న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2020–21, క్యూ1)లో రూ.844 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.243 కోట్లతో పోలిస్తే మూడు రెట్లకు పైగా ఎగబాకింది. ప్రధానంగా మొండిబకాయిల(ఎన్‌పీఏ)కు సంబంధించి ఒత్తిళ్లు! తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది.
కాగా, క్యూ1లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.11,527 కోట్ల నుంచి రూ.11,942 కోట్లకు వృద్ధి చెందింది. స్థూల ఎన్‌పీఏలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 13.91 శాతానికి దిగొచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16.5 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు సైతం 5.79 శాతం నుంచి 3.58 శాతానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎన్‌పీఏలకు సంబంధించిన కేటాయింపులు క్యూ1లో రూ.767 కోట్లకు పరిమితం అయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ కేటాయింపులు రూ.1,873 కోట్లుగా నమోదయ్యాయి.
ఫలితాల నేపథ్యంలో బీఓఐ షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో ఒకానొక దశలో 6.5 శాతం ఎగబాకి రూ.50.15 స్థాయిని తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.48 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment