
బడ్జెట్ వాయిదా?: కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: మళప్పురం లోక్‌సభ సభ్యుడు ఇ. అహ్మద్ హఠాన్మరణం నేపథ్యంలో బుధవారమే బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేక గురువారానికి వాయిదా వేయాలా? అనేదానిపై కేంద్ర మంత్రివర్గం సమాలోచనలు జరుపుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే భేటీకి పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అరుణ్ జైట్లీ సిద్ధం చేసిన బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
(ఎంపీ హఠాన్మరణం:కేంద్ర బడ్జెట్ వాయిదా..?)
పార్లమెంట్ వాయిదాపై తుది నిర్ణయం స్పీకర్ సుమిత్రా మహాజన్‌దే అయినప్పటికీ, ప్రభుత్వ అభిప్రాయం ఏమిటన్నది కీలకాంశంగా మారింది. చనిపోయిన వ్యక్తి సిట్టింగ్ ఎంపీ కావడం, అందునా, పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే కుప్పకూలడం లాంటి అంశాల నేపథ్యంలో బడ్జెట్‌ను ఒక రోజుకు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరే అవకాశంఉంది. అన్నివర్గాల అభిప్రాయాలు విన్నపిదప ఉదయం 10 గంటలకు స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తారని తెలిసింది.
ఇదిలా ఉంటే, ‘నేటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి, ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. బడ్జెట్ యధాతధంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.