జీఎస్టీ మినహాయింపులపై జైట్లీ హెచ్చరికలు
జీఎస్టీ మినహాయింపులపై జైట్లీ హెచ్చరికలు
Published Thu, Sep 22 2016 8:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
న్యూఢిల్లీ : దేశమంతటినీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఆమోదించిన జీఎస్టీ బిల్లుపై అత్యధిక మొత్తంలో మినహాయింపులు రావడాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. ఈ బిల్లుపై ఎక్కువ మినహాయింపులు రావడం, ఇతరులకు ఎక్కువ రేటు విధించే అవకాశాలకు దారితీస్తుందని హెచ్చరించారు. జీఎస్టీ బిల్లుపై కీలక అంశాలపై చర్చించడానికి ఒక్కరోజు ముందుగానే ఆర్థికమంత్రి ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఈ రేటు నుంచి ఎక్కువ మొత్తంలో మినహాయింపు ఇవ్వడం, ఇతరులపై అత్యధిక రేటు భారం పడే అవకాశం ఉందన్నారు. ఇన్క్రిడబుల్ ఇండియా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో జైట్లీ ప్రసంగించారు. ప్రోత్సహకాలు, మినహాయింపులతో భారత్ నిరవధికంగా ముందుకు సాగలేదని తెలిపారు. జైట్లీ హెచ్చరికలతో మినహాయింపు కోరుతూ ప్రభుత్వంతో ప్రస్తుతం లాబీయింగ్ చేస్తున్న వారికి నిరాశే ఎదురయ్యేటట్టు కనబడుతోంది. ఎక్కువ మొత్తంలో మినహాయింపులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వదని వెల్లడవుతోంది.
జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర, రాష్ట్ర బాడీలు మొదటిసారి గురువారం, శుక్రవారం భేటీ అవుతున్నాయి. జీఎస్టీ రేటుతో పాటు, మినహాయింపులు ఇతర అంశాలను ఇవి చర్చిస్తాయి. ఈ చర్చల అనంతరం కేంద్ర జీఎస్టీ చట్టాన్ని, అంతరాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. వాటాదారుల సంప్రదింపుల అనంతరం ఈ చట్టాలు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. 2017 ఏప్రిల్ 1 నుంచి ఎలాగైనా జీఎస్టీ బిల్లును అమలుచేయాలని కేంద్రం యోచిస్తోంది. ద్రవ్యోల్బణ పెంపు భయాందోళనలు లేకుండా ప్రామాణికమైన జీఎస్టీ రేటును నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రేటు నుంచి ఎన్ని ఉత్పత్తులు మినహాయింపు పొందనున్నాయి. ఎన్ని తక్కువ రేటు ప్రయోజనం పొందనున్నాయి, వేటికీ భారం కొంత ఎక్కువ పడొచ్చో ఇక తేలాల్సి ఉంది.
Advertisement