panama papaers
-
కారుబాంబు.. పొలాల్లో ముక్కలై పడిన జర్నలిస్టు
మాల్టా : పనామా కేసులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న డాదప్నే కార్వానా గలిజియా(53) అనే జర్నలిస్టును చంపేశారు. ఆమె ప్రయాణించే కారులో బాంబు పెట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇంట్లో నుంచి కారు వేసుకొని బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కారు పేలి పోవడంతో ఆమె దేహం విడిపోయిన భాగాలుగా పొలాల్లో పడిపోయింది. ఈ హత్య ఎవరు చేశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో పనామా కుంభకోణం ఓ కుదుపు కుదిపిన విషయం తెలసిందే. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి కూడా ఈ కుంభకోణం కారణంగానే ఊడిపోయింది. అలాగే, పలు అగ్ర దేశాల అధినేతలు సైతం ఈ కుంభకోణం ద్వారా వెలుగులోకి వచ్చారు. అలాంటి పనామా కేసులో గలిజియా విచారణ విభాగంలో మాల్టాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన భర్త పిల్లలతో కలిసి మోస్టా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం తన ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆమె కొద్ది సెకన్లకే బాంబు పేలుడుకు గురైంది. ఆమె కారుతో సహా ఎగిరిపోయి పొలాల్లో పడిపోయారు. ఆమె దేహం పూర్తిగా కాలి చిద్రమై పోయింది. ఆమె దుర్మరణంపట్ల మాట్లా ప్రధాని జోసెఫ్ ముస్కాట్ సంతాపం వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. కాగా, పనామా కేసు విచారణలో భాగస్వామురాలైన ఆమె ప్రధాని ముస్కాట్ భార్య, విద్యుత్‌శాఖ మంత్రి అక్రమంగా నిధులు పొందారని కథనాలు వెలువరించారు. -
పనామాపై సిట్‌కు సుప్రీం నో
సాక్షి,న్యూఢిల్లీ: పనామా పత్రాల లీక్ కేసులో విడిగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారతీయుల విదేశీ ఖాతాలకు సంబంధించి పనామా పత్రాల్లో వెల్లడైన అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహుళ ఏజెన్సీలతో కూడిన బృందం దర్యాప్తు చేపట్టిందని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఆర్బీఐ, ఈడీ, సీబీడీటీ, ఎఫ్ఐయూ ప్రతినిధులతో కూడిన బృందం సిట్ తరహాలోనే వ్యవహరిస్తుందని జస్టిస్ ఏకే గోయల్, యూయూ లలిత్‌తో కూడిన సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది.బహుళ ఏజెన్సీల ప్రతినిధుల బృందం సిట్ వంటిదే అయినందున విడిగా మళ్లీ సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని బెంచ్ ప్రశ్నించింది. భారతీయుల విదేశీ ఖాతాల దర్యాప్తు వ్యవహారం అసాధారణమైనది, అత్యంత సున్నితమైనదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహుళ ఏజెన్సీల బృందం దీనిపై ఇప్పటికే దృష్టిసారించిందని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. దీనిపై మళ్లీ సిట్ ఏర్పాటు అవసరం లేదని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఆర్బీఐ, విదేశీ ద్రవ్య నిబంధనల ఉల్లంఘన జరిగినందున ఈ కేసులపై నిష్పాక్షిక విచారణ జరపడం కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు.ఈ కేసులకు సంబంధించి ఏడు నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించినా ఇంతవరకూ ప్రభుత్వం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. -
మాజీ ప్రధాని కుమార్తె, అల్లుడికి బెయిల్
ఇస్లామాబాద్: పనామా పత్రాల కేసులో పాక్ ప్రధానిగా వైదొలగిన నవాజ్ షరీఫ్ కుమార్తె, అల్లుడుకి బెయిల్ లభించింది. అయితే అవినీతి కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు ఎదుట నవాజ్ షరీఫ్ హాజరు కాలేదు.కోర్టు ఎదుట హాజరయ్యేందుకు మార్యం నవాజ్ (43) తన భర్త, మాజీ ఆర్మీ కెప్టెన్ మహ్మద్ సఫ్దర్‌తో కలిసి ఇస్లామాబాద్‌కు తిరిగివచ్చారు. కోర్టుకు చేరుకున్న వెంటనే ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో సప్ధర్ను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి వారు ఇరువురూ అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ బషీర్ ఎదుట వేర్వేరుగా హాజరయ్యారు.విచారణ సందర్భంగా నవాజ్ షరీఫ్ ఆయన ఇద్దరు కుమారులు గైర్హాజరయ్యారు. గొంతు క్యాన్సర్‌తో నవాజ్ భార్య బాధపడుతున్నక్రమంలో వారు లండన్‌లో ఉన్నారు. గతంలో జరిగిన రెండు విచారణలకు హాజరైన నవాజ్ షరీఫ్ సర్జరీ జరుగుతున్న క్రమంలో భార్యను చూసేందుకు గత వారం లండన్‌కు చేరుకున్నారు. కాగా పనామా పత్రాల కేసులో మార్యం, సఫ్దర్లు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులను అంగీకరించిన కోర్టు అక్టోబర్ 13 వరకూ విచారణను వాయిదా వేసింది. -
'పనామా పేపర్స్' పై స్పందించిన జైట్లీ
న్యూఢిల్లీ: నల్లధనం కుబేరుల వివరాలను వెల్లడిచేసిన పనామా పేపర్స్ పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ పత్రాల వెల్లడిని ఆయన స్వాగతించారు. ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సింది కోరారని తెలిపారు. ఇది స్వాగతించాల్సిన, ఆరోగ్యకరమైన పరిణామమని జైట్లీ వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జెనీవాలోని హెచ్ఎస్బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు ఉదంతంలో విచారణ మొదలైందని గుర్తు చేశారు. హెచ్ఎస్బిసి ఖాతాదారుల సంబంధించి 2011 లో 569 ఖాతాదారులను గుర్తించామని, వీటిలో 390 అక్రమ ఖాతాలుగా తేలాయని వివరించారు. ఇప్పటికే 154 సెట్ల ఫిర్యాదులను నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్రమ ఖతాదారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని , కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులను పర్యవేక్షించేందుకు మల్టీ ఏజెన్సీ గ్రూప్ ను రూపిందించనట్టు ఆర్థకి మంత్రి తెలిపారు. ఆర్బీఐకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఇది పనిచేస్తుందన్నారు. కాగా నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి 11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు పూనుకున్న పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు గుట్టు ఈ పత్రాల్లో రట్టైన సంగతి తెలిసిందే.