నైతిక ప్రమాణాలు పాటించాలి..!
మొండిబకాయిలపై పరిశ్రమకు ఆర్థికమంత్రి హితవు
♦ వృద్ధికి రేట్ల కోత అవసరమని సూచన
న్యూఢిల్లీ: మొండిబకాయిల విషయంలో పరిశ్రమ నైతిక ప్రమాణాలు పాటించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పిలుపునిచ్చారు. తన విశ్వసనీయతను నిరూపించుకోడానికి పరిశ్రమ సైతం శ్రమిస్తోందని, అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు విశ్వసనీయత కొరవడేట్లు చేస్తున్నాయని అన్నారు. ఇటీవలి విజయ్‌మాల్యా ఉదంతం నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలుకు ప్రాధాన్యతను సంతరించుకుంది. జైట్లీ శనివారం ఇక్కడ 2016 సీఐఐ వార్షిక సదస్సును ప్రారంభించారు. ఇందులో మాట్లాడుతూ, ప్రతికూల వ్యాపార వాతావరణమే మొండిబకాయిల సమస్య పెరగడానికి ప్రధాన కారణమన్నారు.
వ్యాపార పరిస్థితి మెరుగుపడితే.. మొండిబకాయిల సమస్య కూడా తగ్గిపోతుందన్నారు. అయితే ఈ సమస్య విషయంలో కార్పొరేట్లు కూడా సానుకూల రీతిలో, నైతిక ప్రవర్తనను పాటించాలని సూచించారు. స్టీల్, జౌళి, రహదారులు, మౌలిక రంగాల్లో మొండిబకాయిల సమస్య పరిష్కారం విషయంలో కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని వివరించా రు.నిలిచిపోయిన ప్రాజెక్టుల అంశాన్ని ప్రధాని కార్యాలయమే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
అధిక వడ్డీరేట్లతో వృద్ధికి విఘాతం
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో... దేశంలో అధిక వడ్డీరేట్లు వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు (ద్రవ్యలోటు) సంబంధించి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే దేశంలో ద్రవ్యోల్బణం కూడా కట్టడిలో ఉన్నట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం 2016-17కు సంబంధించి ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. రేటు తగ్గితే.. వడ్డీరేట్ల ఆదాయంపై జీవించే వృద్ధుల పరిస్థితి ఏమిటన్న వాదనపై ఆయన మాట్లాడుతూ, ఈ సమస్యను పెన్షన్ ఫండ్స్ పరిష్కరిస్తాయన్న విశ్వాసం ఉందన్నారు. ఇవి మంచి రిటర్న్స్ అందిస్తాయని అన్నారు.
త్వరలో ఆస్ట్రేలియాతో ఎఫ్‌టీఏ: నిర్మలా సీతారామన్
కాగా కార్యక్రమం సందర్భంగా వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, త్వరలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ మేరకు చర్చలు సానుకూల రీతిలో సాగుతున్నట్లు వెల్లడించారు.