Domestic banking
-
బలహీన విధానాలతోనే బ్యాంకింగ్ సంక్షోభం
ముంబై: బలహీన వ్యాపార విధానాలే అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమై ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకుల వ్యాపార విధానాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో భారత బ్యాంకులు బలంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవలే సిలికాన్ వ్యాలీ బ్యాంకులో నిధుల సమస్య తలెత్తడం తెలిసిందే. డిపాజిటర్లలో అభద్రతకు దారితీసి, ఆ ప్రభావం ఇతర బ్యాంకులకూ విస్తరించడం తెలిసిందే. ఈ క్రమంలో శక్తికాంతదాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అమెరికాలో ఇటీవలి పరిణామాలు చూస్తే అక్కడ విడిగా ఒక్కో బ్యాంకుల వారీ వ్యాపార విధానాలు సరిగ్గానే ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. భారత బ్యాంకుల వ్యాపార విధానాలను ఆర్బీఐ మరింత పరిశీలనగా చూడడం మొదలు పెట్టింది. ఒకవేళ లోపాలు ఉంటే అది సంక్షోభానికి దారితీయవచ్చు’’అని శక్తికాంతదాస్ చెప్పారు. ముంబైలో ఓ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా దాస్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బ్యాంకులు అనుసరించే వ్యాపార విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో వాటి బ్యాలెన్స్ షీట్లలోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడొచ్చు. అవి ఆ తర్వాత పెద్ద సంక్షోభానికి కారణం కావచ్చు. అమెరికా, యూరప్ బ్యాంకింగ్‌లో ఇటీవలి పరిణామాలు గమనిస్తే వాటి బ్యాలెన్స్ షీట్లలో సురక్షిత ఆస్తులు అనుకున్న వాటి నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది’’అని దాస్ పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభానికి ఆస్తుల, అప్పుల మధ్య అసమతుల్యత వల్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండడం తెలిసిందే. -
మొండిబండ 10 లక్షల కోట్లు!
ముంబై: ఆర్బీఐ ఆదేశాలతో దేశీయ బ్యాంకులు చేపట్టిన దిద్దుబాటు చర్యల ఫలితంగా... గడిచిన ఆర్థిక సంవత్సరం (2017–18)లో బ్యాంకింగ్ రంగంలోని స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ) ఏకంగా 11.2 శాతం... అంటే రూ.10.39 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్థూల ఎన్పీఏల శాతం 9.3గానే ఉంది. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) వాటా రూ.8.95 లక్షల కోట్ల వరకూ ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. శాతం వారీగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏలు 14.6 శాతానికి సమానం. 2016–17లో పీఎస్‌బీల స్థూల ఎన్పీఏల శాతం 11.7గా ఉంది. ‘‘2017–18లో ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏల రేషియో 14.6 శాతానికి చేరింది. పునరుద్ధరించిన రుణాలు ఎన్పీఏలుగా మారడం, ఎన్పీఏలను గుర్తించడానికి మరింత మెరుగైన విధానాన్ని అనుసరించటం ఇందుకు కారణం’’ అని ‘2017–18లో బ్యాంకింగ్ రంగ ధోరణులు, ప్రగతి’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ తెలియజేసింది. ముఖ్యంగా పెద్ద రుణ ఖాతాల (రూ.5 కోట్లకుపైన) నుంచి ఎన్పీఏలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద రుణ ఖాతాల వారీగా స్థూల ఎన్పీఏలు 18.1 శాతం నుంచి 23.1 శాతానికి పెరిగాయి. ఎన్పీఏల పరిష్కారం, ఆస్తుల నాణ్యతపై పర్యవేక్షణ కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టంచేసింది. నివేదికలోని ఇతర అంశాలివీ... ప్రభుత్వరంగ బ్యాంకుల నికర ఎన్పీఏలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 6.9 శాతం నుంచి 2017–18లో 8 శాతానికి పెరిగిపోయాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల పెరుగుదల తక్కువగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 4.1 శాతం నుంచి 2017–18లో 4.7 శాతానికి చేరాయి. ఎన్పీఏలను మాఫీ చేయడం ద్వారా ప్రైవేటు రంగ బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను శుభ్రం చేసుకోవడం, మెరుగైన వసూళ్ల వంటి చర్యలు స్థూల ఎన్పీఏలు తగ్గేందుకు దోహదపడినట్టు ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. దేశంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకుల ఆస్తుల నాణ్యత అంతకముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4 శాతం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతానికి మెరుగుపడింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రూ.14,000 కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ని మోసగించడంతో... జెమ్స్, జ్యుయలరీ రంగం నుంచి ఎన్పీఏలు ఎక్కువగా ఉన్నాయి. పీసీఏలోని బ్యాంకుల పనితీరు మెరుగు ఆర్బీఐ స్పష్టమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి 11 ప్రభుత్వరంగ బ్యాంకులు చేరగా, వీటి స్థూల ఎన్పీఏల పెరుగుదల 2017–18లో తగ్గుముఖం పట్టడం గమనార్హం. అంతేకాదు, ఎన్పీఏల రికవరీలు కూడా పెరిగాయని ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. అయితే, పీసీఏ పరిధిలోని బ్యాంకులు కొత్తగా రుణాలిచ్చేందుకు, డిపాజిట్లు సేకరించేందుకు అవకాశం ఉండదు. దీనివల్ల ఆస్తుల పరంగా రిస్క్ తగ్గి, మెరుగైన ఆస్తులపై దృష్టి పెట్టడానికి వీలుంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. పెరిగిపోతున్న మోసాలు రిస్క్ నిర్వహణ పరంగా మోసాలనేవి ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయని, 90 శాతం మోసాలు రుణ పోర్ట్‌ఫోలియో నుంచి ఉంటున్నాయని ఈ నివేదిక తెలియజేసింది. 2017–18లో మొత్తం మోసాల్లో రూ.50 కోట్లు, అంతకుమించి విలువతో ఉన్నవి 80 శాతంగా ఉన్నాయి. రూ.10 లక్షలకు పైగా విలువైన మోసాల్లో 93 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే జరుగుతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల వాటా 6 శాతంగానే ఉండడం గమనార్హం. ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్య లేదు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) వృద్ధి స్థిరంగా ఉందని, లిక్విడిటీ (నిధుల లభ్యత) ఆందోళనలు ఉపశమించాయని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. ఎన్బీఎఫ్సీ సంస్థల సహజసిద్ధమైన బలాలు, అదే సమయంలో ఆర్బీఐ వైపు నుంచి నిఘా, నియంత్రణపరమైన పర్యవేక్షణలతో ఈ రంగం వృద్ధి నిలకడగానే ఉందని తన నివేదికలో నిర్ధారించింది. అతిపెద్ద ఎన్బీఎఫ్సీ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వరుసగా పలు రుణ చెల్లింపుల్లో విఫలమైన తర్వాత ఈ రంగంలో నిధుల సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఆర్బీఐ పలు మార్లు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా వ్యవస్థలోకి నిధుల అందుబాటును పెంచింది. ఎన్‌బీఎఫ్‌సీల లాభదాయకత, ఆస్తుల నాణ్యత, క్యాపిటల్ అడెక్వసీ 2017–18లో మెరుగుపడిందని ఆర్బీఐ తెలిపింది. ఈ సంస్థల కన్సాలిడేటెడ్ బ్యాలన్స్ షీటు 2017–18లోనూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు మరింత విస్తరించిందని వెల్లడించింది. 1,000 ఏటీఎంల మూత గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికరంగా వెయ్యి ఏటీఎంలు మూతపడ్డాయి. 2016–17లో 2.08 లక్షల ఏటీఎంలు పనిచేస్తుంటే, 2017–18కి వచ్చే సరికి వీటి సంఖ్య 2.07 లక్షలకు తగ్గింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఏటీఎంల క్రమబద్ధీకరణ వల్లే తగ్గుదల చోటు చేసుకుందని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఆన్సైట్ ఏటీఎంలు (బ్యాంకు బ్రాంచీలకు అనుబంధంగా ఉండేవి) 1.09 లక్షల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1.06 లక్షలకు తగ్గాయి. అదే సమయంలో ఆఫ్‌సైట్ ఏటీఎంల సంఖ్య 98,545 నుంచి లక్షకు పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు 1.48 లక్షల నుంచి 1.45 లక్షలకు తగ్గాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల ఏటీఎంలు 58,833 నుంచి 60,145కు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మధ్య ఏటీఎంలు మరింత తగ్గి 2.04 లక్షలుగా ఉన్నాయి. ఇక పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్స్ ఎక్కువగా పెరిగాయి. వైట్‌లేబుల్ ఏటీఎంలు (బ్యాంకులు కాకుండా ఇతర సంస్థలు ఏర్పాటు చేసేవి) 15,000 మార్క్ ను అధిగమించాయి. 2013–14 నాటికి ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ల లావాదేవీల మొ త్తం రూ.8,100 కోట్లు కాగా, 2017–18కి రూ.1.42 లక్షల కోట్లకు పెరిగింది. -
బ్యాంకులకు ‘ఉక్కు’ సంకెళ్లు..!
♦ ఎన్పీఏలుగా మారనున్నమరో రూ. 50 వేల కోట్ల రుణాలు ♦ స్టీల్ రంగానికి ప్రత్యేక ఫండింగ్ ఏజెన్సీ ♦ ఏర్పాటు చేయాలంటున్న బ్యాంకులు ♦ కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని గగ్గోలు కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిలతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న దేశీ బ్యాంకింగ్ రంగానికి ఇప్పుడు ‘స్టీల్’ భయం పట్టుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ధర పతనంతో తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ఇనుము-ఉక్కు రంగ కంపెనీలు బ్యాంకర్లకు దడ పుట్టిస్తున్నాయి. ఎందుకంటే.. రానున్న కాలంలో ఈ రంగానికి ఇచ్చిన రుణాల్లో దాదాపు మరో రూ.50 వేల కోట్ల రుణాలు మొండిబకాయిలు(ఎన్పీఏ)లుగా మారనున్నట్లు అంచనా. ఆర్థిక సంవత్సరం ముగియడంతో భారీగా రుణాలు తీసుకున్న ఉక్కు కంపెనీల నుంచి బకాయిలు వసూలు చేసుకోవడంపై బ్యాంకులు దృష్టిసారిస్తున్నాయి. అవసరమైతే వాటిని డిఫాల్టర్ల జాబితాలో చేర్చేందుకు సైతం సమాయత్తమవుతున్నాయి. దీనివల్ల ప్రొవిజనింగ్ కేటాయింపులు పెరిగిపోయి బ్యాంకుల లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు బ్యాంకులు రికవరీ ప్రక్రియను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, తీవ్ర అనిశ్చితిలో ఉన్న స్టీల్ రంగానికి ఇకపై తాము కొత్తగా రుణాలిచ్చే పరిస్థితి లేదని కూడా బ్యాంకర్లు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ త్రైమాసికంలోనే... స్టీల్ రంగ రుణాలకు సంబంధించి ఎన్పీఏలుగా మారనున్న రూ.50 వేల కోట్లను చాలా వరకూ ఈ ఏడాది(2016-17) తొలి త్రైమాసికంలో తమ ఖాతా పుస్తకాల్లో మొండిబకాయిలుగా చూపనున్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం కొన్ని స్టీల్ రుణాలను గతేడాది ఆఖరి త్రైమాసికం(క్యూ4)లోనే ఎన్పీఏలుగా పరిగణించినట్లు సమాచారం. భారీ రుణ భారంతో ఇప్పటికే ఉన్న భూషణ్ స్టీల్, ఎస్సార్, విసా స్టీల్, ఎలక్ట్రో స్టీల్ వంటి కొన్ని కంపెనీలతో ఇప్పటికే బ్యాంకర్లు చర్చలు జరిపినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇందులో చాలా వరకూ కంపెనీలకు ఇచ్చిన రుణాలను బ్యాంకులు 5/25 స్కీమ్ కింద పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. ఆర్బీఐ 2014లో తీసుకొచ్చిన ఈ స్కీమ్ ప్రకారం ఏదైనా కంపెనీకి ఇచ్చిన రుణాలను బ్యాంకులు అవసరమైతే మరో 25 ఏళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రతి ఐదేళ్లకోసారి వడ్డీరేట్లను సవరించే షరతు విధిస్తారు. దీనివల్ల రుణ గ్రహీతలకు రీపేమెంట్ సులభం అవడమే కాకుండా చెల్లించాల్సిన కిస్తీ(ఇన్స్టాల్మెంట్) మొత్తం కూడా తగ్గుతుంది. గతేడాది డిసెంబర్ నాటికి మొత్తం బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ రుణాల్లో 21 శాతం(దాదాపు రూ.54,051 కోట్లు) ఇనుము-ఉక్కు రంగ కంపెనీలవే. 2015 సెప్టెంబర్ చివరివరకూ చూస్తే స్టీల్ రంగం స్థూల ఎన్పీఏలు 8.4 శాతం కాగా, వచ్చే ఏడాది మార్చికల్లా ఇవి 12 శాతానికి ఎగబాకవచ్చని అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పుడు అత్యధికంగా రుణభారం ఉన్న రంగం కూడా ఇదే కావడం గమనార్హం. ప్రత్యేక ఏజెన్సీయే శరణ్యం... రానున్న కాలంలో తాము ఇక స్టీల్ రంగానికి రుణాలివ్వడం అసాధ్యమని... అందువల్ల ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. విద్యుత్ రంగానికి రుణకల్పన కోసం ఏర్పాటు చేసిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) తరహాలో స్టీల్ రంగానికి కూడా ఒక ఫండింగ్ ఏజెన్సీని నెలకొల్పే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఎస్బీఐ ఎండీ బి. శ్రీరామ్ ఇటీవల ఒక నోట్లో అభిప్రాయపడ్డారు. ఎందుకంటే 2025 నాటికి ఈ రంగం వార్షిక ఉత్పాదక సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరాలన్న లక్ష్యం సాకారమవ్వాలంటే.. రూ.10 లక్షల కోట్ల రుణాలు అవసరమవుతాయన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. స్టీల్ రంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం కనీస దిగుమతి ధర(ఎంఐపీ), రక్షణాత్మక దిగుమతి సుంకం వంటి చర్యలు తీసుకుంటోందని.. దీనివల్ల పరిశ్రమకు కొంత ప్రయోజనం ఉంటున్నప్పటికీ, ఉక్కు వినియోగ రంగాలైన ఆటోమొబైల్, గృహోపకరణాలు, ఇంజినీరింగ్ కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఎస్బీఐ నోట్ ప్రస్తావించింది. ఇనుము-ఉక్కు రంగం పరిస్థితి ఇదీ ♦ బ్యాంకుల మొత్తం రుణాలు: రూ. 3 లక్షల కోట్లు ♦ మొండిబకాయిలుగా మారిన రుణాల పరిమాణం: 27 శాతం ♦ బ్యాంకుల మొత్తం రుణాల్లో స్టీల్ రంగం వాటా: 4.7 శాతం ♦ మొత్తం ఎన్‌పీఏల్లో దీని వాటా: 6.9%