FM Arun Jaitley
-
మూడేళ్ల కృషికి దక్కిన ఫలితం
సాక్షి, న్యూడిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గుర్తింపు దక్కడం తమ సంస్కరణలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ వ్యాఖ్యానించారు. మూడీస్ అప్‌గ్రేడ్ అనంతరం కేంద్రమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను స్వాగతించిన జైట్లీ ఈ అప్‌గ్రేడ్ లేట్‌గా ఇచ్చిందన్నారు. అయినా 13సంవతర్సాల తర్వాత ఇండియాకు బీఏఏ 2 ర్యాంక్ అప్ గ్రేడ్ రావడం సంతోషాన్నిస్తోందన్నారు. జీఎస్టీ అమలును ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల అడుగుగా అందరూ గుర్తిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణలో భారతదేశం పురోగమిస్తోంది.ఇక తమ దృష్టి అంతా ఇన్ఫ్రా సంస్కరణలపై ఉండనుందన్నారు. గత మూడేళ్లుగా నిర్మాణ రంగం కీలక రంగంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ మార్గంలో నడుస్తోంది..భారతదేశం సంస్కరణల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తున్న పలువురు ఇప్పుడు వారి అభిప్రాయాలను మార్చుకోవాలన్నారు. మూడు సంవత్సరాల్లో తాము చేపట్టిన సంస్కరణలు వేగవంతమైన పథం పెరుగుదలకు దారితీశాయని.. అయితే మూడీ గుర్తింపు ఆలస్యంగా లభించిందని పేర్కొన్నారు. అలాగే రేటింగ్స్‌కు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని జైట్లీ స్పష్టం చేశారు. -
‘భారత్ -22’ కొత్త ఈటీఎఫ్
న్యూఢిల్లీ: భారత్ -22 పేరుతో కొత్త ఇటిఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్) ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్ , ఎనర్జీ, ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, తదితర 22 కంపెనీలు ఇందులో ఉన్నాయి. మొత్తం డివెస్ట్మెంట్ టార్గెట్ రూ.72,500 కోట్ల గా ఉండనుందని జైట్లీ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన బారత్-22 ఇండెక్స్‌లో మొత్తం 22 కంపనీలు ఉండనున్నాయని ఆర్థికమంత్రి మీడియాకు వివరించారు. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయం రూ.9,300 కోట్ల రూపాయల మేరకు గుర్తించామని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ నుంచి రూ. 72,500 కోట్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మరోసారి స్పష్టం చేశారు. భారత్-22 ఈటీఎఫ్‌లో సెక్టార్ల వారీగా బ్యాంకులు అత్యధికంగా 20.3శాతం. 17.5 శాతం వాటాతో ఎనర్జీ సెక్టార్ రెండవ స్థానంలో ఉంది. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. నాల్కో, ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, బిపిసిఎల్, కోల్ ఇండియా ఎనర్జీ , దీని తరువాత ఎఫ్ఎంసీజీ, కంపెనీలు, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బీసిసిలది 22.6 శాతం వాటా. అలాగే పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపిసి లిమిటెడ్, గెయిల్ ఇండియా, ఎన్హెచ్పీసి, ఎన్ఎల్సీ ఇండియా, ఎస్వీజేఎన్ఎన్ ఆరు యుటిలిటీ కంపెనీలు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జైట్లీ ఈ ప్రకటన వెంటనే శుక్రవారం నాటి మార్కెట్ ముగింపులో పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆయిల్ అండ్‌గ్యాస్ సెక్టార్ భారీగా లాభపడింది. -
ఐటీ రంగం పటిష్టంగానే...
పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు ఐటీ కార్యదర్శి అరుణ సుందరరాజన్ న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపుపై నెలకొన్న ఆందోళనను తొలగించే దిశగా కేంద్రం రంగంలోకి దిగింది. ఐటీ రంగం పటిష్టంగానే ఉందని, వాస్తవానికి సాదా సీదా సర్వీసుల నుంచి అత్యధిక నైపుణ్యం గల సేవలవైపు మళ్లుతోందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ పేర్కొన్నారు. పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా కొందరు ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం సాధారణంగా ఏటా జరిగేదేనని, ఈ ఏడాదీ అదే జరుగుతోంది తప్ప అసాధారణ చర్యలేమీ తీసుకోవడం లేదని ఐటీ కంపెనీలు తనకు వివరించినట్లు ఆమె తెలిపారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ తదితర ఐటీ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బ్యాంకుల విలీనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూడిల్లీ: 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఎస్బీఐ)లో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం మరోసారి పచ్చజెండా ఊపింది. దీంతో ఎస్బీఐ ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటిగా మారనుంది. తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు స్టేట్ బ్యాంకు అనుబంధ బ్యాంకులుగా చలామణి అవుతూ వస్తున్న 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్', 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్', 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్', 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా', 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌లు' ఎస్బీఐలో విలీనం కానున్నాయి. అయితే భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ విలీనం ఎప్పటినుంచి అమల్లోకి వచ్చేది త్వరలో నేప్రకటిస్తామని జైట్లీ చెప్పారు. దీంతో దేశంలో బ్యాకింగ్ రంగం ఏకీకరణ దిశగా కీలక అడుగు పడినట్టయింది. అయితే అనుబంధ బ్యాంకుల విలీనంపై గతంలో (2016 , జూన్) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ డీమానిటైజేషన నేపథ్యంలో ఈ ప్ర్రక్రియ వాయిదాపడింది. ఇపుడు కేబినెట్ ఆమోదంతో త్వరలోనే ఈ విలీనానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. స్వాప్ రేషియో ప్రకారం'స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ వాటాదారులు ప్రతి 10 షేర్లు (రూ 10 ప్రతి) ఎస్బీఐ 28 షేర్లు (రూ .1 చొప్పున) పొందుతారు. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ వాటాదారులు ప్రతి 10 షేర్లకు ఎస్బీఐ 22 షేర్లు పొందనున్నారు. ఈ విలీనంతో రూ 37 లక్షల కోట్లు, 22,500 శాఖలు, 58,000 ఎటీఎంలతో ఒక ప్రపంచ-పరిమాణ బ్యాంకుగా మారనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే దాదాపు 50 కోట్ల వినియోగదారులను ఎస్బీఐ ఖాతాలో చేరనున్నారు. కాగా అంతకంతకు పెరుగుతున్న బ్యాంకుల మొండి బకాయిల సమస్యతో పోరాడటానికి, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకురావడానికి కేంద్రం బ్యాంకుల ఏకీకరణ చర్యలకు నిర్ణయించింది. 2008లో తొలిసారి ఎస్బీఐ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను విలీనం చేసుకొంది. అనంతరం రెండేళ్ల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ను విలీనం చేసుకున్న సంగతి విదితమే. -
నాన్నది ఫ్రెండ్లీ బడ్జెట్: సోనాలి జైట్లీ
న్యూఢిల్లీ: దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా నెల రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. అధికార బీజేపీ సభ్యులు సహజంగానే ‘ఆహా.. ఓహో.. ’అంటుండగా, విపక్షాలు మాత్రం ‘ఇందులో ఏమీ లేదు’అని పెదవి విరుస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూతురి స్పందనపై ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ ప్రకటన ముగిన తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చిన సోనాలీ జైట్లీ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ‘ఇది చాలా మంచి బడ్జెట్. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఆడపడుచుల కోసం ఎన్నెన్నో పథకాలు ప్రకటించారు. ఇది మహిళా అనుకూల బడ్జెట్ కూడా’ అని సోనాలి అన్నారు. బడ్జెట్ ప్రకటన సందర్భంగా బుధవారం పార్లమెంట్‌కు వచ్చిన జైట్లీ కుటుంబసభ్యులు విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ను ఆసక్తిగా విన్నారు. -
పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..
-
పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..
న్యూఢిల్లీ: ‘రైలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో జనం చనిపోతున్నారు. గిట్టుబాటుధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. దేశంలో ఇన్ని సమస్యలతొ కొట్టుమిట్టాడుతుండగా వీటిలో కనీసం ఒకదానిగురించైనా నేటి బడ్జెట్లో మాట్లాడారా?’అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. బడ్జెట్ ప్రసంగం పూర్తైన తర్వాత పార్లమెంట్ వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారు కీలకమైన సమస్యలను గాలికొదిలేసి, చలోక్తులు, చతురులతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. ‘ప్రధాని మోదీ, ఆయన కేబినెట్ సహచరులు కొంతకాలంగా మాట్లాడిన మాటలు వింటే, బడ్జెట్ లో అద్భుతాలు ఉంటాయని, పార్లమెంట్‌లోనే టపాసులు పేలతాయని అనుకున్నాం. కానీ పేలని బాంబులాగా తుస్సుమనిపించారు. మోదీ గొప్పగా చెప్పుకున్న బుల్లెట్ రైళ్ల ప్రస్తావన బడ్జెట్లో రానేలేదు. రైతాంగ సమస్యలకు పరిష్కారాలు చూపలేదు’అని రాహుల్ అన్నారు. తమ పథకాలతో నిరుద్యోగ సమస్య తీరుదుందని గొప్పలు చెప్పుకున్న మోదీ సర్కారు.. గత ఏడాది దేశవ్యాప్తంగా కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందని, ఇందుకు ప్రధాని సిగ్గుపడాలని రాహుల్ విమర్శించారు. రక్షణ రంగం ఊసేది?: రేణుకా చౌదరి కీలకమైన రక్షణ రంగానికి సంబంధించిన అంశాలేవీ బడ్జెట్లో పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు మించిన విరాళాలు ఇకపై డిజిటల్ రూపంలో జరగాలన్న బడ్జెట్ ప్రతిపాదనపైనా ఆమె మాట్లాడారు. ‘యూపీ ఎన్నికల్లో వాళ్లెలా పోరాడతారు? డొనేషన్లను చెక్కుల రూపంలో తీసుకుంటారా? లేక డిజిటల్ రూపంలో తీసుకుంటారా? అని వ్యగ్యధోరణిలో విమర్శించారు. -
బడ్జెట్: ఏపీ ‘రాజధాని’పై కీలక ప్రకటన
-
బడ్జెట్: ఏపీ ‘రాజధాని’పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై కీలక ప్రకటన చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. కాగా, ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే పన్ను రద్దు వర్తిస్తుందని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన వారికి ఆదాయపన్నులో మినహాయింపు ఇస్తున్నాం. మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇస్తున్నాం’ అని జైట్లీ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు హర్షధ్వానాలు చేశారు. ఈ మినహాయింపులు రాష్ట్రం ఏర్పడిన తేదీ అంటే 2014, జూన్ 2 తర్వాతి నుంచి చోటుచేసుకున్న క్రయవిక్రయాలన్నింటికీ వర్తిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. సంబంధిత కథనాలు... 2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! -
పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రతులు..
-
పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రతులు..
న్యూఢిల్లీ: ఎంపీ ఆకస్మిక మరణంతో బడ్జెట్ వాయిదా పడుతుందా? లేదా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్న తరుణంలోనే బడ్జెట్ ప్రక్రియకు సంబంధించిన అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో కలిసి బుధవారం ఉదయం రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన చేతిలో బడ్జెట్ సూట్‌కేసు కూడా ఉంది. ఇదిలాఉంటే, బడ్జెట్ ప్రకటనపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే ‘బడ్జెట్ తప్పక ఉంటుంది’ అంటూ ప్రభుత్వ వర్గాలు చూచాయగా పేర్కొన్నాయి. మరణించిన ఎంపీ అహ్మద్‌కు సభలో నివాళులు అర్పించిన అనంతరం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారని తెలిసింది. అయితే అధికారిక ప్రకటనమాత్రం స్పీకర్ నిర్ణయం తర్వాతే ఉంటుంది. ఇటు పార్లమెంట్ ఆవరణలోనూ బడ్జెట్ హడావిడి కనిపించింది. ఉదయం 9:30 గంటలకే బడ్జెట్ ప్రతులు ఉంచిన భారీ బాక్సులను సిబ్బంది పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. ఈ పేపర్ ప్రతులను కేవలం ఎంపీలకు మాత్రమే అందజేస్తారు. వార్తాసంస్థలు, ఇతర మాద్యమాలకు డిజిటల్ బడ్జెట్‌ను అందుబాటులో ఉంచుతారు. 92 ఏళ్ల సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రకటించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో కలిపి ప్రకటించనున్నారు. (ఎంపీ హఠాన్మరణం:కేంద్ర బడ్జెట్ వాయిదా..?) -
బడ్జెట్ వాయిదా?: కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: మళప్పురం లోక్‌సభ సభ్యుడు ఇ. అహ్మద్ హఠాన్మరణం నేపథ్యంలో బుధవారమే బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేక గురువారానికి వాయిదా వేయాలా? అనేదానిపై కేంద్ర మంత్రివర్గం సమాలోచనలు జరుపుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే భేటీకి పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అరుణ్ జైట్లీ సిద్ధం చేసిన బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. (ఎంపీ హఠాన్మరణం:కేంద్ర బడ్జెట్ వాయిదా..?) పార్లమెంట్ వాయిదాపై తుది నిర్ణయం స్పీకర్ సుమిత్రా మహాజన్దే అయినప్పటికీ, ప్రభుత్వ అభిప్రాయం ఏమిటన్నది కీలకాంశంగా మారింది. చనిపోయిన వ్యక్తి సిట్టింగ్ ఎంపీ కావడం, అందునా, పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే కుప్పకూలడం లాంటి అంశాల నేపథ్యంలో బడ్జెట్‌ను ఒక రోజుకు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరే అవకాశంఉంది. అన్నివర్గాల అభిప్రాయాలు విన్నపిదప ఉదయం 10 గంటలకు స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తారని తెలిసింది. ఇదిలా ఉంటే, ‘నేటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి, ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. బడ్జెట్ యధాతధంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
నోట్ల రద్దు గురించి ఆర్థిక మంత్రికి తెలియదా?
-
నోట్ల రద్దు గురించి ఆర్థిక మంత్రికి తెలియదా?
న్యూఢిల్లీ: ‘వైరుధ్యం ఎలా ఉంటుందో చూడండి.. 1)నోట్ల రద్దు.. ప్రధాని వ్యక్తిగత నిర్ణయం. కనీసం ఆర్థిక మంత్రిని, రిజర్వ్ బ్యాంక్ అధికారుల్ని సంప్రదించకుండా కూడా మోదీ దుస్సాహసం చేశారు. 2) నోట్ల రద్దు నిర్ణయం బీజేపీ పెద్దలకు, వారి సన్నిహితులకు ముందే లీకైంది. దీంతో వాళ్లు జాగ్రత్త పడ్డారు. పేదలను మాత్రం రోడ్డున పడేశారు..... ఈ రెండూ వేరువేరు వ్యక్తుల అభిప్రాయాలు కావు.. ఒకే పార్టీ ఒకసారి ఒకలా, మరోసారి ఇంకోలా మాట్లాడుతోంది. మొత్తంగా మోదీ ఇచ్చిన షాక్ నుంచి విపక్షాలు ఇంకా కోలుకోలేదు. ఇప్పట్లో తేరుకోలేవు కూడా’అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వ్యవహారంలో విపక్షాల తీరును ఆక్షేపించిన ఆయన.. ఆర్థిక మంత్రికి తెలియకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను ఖండించారు. మోదీ సాహసోపేత నిర్ణయంతో కొన్ని రోజులు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా అంతిమంగా ఎన్నో మేళ్లు జరుగుతాయని, తద్వారా పేదలు లబ్దిపొందుతారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా ‘సాధారణం’ అనుకున్న విధానాలన్నింటికీ చరమగీతం పాడుతూ మోదీ దాని(మామూలు) స్థాయిని పెంచారని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమోదించామని మంత్రి వెంకయ్య నాయుడు మీడియాకు తెలిపారు. ఇక మంగళవారం కూడా నోట్ల రద్దు వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను ఉదిపేసింది. సభలు ప్రారంభమైన వెంటనే స్పీకర్, చైర్మన్ల పోడియంలను చుట్టుముట్టిన విపక్ష సభ్యులు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, గందరగోళపరిస్థితిని నివారించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఉభయసభలు పలు మార్లు వాయిదాపడ్డాయి. -
ఏటీఎంలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు పాతనోట్లను మార్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో నిత్యావసరాలకు సైతం సరిపడా డబ్బు దొరకకా.. జనం నానా అవస్థలు పడుతున్నారు. కొత్తగా జారీచేసిన రూ. రెండువేల నోట్లు ఏటీఎంలలో వచ్చేందుకు వీలుగా సాఫ్ట్వేర్ మార్చాల్సి రావడంతో ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఏటీఎంల సమస్యపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్టాఫ్‌వేర్‌లో మార్పులతో కొత్త నోట్లు అందించేవిధంగా రెండువారాల్లో దేశమంతటా ఏటీఎంలు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పెద్దనోట్లను రద్దుచేసి.. ఆ స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడమనేది భారీ ఆపరేషన్ అని, ఆ ఆపరేషన్ ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్నారు. దేశంలోని 86శాతం కరెన్సీని మార్చాలన్న నిర్ణయం కారణంగా ప్రారంభంలో కొన్ని కష్టాలు రావడం సహజమేనని పేర్కొన్నారు. పెద్దనోట్ల మార్పిడి విషయమై ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని జైట్లీ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చిల్లర కొరత తీర్చేందుకు, ప్రజల అవసరాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నోట్ల మార్పిడి మొదలై మూడురోజులైందని, ఒక్క ఎస్బీఐలోనే ఏకంగా రూ. 47.86వేల కోట్ల డిపాజిట్లు జమ అయ్యాయని చెప్పారు. ఇలా నగదు జమ కావడం వల్ల దేశంలో అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరుగాలన్న ఉద్దేశాన్ని ఇది నెరవేరుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు బ్యాంకు సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క ఎస్బీఐలోనే గత రెండురోజుల్లో 2.28 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు అర్థంలేనివని కొట్టిపారేశారు. డిసెంబర్ 30 తర్వాత నోట్ల మార్పిడి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ మనీని గుర్తించడానికి ఎంత దూరమైనా పోతామని ఆయన మండిపడ్డారు. -
పెద్దనోట్ల రద్దు: ఈ ఆపరేషన్ ఇప్పుడే మొదలు!
-
6,12,18,26 శాతంగా పన్ను రేట్లు
-
జీఎస్టీ మినహాయింపులపై జైట్లీ హెచ్చరికలు
న్యూఢిల్లీ : దేశమంతటినీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఆమోదించిన జీఎస్టీ బిల్లుపై అత్యధిక మొత్తంలో మినహాయింపులు రావడాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. ఈ బిల్లుపై ఎక్కువ మినహాయింపులు రావడం, ఇతరులకు ఎక్కువ రేటు విధించే అవకాశాలకు దారితీస్తుందని హెచ్చరించారు. జీఎస్టీ బిల్లుపై కీలక అంశాలపై చర్చించడానికి ఒక్కరోజు ముందుగానే ఆర్థికమంత్రి ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఈ రేటు నుంచి ఎక్కువ మొత్తంలో మినహాయింపు ఇవ్వడం, ఇతరులపై అత్యధిక రేటు భారం పడే అవకాశం ఉందన్నారు. ఇన్క్రిడబుల్ ఇండియా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో జైట్లీ ప్రసంగించారు. ప్రోత్సహకాలు, మినహాయింపులతో భారత్ నిరవధికంగా ముందుకు సాగలేదని తెలిపారు. జైట్లీ హెచ్చరికలతో మినహాయింపు కోరుతూ ప్రభుత్వంతో ప్రస్తుతం లాబీయింగ్ చేస్తున్న వారికి నిరాశే ఎదురయ్యేటట్టు కనబడుతోంది. ఎక్కువ మొత్తంలో మినహాయింపులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వదని వెల్లడవుతోంది. జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర, రాష్ట్ర బాడీలు మొదటిసారి గురువారం, శుక్రవారం భేటీ అవుతున్నాయి. జీఎస్టీ రేటుతో పాటు, మినహాయింపులు ఇతర అంశాలను ఇవి చర్చిస్తాయి. ఈ చర్చల అనంతరం కేంద్ర జీఎస్టీ చట్టాన్ని, అంతరాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. వాటాదారుల సంప్రదింపుల అనంతరం ఈ చట్టాలు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. 2017 ఏప్రిల్ 1 నుంచి ఎలాగైనా జీఎస్టీ బిల్లును అమలుచేయాలని కేంద్రం యోచిస్తోంది. ద్రవ్యోల్బణ పెంపు భయాందోళనలు లేకుండా ప్రామాణికమైన జీఎస్టీ రేటును నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రేటు నుంచి ఎన్ని ఉత్పత్తులు మినహాయింపు పొందనున్నాయి. ఎన్ని తక్కువ రేటు ప్రయోజనం పొందనున్నాయి, వేటికీ భారం కొంత ఎక్కువ పడొచ్చో ఇక తేలాల్సి ఉంది. -
మాల్యాను వెనక్కి రప్పిస్తాం
న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వ్యాపార వేత్త విజయ మాల్యా వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అతణ్ణి దేశానికి తిరిగి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన జైట్లీ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి దేశానికి తీసుకురావడానికి దర్యాప్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తాయన్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. ఆయన్ని ఇండియాకు రప్పించడానికి రెండు ప్రత్యేక మార్గాలు ఉన్నాయన్నారు. , ఒకటి బహిష్కరణ మరొకటి రప్పించడమని తెలిపారు. ఈ విషయంలో బ్రిటన్ తమకు సహాయపడేలా లేదన్నారు. ఒకసారి ఎవరైనా చట్టబద్ధంగా వారి దేశంలోకి ప్రవేశించిన వ్యక్తిని ఆదేశం బహిష్కరిందని జైట్లీ అన్నారు. పాస్ పోర్ట్ రద్దు చేయడం దేశ బహిష్కరణ కింద రాదనే వైఖరిని బ్రిటన్ ప్రభుత్వం తీసుకుందన్నారు. మరోవైపు కోర్టులో అభియోగాలు నమోదై చార్జిషీటు దాఖలైన తరువాత మాల్యాను దేశానికి రప్పించే ప్రయత్నాలు చట్ట ప్రకారం చేయొచ్చన్నారు. అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని యూకే ..మాల్యా ను అప్పగించే దిశగా దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదే విషయంలో పార్లమెంటులో కూడా ప్రస్తావించిన జైట్లీ ఛార్జిషీట్ దాఖలైన తర్వాత భారతదేశానికి రప్పించే ప్రక్రియ ప్రారంభకానుట్టుతెలిపారు. కాగా బ్యాంకుల కన్సార్టియానికి 9 వేలకు కోట్లకు పైగా బాకీ పడ్డ విజయ్ మాల్యా గత మార్చి 2 న భారతదేశం విడిచి బ్రిటన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. -
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట కలిగింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఆయనకు ఢిల్లీ కిందిస్థాయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురు ఆప్ నేతలకు కూడా గురువారం బెయిలిచ్చింది. తన పరువుకు నష్టం కలిగేలా అవాస్తవాలతో కూడిన ప్రకటనలను సీఎం కేజ్రీవాల్ ఆయన పార్టీ నేతలు విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్పేయ్లపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి వారిని ఈ రోజు(ఏప్రిల్ 7న) కోర్టుకు హాజరుకావాల్సిందిగా కిందిస్థాయి కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే వారికి బెయిల్ మంజూరు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌కు పార్టీ సలహాదారు,ఎమ్మెల్యే గోపాల్ మోహన్ జామీనుగా ఉండగా ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ అశుతోష్‌కు నరేశ్ బాల్యాన్ సంజయ్ సింగ్ కు, నితిన్ త్యాగి కుమార్ విశ్వాస్‌కు జామీన్లుఆ ఉన్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల పూచికత్తు కోర్టుకు సమర్పించారు. ఈ కేసు విచారణ సందర్బంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా కోర్టుకు హాజరయ్యారు. -
'పనామా పేపర్స్' పై స్పందించిన జైట్లీ
న్యూఢిల్లీ: నల్లధనం కుబేరుల వివరాలను వెల్లడిచేసిన పనామా పేపర్స్ పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ పత్రాల వెల్లడిని ఆయన స్వాగతించారు. ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సింది కోరారని తెలిపారు. ఇది స్వాగతించాల్సిన, ఆరోగ్యకరమైన పరిణామమని జైట్లీ వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జెనీవాలోని హెచ్ఎస్బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు ఉదంతంలో విచారణ మొదలైందని గుర్తు చేశారు. హెచ్ఎస్బిసి ఖాతాదారుల సంబంధించి 2011 లో 569 ఖాతాదారులను గుర్తించామని, వీటిలో 390 అక్రమ ఖాతాలుగా తేలాయని వివరించారు. ఇప్పటికే 154 సెట్ల ఫిర్యాదులను నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్రమ ఖతాదారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని , కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులను పర్యవేక్షించేందుకు మల్టీ ఏజెన్సీ గ్రూప్ ను రూపిందించనట్టు ఆర్థకి మంత్రి తెలిపారు. ఆర్బీఐకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఇది పనిచేస్తుందన్నారు. కాగా నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి 11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు పూనుకున్న పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు గుట్టు ఈ పత్రాల్లో రట్టైన సంగతి తెలిసిందే. -
చిన్న పొదుపు రేట్ల కోతపై...
ఆచితూచి నిర్ణయం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 7వ వేతన కమిషన్ సిఫారసుల అమలు {దవ్యలోటు లక్ష్యాన్ని నీరుకార్చబోదన్న విశ్వాసం న్యూఢిల్లీ: చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీరేటు కోత నిర్ణయాన్ని ఆచితూచి తీసుకుంటామని ఆర్థికమంత్రి శుక్రవారం పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులుసహా పలు వర్గాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్న నేపథ్యంలో జైట్లీ తాజా ప్రకటన చేశారు. తన నుంచి రెపో రేటు ప్రయోజనాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆర్బీఐ పేర్కొంటుండగా... ఇందుకు చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్ రేటు తగ్గాల్సిన పరిస్థితి ఉందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. పొదుపురేట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్యాంక్ డిపాజిట్ రేట్లు తగ్గించడం సాధ్యపడదని బ్యాంకింగ్ వాదిస్తోంది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 7.5 శాతం డిపాజిట్ రేటు ఆఫర్ చేస్తుండగా, చిన్న పొదుపుకు సంబంధించిన పలు పొదుపు పథకాలు 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపురేట్ల కోతపై కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. హిందుస్తాన్ టైమ్స్ నిర్వహించిన ఒక సదస్సులో జైట్లీ చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు... పెట్రోల్, డిజీల్‌పై పెంచిన సెస్ల్ని హైవేల వంటి మౌలిక రంగ ప్రాజెక్టుల ఫండ్‌కు వినియోగిస్తున్నాం. అయితే వేతనాలు, పెన్షన్లపై వెచ్చించే మొత్తం పెరగడం వల్ల సామాజిక రంగంపై అధిక వ్యయపర్చడం సవాలు. ఉదాహరణకు గత ఏడాది ప్రారంభించిన బాలికల సంక్షేమానికి ఉద్దేశించి ప్రారంభించిన (సుకన్యా సమృద్ధి) యోజన విషయంలో 2015-16లో అధికంగా 9.2 శాతం వడ్డీ అమలవుతోంది. ఏడాది తర్వాత ఈ రేటును భారీగా తగ్గించాల్సి రావచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ప్రజలు చిన్న తరహా పొదుపు పథకాలపై వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. ఈ రేటుపై నిర్ణయం తీసుకునే సమయంలో ప్రభుత్వం అత్యంత జాగరూకతతో అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది. ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వల్ల రానున్న రెండుమూడేళ్లలో వార్షికంగా ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల అదనపు భారం పడుతుంది. జనవరి 1 నుంచీ అమలయ్యే ఈ సిఫారసులవల్ల ద్రవ్యలోటు పెరగదు. తొలి దశలో (జీడీపీలో 2.5 శాతం) సిఫారసుల అమలు కొంత కష్టమే. అయితే ఆర్థికాభివృద్ధి పెరిగే కొలదీ ఈ నిష్పత్తి తగ్గుతుంది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.55 లక్షల కోట్లు (మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం) మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. 2016-17లో ఈ లక్ష్యాన్ని 3.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. {పస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు 7.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ప్రభుత్వానికి ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు మరింత బలపడే అవకాశం ఉంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును రాజ్యాంగంలో చేర్చి దీనిపై పరిమితి విధించాలన్న వాదనతో నేను ఏకీభవించను. సిగరెట్లు, మద్యం వంటి హానికర ఉత్పత్తులపై అధిక పన్ను రేటు అవసరం. ఈ పరిస్థితుల్లో ప్రొడక్టులపై ప్రామాణిక జీఎస్టీ రేటును 18 శాతం రేటు పరిమితిని రాజ్యాంగంలో చేర్చాలన్న కాంగ్రెస్ వాదనను ఆమోదించాల్సిన పనిలేదు. -
నిష్పక్షపాతంతో పనిచేయండి
న్యూఢిల్లీ: మొండి బకాయిలు పెరిగిపోతుండడంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి భయమూ, పక్షపాతమూ లేకుండా వృత్తి ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల చీఫ్‌లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఇక్కడ పీఎస్‌యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామకాల ప్రక్రియలో ఎటువంటి లోపాలూ లేకుండా చూడ్డానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని అన్నారు. అత్యుత్తమ బాధ్యతతో కూడిన వృత్తి సంబంధమైన అంశాలు బ్యాంకర్ల నిర్ణయాలను ప్రభావితం చేయాలితప్ప, స్వార్థపూరితమైన ఇతర అంశాలు కాకూడదని పేర్కొన్నారు. నిర్ణయాలను ప్రభావితం చేసే వెలుపలి అనైతిక అంశాలు ఏవైనా అవి అనర్హతకు దారితీస్తుందని అన్నారు. అనంతరం జైట్లీ విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక రంగం వృద్ధే లక్ష్యంగా వివిధ రంగాలకు రుణం అందేలా, అవసరమైన రంగంలో రుణ వృద్ధి పెరిగేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. తగిన రుణ లభ్యత కోసం పలు రంగాలు ఎదురుచూస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో కొత్త డీఆర్టీ! డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ),హైకోర్టుల ద్వారా మొండి బకాయిల విషయంలో తమ ప్రయోజనాల పరిరక్షణకు బ్యాంకులు కృషి చేయాలని సమావేశంలో జైట్లీ సూచించినట్లు ఒక ప్రకటన తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్సహా ఆరు ప్రాంతాల్లో 2015-16లో కొత్త డీఆర్టీలను ఏర్పాటు చేయనున్న విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొంది. పరిశోధనా సంస్థ- ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం 2015 మార్చి 31వ తేదీనాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మొత్తం రుణ పరిమాణంలో 4.4 శాతం నుంచి 4.7 శాతంగా ఉండవచ్చని అంచనా. 2014 జూన్ నెల ముగిసే నాటికి ఈ రేటు 4.6 శాతంగా ఉంది.