![Trump Announce Tariffs On All Steel, Aluminum Imports](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/donladtrump.jpg.webp?itok=pGIEPwKB)
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) అన్నంత పని చేస్తున్నారు. ఒక్కో దేశంపై వరుస పెట్టి సుంకాల మోత మోగించేస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరతీసేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం లోపు పరస్పర సుంకాల (reciprocal tariffs) విధింపుపై ప్రకటన చేస్తాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ పరస్పర సుంకాల విధింపుల లక్ష్యం ఏంటో స్పష్టత ఇవ్వలేదు. తాను విధించబోయే పరస్పర సుంకాలు విదేశీ సుంకాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు. ఇది అన్నీ దేశాలకు వర్తిస్తుందని అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా నుంచి వసూలు చేస్తే.. మేము వారి నుంచి వసూలు చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.
తొలిసారి ఎంత విధించారంటే?
తొలిసారి 2016-2020వరకు అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన ట్రంప్ స్టీల్‌పై 25శాతం, 10శాతం అల్యూమినియంపై టారిఫ్ విధించారు. అదే సమయంలో కెనడా, మెక్సికో, బ్రెజిల్‌తో సహా వ్యాపార భాగస్వాములకు పన్ను రహిత(డ్యూటీ ఫ్రీ) లావాదేవీలు జరిగేలా చూశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ డ్యూటీ ఫ్రీ వ్యాపార కార్యకలాపాల్ని బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్‌లకు విస్తరించారు.
కెనడా,మెక్సికోకు దెబ్బ
అమెరికా అధికారిక గణాంకాల ప్రకారం.. ట్రంప్ విధించబోయే 25శాతం సుంకం ప్రభావం కెనడా, బ్రెజిల్, మెక్సికో వాణిజ్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు సౌత్ కొరియా, వియాత్నంలు సైతం భారీ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కెనడా నుంచి 79శాతం అల్యూమినియం అమెరికాకు ఎగుమతి అవుతుంది. 2024 మొదటి 11 నెలల్లో అమెరికాకు 79 శాతం ఎగుమతి చేసింది. కెనడా తర్వాత అల్యూమినియం స్క్రాప్, అల్యూమినియం మిశ్రమం ప్రధాన సరఫరాదారుగా మెక్సికో కొనసాగుతుంది. ఈ తరుణంలో ట్రంప్ నిర్ణయాలు ఆయా దేశాల వాణిజ్య విభాగంలో ఆటు పోట్లు ఎదురు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment