ప్రభుత్వ బ్యాంక్‌ల నిధుల వేట.. | The Quip approach is the tilt of many banks | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బ్యాంక్‌ల నిధుల వేట..

Published Thu, Nov 23 2017 11:56 PM | Last Updated on Fri, Nov 24 2017 12:07 AM

The Quip approach is the tilt of many banks - Sakshi - Sakshi

బ్యాంక్‌లకు కలసివచ్చే కాలం అంటే  మొత్తం మొండి బకాయిలు వసూళ్లైనట్లేనని విశ్లేషకులు అంటూ వుంటారు. ఆ స్థాయి లో కాకపోయినా, ఇప్పుడు బ్యాంక్‌లకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కొంచెం కాలం కలసివస్తోందని చెప్పవచ్చు. మొండి బకాయిలతో కుదేలవుతున్న బ్యాంక్‌లను గట్టెక్కించడానికి ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా 2.11 లక్షల కోట్ల మేర మూలధన నిధులు అందించనున్నామని ప్రకటించింది.

ఇక తాజాగా అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. దీంతో బ్యాంక్‌ షేర్లపై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌లు స్టాక్‌ మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. మూడీస్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో  ఇన్వెస్టర్ల ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మెరుగుపడిన నేపథ్యంలో వివిధ బ్యాంక్‌లు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్స్‌(క్విప్‌) ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి.  

రూ.13,500 కోట్ల నిధులు..
ప్రభుత్వం రూ.2.11 లక్షల కోట్ల మూలధన నిధుల ప్రణాళికను వెల్లడించిన తర్వాత బ్యాంక్‌లు కూడా క్విప్‌ విధానంలో నిధులు సమీకరిస్తామని వెల్లడించాయి.  గత నాలుగేళ్లలో క్విప్‌ విధానంలో రూ.8,419 కోట్లు మాత్రమే బ్యాంక్‌లు సమీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ  ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు క్విప్‌ విధానంలో రూ.16,000 కోట్లు సమీకరించాయి. వీటిల్లో ఒక్క ఎస్‌బీఐ వాటానే రూ.15,000 కోట్లుగా ఉంది. ఇప్పుడు మరిన్ని బ్యాంక్‌లు ఈ బాట పడుతున్నాయి. గత నెల 24 నుంచి బ్యాంక్‌లు వెల్లడించిన ప్రకటనలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.13,500 కోట్ల మేర నిధుల సమీకరణకు బ్యాంక్‌లు సిద్ధమవుతున్నాయని అర్థమవుతోంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. రూ.6,000 కోట్లు
తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. క్విప్‌ ద్వారా గానీ, రైట్స్‌ ఇష్యూ ద్వారా గానీ రూ.6,000 కోట్లు సమీకరించనున్నామని పేర్కొంది. ఇక యూనియన్‌ బ్యాంక్‌ రూ.2,000 కోట్ల నిధుల సమీకరణ కోసం ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్, లండన్, న్యూయార్క్‌ల్లో రోడ్‌షోలు మొదలు పెట్టేసింది. క్విప్‌ విధానంలో రూ.5,000కోట్ల సమీకరణ కోసం తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఈ వారం మొదట్లోనే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చీఫ్‌ సునీల్‌ మెహతా చెప్పారు. మరికొన్ని నెలల్లో ఈ నిధుల సమీకరణ కోసం మార్కెట్‌కు వస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.500 కోట్లు సమీకరించనున్నామని బ్యాంక్‌ ఆఫ్‌  ఇండియా తెలిపింది.  

బ్యాంక్‌ల ధీమా..
మొత్తం రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళికలో భాగంగా రూ.1.35 లక్షల కోట్లను రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల ద్వారా బ్యాంక్‌లకు అందిస్తారు. బడ్జెట్‌ కేటాయింపులు, మార్కెట్ల నుంచి సమీకరించడం ద్వారా మిగిలిన రూ.76,000 కోట్లు వస్తాయి. అయితే మార్కెట్‌ ద్వారా ముఖ్యంగా క్విప్‌ ద్వారా  నిధులు సమీకరించే విషయంలో బ్యాంక్‌లు ధీమాగా ఉన్నాయి.

రూ.2,000 కోట్లు ఎల్‌ఐసీ వంటి సంస్థలపై ఆధారపడకుండానే పూర్తిగా ఇతర ఇన్వెస్టర్ల నుంచే సమీకరించగలమని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌  ఇండియా అంచనా వేస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లలో ముఖ్యంగా సింగపూర్‌ ఇన్వెస్టర్లలో తమ క్విప్‌పై మంచి ఆసక్తి ఉందని బ్యాంక్‌ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. కాగా బ్యాంక్‌లకు మూలధన నిధులందించాలని ప్రభుత్వం నిర్ణయించడం, మూడీస్‌ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం అతి పెద్ద సానుకూలాంశమని ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విశ్లేషకులు రాజీవ్‌ వర్మ వ్యాఖ్యానించారు.  

టాప్‌ 4 బ్యాంక్‌లపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి  
గతంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక్క స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ)కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుభ్రజిత్‌ రాయ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళిక కారణంగా పెద్ద బ్యాంక్‌లకు భారీగా ప్రయోజనాలు దక్కే అవకాశాలు  ఉండటంతో ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఇతర బ్యాంక్‌ల (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లు.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి) పట్ల కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు.

క్విప్‌ అంటే..
క్విప్‌ (క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌)..నిధులు సమీకరించడానికి ఇదొక మార్గం. దీనిద్వారా  ఏదైనా  లిస్టెడ్‌ కంపెనీ ఈక్విటీ షేర్లు/ పూర్తిగా లేదా పాక్షికంగా ఈక్విటీగా మార్చుకునే డిబెంచర్లు/వారంట్లు మినహా ఈక్విటీ షేర్లుగా మార్చుకునే ఏ ఇతర సెక్యూరిటీలనైనా జారీ చేయడం ద్వారా  క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌(క్విబ్‌)ల ద్వారా నిధులు సమీకరిస్తుంది. సెబీ వద్ద నమోదైన విదేశీ వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ వంటి బీమా కంపెనీలు, కనీసం రూ.25 కోట్ల మూలధనం ఉన్న పెన్షన్‌ ఫండ్స్‌.. తదితర సంస్థలు/వ్యక్తులను క్విబ్‌లుగా వ్యవహరిస్తారు.


బ్యాంక్‌ల క్విప్‌ బాట
బ్యాంక్‌                      మొత్తం (రూ.కోట్లలో)
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా          6,000
యూనియన్‌ బ్యాంక్‌        2,000
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌    5,000
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా        500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement