నల్లకుబేరులను పట్టేయొచ్చు! | India gets nod to access details on black money stashed in Swiss banks | Sakshi
Sakshi News home page

నల్లకుబేరులను పట్టేయొచ్చు!

Published Mon, Nov 20 2017 1:39 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

India gets nod to access details on black money stashed in Swiss banks - Sakshi - Sakshi - Sakshi

బెర్న్‌/న్యూఢిల్లీ: స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి కీలక ముందడుగు పడింది. భారత్‌తో ఆటోమేటిక్‌గా ఈ వివరాలు పంచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందానికి స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ కమిటీ  ఆమోదం తెలిపింది. భారత్‌తో పాటు మరో 40 దేశాలకు వర్తించే ఈ ఒప్పందానికి స్విట్జర్లాండ్‌ ఎగువ సభలోని ఆర్థిక వ్యవహారాలు, పన్ను ఎగవేతల కమిషన్‌ పచ్చజెండా ఊపింది. సమాచార మార్పిడి జరిగిన తరువాత తలెత్తే వివాదాలను ఎదుర్కొనేలా నిబంధనలను పటిష్టం చేయాలని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వానికి సూచించింది.

వ్యక్తుల ప్రయోజనాలు పరిరక్షిస్తూనే, సమాచారం కోసం దాఖలైన న్యాయబద్ధ క్లెయిమ్‌ దుర్వినియోగమయ్యే అవకాశాలున్నప్పుడు వివరాలు వెల్లడించకుండా సవరణ తేవాలని ప్రతిపాదించింది. ఇక తదుపరి దశలో ఈ ఒప్పందాన్ని నవంబర్‌ 27 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ఎగువ సభలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే 2019 నుంచి ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. దిగువ సభ నేషనల్‌ కౌన్సిల్‌లో ఈ ఒప్పందం సెప్టెంబర్‌లోనే గట్టెక్కింది.

మొత్తం చిట్టా తెలుస్తుంది....
గోప్యతకు మారుపేరైన స్విస్‌ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్లధనం వివరాలను భారత్‌ నిరంతరం పొందడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఖాతా సంఖ్య, ఖాతాదారుడి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, బీమా పాలసీల నుంచి చెల్లింపులు, క్రెడిట్‌ బ్యాలెన్స్, ఆస్తుల విక్రయం నుంచి లభించిన ఆదాయం తదితర అన్ని విషయాలను పరస్పరం మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందంటే...ఎవరైనా భారతీయునికి స్విట్జర్లాండ్‌ బ్యాంకులో ఖాతా ఉందనుకుంటే,  బ్యాంకు ఆ ఖాతాదారుడికి సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని అక్కడి సంబంధిత అధికారులకు సమర్పిస్తుంది. ఆ తరువాత స్విస్‌ అధికారులు ఆటోమేటిక్‌గా సమాచారాన్ని భారత్‌కు చేరవేస్తారు.

భారత్‌లో అధికారులు ఆ వివరాలను పరిశీలించొచ్చు. ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిన ఎగువ సభ కమిటీ...భారత్, ఇతర దేశాలతో ఆటోమేటిక్‌ సమాచార మార్పిడికి సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాలు రూపొందించాలని  ప్రభుత్వానికి సూచించింది. సమాచారం పొందుతున్న భారత్‌ లాంటి దేశాలు నిర్దిష్ట షరతులకు కట్టుబడి ఉంటున్నాయా? లేదా? అని కేబినెట్‌కు సమానమైన ఫెడరల్‌ కౌన్సిల్‌ ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఇతర పార్లమెంట్‌ కమిటీలతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని పేర్కొంది. సమాచారం వెల్లడించిన తరువాత సంబంధిత ఖాతాదారులు స్వదేశాల్లో వేధింపులకు గురయ్యే అవకాశాలున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వారి ప్రయోజనాల రక్షణార్థం తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

‘పనామా కంపెనీల’పై నేరారోపణలు
న్యూఢిల్లీ: గతేడాది సంచలనం సృష్టించిన పనామా పేపర్లలో పేర్లు వెల్లడైన ఏడు భారతీయ కంపెనీలపై కొత్త నల్లధన వ్యతిరేక చట్టం కింద నేరారోపణలను ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం మోపింది. ఇక్కడి ప్రభుత్వానికి చెప్పకుండా, విదేశాల్లో ఈ కంపెనీలు దాచిన డబ్బు, ఆస్తులను ఐటీ విభాగం గుర్తించిందనీ, వాటిపై దర్యాప్తు ప్రారంభమైందనీ, నేర విచారణ మొదలుపెడతామని అధికారులు తెలిపారు. నేరం రుజువైతే జరిమానాతోపాటు 120 శాతం పన్ను, యజమానులకు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కంపెనీలపై త్వరలోనే నగదు అక్రమ రవాణా చట్టం కింద విచారణ ప్రారంభం కానుంది. పనామా పేపర్లకు సంబంధించిన జరిపిన విచారణల్లో రూ.792 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడినట్లు ఇటీవలే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించడం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement