ముంబై: ఆర్‌బీఐ ఆదేశాలతో దేశీయ బ్యాంకులు చేపట్టిన దిద్దుబాటు చర్యల ఫలితంగా... గడిచిన ఆర్థిక సంవత్సరం (2017–18)లో బ్యాంకింగ్ రంగంలోని స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) ఏకంగా 11.2 శాతం... అంటే రూ.10.39 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్థూల ఎన్‌పీఏల శాతం 9.3గానే ఉంది. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) వాటా రూ.8.95 లక్షల కోట్ల వరకూ ఉన్నట్లు ఆర్‌బీఐ నివేదిక తెలియజేసింది. శాతం వారీగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల ఎన్‌పీఏలు 14.6 శాతానికి సమానం. 2016–17లో పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏల శాతం 11.7గా ఉంది. ‘‘2017–18లో ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏల రేషియో 14.6 శాతానికి చేరింది. పునరుద్ధరించిన రుణాలు ఎన్‌పీఏలుగా మారడం, ఎన్‌పీఏలను గుర్తించడానికి మరింత మెరుగైన విధానాన్ని అనుసరించటం ఇందుకు కారణం’’ అని ‘2017–18లో బ్యాంకింగ్ రంగ ధోరణులు, ప్రగతి’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఆర్‌బీఐ తెలియజేసింది. ముఖ్యంగా పెద్ద రుణ ఖాతాల (రూ.5 కోట్లకుపైన) నుంచి ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద రుణ ఖాతాల వారీగా స్థూల ఎన్‌పీఏలు 18.1 శాతం నుంచి 23.1 శాతానికి పెరిగాయి. ఎన్‌పీఏల పరిష్కారం, ఆస్తుల నాణ్యతపై పర్యవేక్షణ కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టంచేసింది.
నివేదికలోని ఇతర అంశాలివీ...
ప్రభుత్వరంగ బ్యాంకుల నికర ఎన్‌పీఏలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 6.9 శాతం నుంచి 2017–18లో 8 శాతానికి పెరిగిపోయాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో స్థూల ఎన్‌పీఏల పెరుగుదల తక్కువగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 4.1 శాతం నుంచి 2017–18లో 4.7 శాతానికి చేరాయి. ఎన్‌పీఏలను మాఫీ చేయడం ద్వారా ప్రైవేటు రంగ బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను శుభ్రం చేసుకోవడం, మెరుగైన వసూళ్ల వంటి చర్యలు స్థూల ఎన్‌పీఏలు తగ్గేందుకు దోహదపడినట్టు ఆర్‌బీఐ నివేదిక తెలియజేసింది. దేశంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకుల ఆస్తుల నాణ్యత అంతకముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4 శాతం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతానికి మెరుగుపడింది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రూ.14,000 కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ని మోసగించడంతో... జెమ్స్, జ్యుయలరీ రంగం నుంచి ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్నాయి. పీసీఏలోని బ్యాంకుల పనితీరు మెరుగు ఆర్‌బీఐ స్పష్టమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి 11 ప్రభుత్వరంగ బ్యాంకులు చేరగా, వీటి స్థూల ఎన్‌పీఏల పెరుగుదల 2017–18లో తగ్గుముఖం పట్టడం గమనార్హం. అంతేకాదు, ఎన్‌పీఏల రికవరీలు కూడా పెరిగాయని ఆర్‌బీఐ నివేదిక తెలియజేసింది. అయితే, పీసీఏ పరిధిలోని బ్యాంకులు కొత్తగా రుణాలిచ్చేందుకు, డిపాజిట్లు సేకరించేందుకు అవకాశం ఉండదు. దీనివల్ల ఆస్తుల పరంగా రిస్క్ తగ్గి, మెరుగైన ఆస్తులపై దృష్టి పెట్టడానికి వీలుంటుందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.
పెరిగిపోతున్న మోసాలు
రిస్క్ నిర్వహణ పరంగా మోసాలనేవి ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయని, 90 శాతం మోసాలు రుణ పోర్ట్‌ఫోలియో నుంచి ఉంటున్నాయని ఈ నివేదిక తెలియజేసింది. 2017–18లో మొత్తం మోసాల్లో రూ.50 కోట్లు, అంతకుమించి విలువతో ఉన్నవి 80 శాతంగా ఉన్నాయి. రూ.10 లక్షలకు పైగా విలువైన మోసాల్లో 93 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే జరుగుతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల వాటా
6 శాతంగానే ఉండడం గమనార్హం.
ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్య లేదు
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) వృద్ధి స్థిరంగా ఉందని, లిక్విడిటీ (నిధుల లభ్యత) ఆందోళనలు ఉపశమించాయని ఆర్‌బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల సహజసిద్ధమైన బలాలు, అదే సమయంలో ఆర్‌బీఐ వైపు నుంచి నిఘా, నియంత్రణపరమైన పర్యవేక్షణలతో ఈ రంగం వృద్ధి నిలకడగానే ఉందని తన నివేదికలో నిర్ధారించింది. అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వరుసగా పలు రుణ చెల్లింపుల్లో విఫలమైన తర్వాత ఈ రంగంలో నిధుల సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఆర్‌బీఐ పలు మార్లు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా వ్యవస్థలోకి నిధుల అందుబాటును పెంచింది. ఎన్‌బీఎఫ్‌సీల లాభదాయకత, ఆస్తుల నాణ్యత, క్యాపిటల్ అడెక్వసీ 2017–18లో మెరుగుపడిందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ సంస్థల కన్సాలిడేటెడ్ బ్యాలన్స్ షీటు 2017–18లోనూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు మరింత విస్తరించిందని వెల్లడించింది.
1,000 ఏటీఎంల మూత
గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికరంగా వెయ్యి ఏటీఎంలు మూతపడ్డాయి. 2016–17లో 2.08 లక్షల ఏటీఎంలు పనిచేస్తుంటే, 2017–18కి వచ్చే సరికి వీటి సంఖ్య 2.07 లక్షలకు తగ్గింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఏటీఎంల క్రమబద్ధీకరణ వల్లే తగ్గుదల చోటు చేసుకుందని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఆన్‌సైట్ ఏటీఎంలు (బ్యాంకు బ్రాంచీలకు అనుబంధంగా ఉండేవి) 1.09 లక్షల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1.06 లక్షలకు తగ్గాయి. అదే సమయంలో ఆఫ్‌సైట్ ఏటీఎంల సంఖ్య 98,545 నుంచి లక్షకు పెరిగాయి.
ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు 1.48 లక్షల నుంచి 1.45 లక్షలకు తగ్గాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల ఏటీఎంలు 58,833 నుంచి 60,145కు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మధ్య ఏటీఎంలు మరింత తగ్గి 2.04 లక్షలుగా ఉన్నాయి. ఇక పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్స్ ఎక్కువగా పెరిగాయి. వైట్‌లేబుల్ ఏటీఎంలు (బ్యాంకులు కాకుండా ఇతర సంస్థలు ఏర్పాటు చేసేవి) 15,000 మార్క్ ను అధిగమించాయి. 2013–14 నాటికి ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ల లావాదేవీల మొ త్తం రూ.8,100 కోట్లు కాగా, 2017–18కి రూ.1.42 లక్షల కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment