'పనామా పేపర్స్' పై స్పందించిన జైట్లీ
న్యూఢిల్లీ:
నల్లధనం కుబేరుల వివరాలను వెల్లడిచేసిన పనామా పేపర్స్ పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ పత్రాల వెల్లడిని ఆయన స్వాగతించారు. ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సింది కోరారని తెలిపారు. ఇది స్వాగతించాల్సిన, ఆరోగ్యకరమైన పరిణామమని జైట్లీ వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు ఉదంతంలో విచారణ మొదలైందని గుర్తు చేశారు. హెచ్ఎస్బిసి ఖాతాదారుల సంబంధించి 2011 లో 569 ఖాతాదారులను గుర్తించామని, వీటిలో 390 అక్రమ ఖాతాలుగా తేలాయని వివరించారు. ఇప్పటికే 154 సెట్ల ఫిర్యాదులను నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్రమ ఖతాదారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని , కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులను పర్యవేక్షించేందుకు మల్టీ ఏజెన్సీ గ్రూప్ ను రూపిందించనట్టు ఆర్థకి మంత్రి తెలిపారు. ఆర్బీఐకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఇది పనిచేస్తుందన్నారు.
కాగా నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి 11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు పూనుకున్న పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు గుట్టు ఈ పత్రాల్లో రట్టైన సంగతి తెలిసిందే.