జెనీవా: రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన వింటేజ్ విమానం స్విట్జర్లాండ్‌లో కూలిపోవడంతో 20 మంది దుర్మరణం చెందారు. 1939లో జర్మనీలో తయారైన జేయూ52 హెబీ–హెచ్‌వోటీ విమానం.. 3 వేల మీటర్ల ఎత్తయిన పిజ్ సెగ్నాస్ పర్వతంపై శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) కూలిపోయింది. పర్వతం పశ్చిమ వైపున 2,540 మీటర్ల (సుమారు 8333 అడుగులు) ఎత్తులో ప్రమాదం సంభవించిందని.. మృతుల్లో 11 మంది పురుషులు, 9 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు శాఖ అధికార ప్రతినిధి అనిటా సెంటీ తెలిపారు.
స్విట్జర్లాండ్‌లోని టిసినో నుంచి బయలుదేరిన విమానం జూరిచ్‌లోని డ్యూబెండోర్ఫ్ మిలటరీ ఎయిర్‌ఫీల్డ్‌కు చేరాల్సి ఉందని జర్మన్ పత్రిక బ్లింక్ తెలిపింది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఐదు హెలికాప్టర్లను పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ఎయిర్ స్పేస్‌లో విమానాల రాకపోకలను ఆదివారం రాత్రి వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ‘180 డిగ్రీలకు దక్షిణంగా విమానం మళ్లింది. అంతలోనే ఓ రాయిలాగా నేలపై కుప్పకూలింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment