విద్వేషంపై ఉదాసీనత | Rahul Gandhi demands JPC probe on Facebook | Sakshi
Sakshi News home page

విద్వేషంపై ఉదాసీనత

Published Tue, Aug 18 2020 4:13 AM | Last Updated on Tue, Aug 18 2020 8:48 AM

Rahul Gandhi demands JPC probe on Facebook - Sakshi

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ అనుసరిస్తున్న వైఖరి కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేసింది. భారత్‌లోని బీజేపీకి చెందిన కొందరు నేతల విద్వేషపూరిత పోస్టులపై ఫేస్‌బుక్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికా ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’లో వచ్చిన కథనంపై ఇప్పటికే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించిన విషయం తెలిసిందే.

ఈ కథనంపై రాజకీయ దుమారం రేపడంతో సోమవారం ఫేస్‌బుక్‌ స్పందించింది. హింసను ప్రేరేపించే విద్వేష పూరిత అంశాలను అడ్డుకుంటున్నామని, రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని పాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, తనను కొందరు ఆన్‌లైన్‌లో తీవ్రంగా బెదిరిస్తున్నారనీ, ప్రాణహాని ఉందంటూ ఆ సంస్థ ఉన్నతాధికారిణి

ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 బీజేపీ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లుగా వదిలేస్తోందంటూ ఇటీవల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఒక కథనం వెలువడింది. మత విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యేపై శాశ్వత నిషేధం విధించాలని తీసుకున్న నిర్ణయం భారత్‌లోని తమ ఉన్నతాధికారి జోక్యం కారణంగా ఆగిపోయిందని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు కొందరు తెలిపారంటూ ఆ కథనంలో పేర్కొంది.

దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆదివారం స్పందించారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయి. వీటి ద్వారా తప్పుడు వార్తలను, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి’అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో.. విద్వేషాన్ని ప్రేరేపించే వ్యక్తులు లేదా వేదికలను వదలకూడదు. ఫేస్‌బుక్‌ నిష్క్రియాపరత్వం ఫలితంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది.

అభ్యంతరకర అంశాలు ఆ సంస్థ దృష్టికి వచ్చినప్పటికీ కొనసాగించడంతోపాటు ఎలాంటి చర్య తీసుకోకపోవడం హాస్యాస్పదం, ఘోరం’అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర దేశాల్లో వదంతులు సృష్టించే, విద్వేషాలను పెంచే పోస్టులను తొలగించే ఫేస్‌బుక్‌.. భారత్‌లో మహిళలపై వేధింపులు, కొన్ని వర్గాలను, మతాలను లక్ష్యంగా చేసుకుని పెట్టే పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విధంగా ఒక్కో దేశానికి ఒక్కో  నిబంధనను ఫేస్‌బుక్‌ అమలు చేయడం సరికాదని తెలిపారు. ఫేస్‌బుక్‌తోపాటు వాట్సాప్‌లోనూ వదంతుల వ్యాప్తి, విద్వేషపూరిత సమాచారంపై  అదుపూ లేదన్నారు.

ఫేస్‌బుక్‌–బీజేపీ కుమ్మక్కు: సీపీఎం
విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వాల్‌స్ట్రీట్‌ కథనంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. అధికార పార్టీ నేతలకు ఫేస్‌బుక్‌లో పెట్టుబడులున్నాయనీ, కేంద్రంతో ఆ సంస్థ కుమ్మక్కయిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే జేపీసీ  ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది.

నాకు ప్రాణహాని ఉంది: ఫేస్‌బుక్‌ అధికారిణి
తనకు ప్రాణహాని ఉందని, చంపుతామని బెదిరిస్తూ కొందరు ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారంటూ ఫేస్‌బుక్‌ సంస్థ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఏసియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంఖి దాస్‌ ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌ వ్యవహారంపై ఒకపక్క రాజకీయ దుమారం చెలరేగుతుండగా ఆదివారం ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.


‘నా జీవితాన్ని నాశనం చేస్తామని, నన్ను చంపుతామంటూ ఆన్‌లైన్‌లో నా ఫొటో పెట్టి మరీ బెదిరిస్తున్నారు. వార్తా కథనాన్ని సాకుగా చూపుతూ నా ప్రతిష్టను దెబ్బతీసేలా, నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. వీటి కారణంగా నాతోపాటు నా కుటుంబసభ్యుల భద్రత ప్రమాదంలో పడింది’అని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతలను సైబర్‌ విభాగానికి అప్పగించినట్లు ఢిల్లీ పోలీస్‌ విభాగం అదనపు పీఆర్‌వో అనిల్‌ మిట్టల్‌ తెలిపారు.

మరింత చేయాల్సి ఉంది: ఫేస్‌బుక్‌
వాల్‌స్ట్రీట్‌ కథనంపై చెలరేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ప్రతినిధి స్పందించారు. ‘విద్వేష ప్రసంగాలను, హింసను ప్రేరేపించే అంశాలను మేం అడ్డుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ లేదా నేతతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ విషయంలో చేయాల్సింది ఇంకా ఉందని మాకు తెలుసు. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా, కచ్చితత్వంతో ఉండేలా  ఆడిట్‌ చేపట్టాం. ఇది కొనసాగుతుంది’అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement