుత్వంతో కుమ్మక్కు, భాగస్వామ్యాల సువర్ణ దశాబ్దం వేగంగా ముగింపునకు వస్తోందని కేటుగాళ్లంతా అప్పుడే గ్రహించారని, తమ అక్రమార్జనను స్విస్ (ఇంకా అలాంటి ఇతర) ఖాతాలకు బదలాయించడం ప్రారంభించారని నా అనుమానం.

ఈ దోపిడీ సంపదను పట్టుకోడానికి నరేంద్ర మోదీ ఈ నాలుగు నెలల్లో, కాంగ్రెస్ పదేళ్లలో చేసిన దానికంటే ఎక్కువే చేశారు. ‘‘నేను దొంగతనం చేయను, ఎవరు దొంగతనం చేయడాన్నీ అనుమతించను’’ అంటూ ప్రధాని ఎలాంటి అస్పష్టతకు తావులేని విధంగా తమ ప్రభుత్వానికి ఒక నైతిక రేఖను గీశారు. తద్విరుద్ధంగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ‘‘సంకీర్ణం ఒత్తిడులు’’ సాకుతో తన మంత్రి వర్గంలోని దొంగలు దేశాన్ని దోచేస్తుంటే మరో దిక్కుకు చూస్తూ కూచున్నారు. ఎంత తక్కువ చేసి చూసినా గానీ ఇలాంటి సాకును చూపడం సిగ్గుచేటుతనమే. అతి పలచటి ఈ ముసుగులో నమ్మశక్యం కానంతటి పెద్ద మొత్తాల్లో దొంగిలించిన సొత్తు దేశం బయటకు దాటించేశారు.

దేశం నుండి ఎంత మొత్తం సంపద ఇలా మటుమాయమైందో కచ్చితంగా అంచనా కట్టడం దాదాపు అసాధ్యమే. కానీ వాషింగ్టన్‌కు చెందిన ‘గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ’ సంస్థ 1947 నుండి తరలిపోయిన సంపద మొత్తాన్ని 462 వందల కోట్ల డాలర్లుగా లేదా రూ. 29 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇందులో అత్యధిక భాగం ఇటీవలి ఏళ్లలోనే దేశం వదిలిపోయినదని భావించడం సమంజసమే. దశాబ్దకాలపు యూపీఏ హయాంలోనైతే ఆ విష యంలో తొక్కిసలాట జరిగిందని అనుకోవచ్చు. వెళ్లడానికే తప్ప తిరిగిరావడా నికి వీల్లేని వన్ వే స్ట్రీట్ లాగానే ఇంతవరకు ఈ వ్యవహారం సాగుతోంది. ఆ స్వేచ్ఛాయుత రవాణా ముసిగిపోయింది.

టెలివిజన్ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలను ఇరకాటాల్లోకి తోసేసే పగుళ్ల మయం. రోజుకు సరిపడే సౌండ్ బైట్లకు అవసరమయ్యేటన్ని డెసిబుల్స్ శబ్దాలతో అది పర్యవసానాల ఫలితాల గురించిన ఆలోచనే రాకుండా వారిని ముంచెత్తుతుంది. కాబట్టే ప్రత్యర్థిపై చేసిన దాడి అతి సునాయాసంగా వారిపైకే  బెడిసికొట్టేదిగా మారుతుంటుంది. ప్రత్యేకించి అ దాడికి ఎంచుకున్న లక్ష్యం భ్రమాత్మకమైనది అయినప్పుడు బె డిసి కొట్టే దెబ్బ నుండి తప్పుకోవడం సైతం సులభం కాదు. విచక్షణను ఉపయోగించాలనుకోవడం, సహనం వహించడం మొట్టమొదట చేయాల్సిన మరింత తెలివైన పని అవుతుంది.     
 
 ఎం.జె. అక్బర్   సీనియర్ సంపాదకులు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement