
మేం కేసు పెడితే గానీ బ్యాంకులు కదల్లేదు
మొండి బకాయిలపై బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరును సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా తూర్పారబట్టారు.
♦ కింగ్‌ఫిషర్‌పై కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు
♦ గతేడాది 171 ఆర్థిక మోసాల కేసులు విచారణ చేశాం
♦ మొండిబాకీల అంశంలో బ్యాంకుల తీరుపై సీబీఐ చీఫ్
న్యూఢిల్లీ: మొండి బకాయిలపై బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరును సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా తూర్పారబట్టారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, పీఏసీఎల్ ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ గురించి తాము ఎన్ని సార్లు సూచించినా, బ్యాంకులు తమ వద్ద కనీసం ఫిర్యాదు కూడా నమోదు చేయలేదని ఆయన చెప్పారు. మోసంపై తాము స్వయంగా కేసు పెడితే తప్ప బ్యాంకులు కదల్లేదన్నారు. ఫిర్యాదు చేయడంలో జాప్యంతో... నిధులు మళ్లించేందుకు, ఆధారాలను నాశనం చేసేందుకు కంపెనీకి బోలెడంత సమయం దక్కిందని సిన్హా పేర్కొన్నారు. సీబీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 7వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సిన్హా ఈ విషయాలు చెప్పారు.
2004-2012 మధ్య కాలంలో కంపెనీ రుణాలు తీసుకోగా.. తాము 2015 జులై నాటికి గానీ కేసు పెట్టలేకపోయామన్నారు. కంపెనీకి 17 పైగా బ్యాంకులు రుణాలిచ్చినప్పటికీ .. ఒకటి రెండు మాత్రమే కింగ్‌ఫిషర్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించడం గర్హనీయమని ఆయన చెప్పారు. పీఏసీఎల్ విషయంలోనూ ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇప్పించేందుకు స్వయంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని హెచ్చరించారు.
రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలు..
బ్యాంకింగ్ వ్యవస్థలో 2009లో రూ. 44,957 కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 2015 నాటికి ఏకంగా రూ. 3 లక్షల కోట్లకు చేరాయని సిన్హా చెప్పారు. ఆరేళ్ల కాలంలో ఎన్‌పీఏలు ఇంతగా రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. దేశీ బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం అనుకున్న దానికన్నా తీవ్రంగా ఉందని చెప్పారు. బ్యాంకులు సత్వర చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల నిధుల తో ఉడాయించేందుకు డిఫాల్టర్లకు బోలెడు సమయం చిక్కుతోందని ఆయన చెప్పారు. ‘చిన్న రుణాలు తీసుకునే వారితో కఠినంగా వ్యవహరించే బ్యాంకులు.. చట్టాలను అతిక్రమించి భారీగా రుణాలు ఎగవేసే వారిని పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లో పెరుగుతోంది’ అని సిన్హా పేర్కొన్నారు.
పెరుగుతున్న ఆర్థిక నేరాలు ..
బ్యాంకుల్లో మోసాలు, ఆర్థిక నేరాలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయని, గతేడాది సీబీఐ సుమారు రూ. 20,646 కోట్ల మేర నిధులు గల్లంతైన 171 కేసుల్లో విచారణ చేపట్టిందని సిన్హా చెప్పారు. వీటితో పాటు దాదాపు రూ. 1,20,000 కోట్ల నిధులకు సంబంధించిన పోంజీ కేసులను కూడా విచారణ చేస్తున్నామని ఆయన వివరించారు. ఆర్థిక నేరాలకు పాల్పడింది ఎంతటివారైనా సరే భరతం పట్టేందుకు ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సిన్హా తెలిపారు. ఈ తరహా మోసాలను ముందస్తుగా గుర్తించేందుకు తీసుకోతగిన చర్యలపై ఇది దృష్టి సారిస్తుందని ఆయన వివరించారు. మరోవైపు, సిన్హా వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య, నిర్దిష్ట ఖాతాల గురించి మాట్లాడబోనన్నారు. అటు కింగ్‌ఫిషర్ విషయంలో బ్యాంకులు కావాలనే జాప్యం చేశాయనడానికి లేదని ఐబీఏ చైర్మన్ అశ్వని కుమార్ పేర్కొన్నారు.