ఏటీఎంలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
ఏటీఎంలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
Published Sat, Nov 12 2016 5:30 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు పాతనోట్లను మార్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో నిత్యావసరాలకు సైతం సరిపడా డబ్బు దొరకకా.. జనం నానా అవస్థలు పడుతున్నారు. కొత్తగా జారీచేసిన రూ. రెండువేల నోట్లు ఏటీఎంలలో వచ్చేందుకు వీలుగా సాఫ్ట్వేర్ మార్చాల్సి రావడంతో ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఏటీఎంల సమస్యపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్టాఫ్వేర్లో మార్పులతో కొత్త నోట్లు అందించేవిధంగా రెండువారాల్లో దేశమంతటా ఏటీఎంలు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
పెద్దనోట్లను రద్దుచేసి.. ఆ స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడమనేది భారీ ఆపరేషన్ అని, ఆ ఆపరేషన్ ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్నారు. దేశంలోని 86శాతం కరెన్సీని మార్చాలన్న నిర్ణయం కారణంగా ప్రారంభంలో కొన్ని కష్టాలు రావడం సహజమేనని పేర్కొన్నారు. పెద్దనోట్ల మార్పిడి విషయమై ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని జైట్లీ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చిల్లర కొరత తీర్చేందుకు, ప్రజల అవసరాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నోట్ల మార్పిడి మొదలై మూడురోజులైందని, ఒక్క ఎస్బీఐలోనే ఏకంగా రూ. 47.86వేల కోట్ల డిపాజిట్లు జమ అయ్యాయని చెప్పారు. ఇలా నగదు జమ కావడం వల్ల దేశంలో అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరుగాలన్న ఉద్దేశాన్ని ఇది నెరవేరుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు బ్యాంకు సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క ఎస్బీఐలోనే గత రెండురోజుల్లో 2.28 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు.
పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు అర్థంలేనివని కొట్టిపారేశారు. డిసెంబర్ 30 తర్వాత నోట్ల మార్పిడి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ మనీని గుర్తించడానికి ఎంత దూరమైనా పోతామని ఆయన మండిపడ్డారు.
Advertisement
Advertisement