
నిష్పక్షపాతంతో పనిచేయండి
న్యూఢిల్లీ: మొండి బకాయిలు పెరిగిపోతుండడంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి భయమూ, పక్షపాతమూ లేకుండా వృత్తి ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల చీఫ్‌లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఇక్కడ పీఎస్‌యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామకాల ప్రక్రియలో ఎటువంటి లోపాలూ లేకుండా చూడ్డానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని అన్నారు.
అత్యుత్తమ బాధ్యతతో కూడిన వృత్తి సంబంధమైన అంశాలు బ్యాంకర్ల నిర్ణయాలను ప్రభావితం చేయాలితప్ప, స్వార్థపూరితమైన ఇతర అంశాలు కాకూడదని పేర్కొన్నారు. నిర్ణయాలను ప్రభావితం చేసే వెలుపలి అనైతిక అంశాలు ఏవైనా అవి అనర్హతకు దారితీస్తుందని అన్నారు. అనంతరం జైట్లీ విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక రంగం వృద్ధే లక్ష్యంగా వివిధ రంగాలకు రుణం అందేలా, అవసరమైన రంగంలో రుణ వృద్ధి పెరిగేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. తగిన రుణ లభ్యత కోసం పలు రంగాలు ఎదురుచూస్తున్నాయన్నారు.
హైదరాబాద్‌లో కొత్త డీఆర్‌టీ!
డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్‌టీ),హైకోర్టుల ద్వారా మొండి బకాయిల విషయంలో తమ ప్రయోజనాల పరిరక్షణకు బ్యాంకులు కృషి చేయాలని సమావేశంలో జైట్లీ సూచించినట్లు ఒక ప్రకటన తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్‌సహా ఆరు ప్రాంతాల్లో 2015-16లో కొత్త డీఆర్‌టీలను ఏర్పాటు చేయనున్న విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొంది. పరిశోధనా సంస్థ- ఐసీఆర్‌ఏ నివేదిక ప్రకారం 2015 మార్చి 31వ తేదీనాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణ పరిమాణంలో 4.4 శాతం నుంచి 4.7 శాతంగా ఉండవచ్చని అంచనా. 2014 జూన్ నెల ముగిసే నాటికి ఈ రేటు 4.6 శాతంగా ఉంది.