
నోట్ల రద్దు గురించి ఆర్థిక మంత్రికి తెలియదా?
న్యూఢిల్లీ: ‘వైరుధ్యం ఎలా ఉంటుందో చూడండి.. 1)నోట్ల రద్దు.. ప్రధాని వ్యక్తిగత నిర్ణయం. కనీసం ఆర్థిక మంత్రిని, రిజర్వ్ బ్యాంక్ అధికారుల్ని సంప్రదించకుండా కూడా మోదీ దుస్సాహసం చేశారు. 2) నోట్ల రద్దు నిర్ణయం బీజేపీ పెద్దలకు, వారి సన్నిహితులకు ముందే లీకైంది. దీంతో వాళ్లు జాగ్రత్త పడ్డారు. పేదలను మాత్రం రోడ్డున పడేశారు..... ఈ రెండూ వేరువేరు వ్యక్తుల అభిప్రాయాలు కావు.. ఒకే పార్టీ ఒకసారి ఒకలా, మరోసారి ఇంకోలా మాట్లాడుతోంది. మొత్తంగా మోదీ ఇచ్చిన షాక్ నుంచి విపక్షాలు ఇంకా కోలుకోలేదు. ఇప్పట్లో తేరుకోలేవు కూడా’అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వ్యవహారంలో విపక్షాల తీరును ఆక్షేపించిన ఆయన.. ఆర్థిక మంత్రికి తెలియకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను ఖండించారు. మోదీ సాహసోపేత నిర్ణయంతో కొన్ని రోజులు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా అంతిమంగా ఎన్నో మేళ్లు జరుగుతాయని, తద్వారా పేదలు లబ్దిపొందుతారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా ‘సాధారణం’ అనుకున్న విధానాలన్నింటికీ చరమగీతం పాడుతూ మోదీ దాని(మామూలు) స్థాయిని పెంచారని వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమోదించామని మంత్రి వెంకయ్య నాయుడు మీడియాకు తెలిపారు. ఇక మంగళవారం కూడా నోట్ల రద్దు వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను ఉదిపేసింది. సభలు ప్రారంభమైన వెంటనే స్పీకర్, చైర్మన్ల పోడియంలను చుట్టుముట్టిన విపక్ష సభ్యులు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, గందరగోళపరిస్థితిని నివారించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఉభయసభలు పలు మార్లు వాయిదాపడ్డాయి.