సాక్షి,న్యూఢిల్లీ: పనామా పత్రాల లీక్ కేసులో విడిగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారతీయుల విదేశీ ఖాతాలకు సంబంధించి పనామా పత్రాల్లో వెల్లడైన అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహుళ ఏజెన్సీలతో కూడిన బృందం దర్యాప్తు చేపట్టిందని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఆర్‌బీఐ, ఈడీ, సీబీడీటీ, ఎఫ్‌ఐయూ ప్రతినిధులతో కూడిన బృందం సిట్ తరహాలోనే వ్యవహరిస్తుందని జస్టిస్ ఏకే గోయల్, యూయూ లలిత్‌తో కూడిన సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది.బహుళ ఏజెన్సీల ప్రతినిధుల బృందం సిట్ వంటిదే అయినందున విడిగా మళ్లీ సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని బెంచ్ ప్రశ్నించింది.
భారతీయుల విదేశీ ఖాతాల దర్యాప్తు వ్యవహారం అసాధారణమైనది, అత్యంత సున్నితమైనదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహుళ ఏజెన్సీల బృందం దీనిపై ఇప్పటికే దృష్టిసారించిందని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. దీనిపై మళ్లీ సిట్ ఏర్పాటు అవసరం లేదని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఆర్‌బీఐ, విదేశీ ద్రవ్య నిబంధనల ఉల్లంఘన జరిగినందున ఈ కేసులపై నిష్పాక్షిక విచారణ జరపడం కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు.ఈ కేసులకు సంబంధించి ఏడు నివేదికలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించినా ఇంతవరకూ ప్రభుత్వం ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment