నదుల అనుసంధానం సలహా నాదే!: సీఎం | Chandrababu comments on river interlinking | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానం సలహా నాదే!: సీఎం

Published Tue, Sep 4 2018 3:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

Chandrababu comments on river interlinking - Sakshi

సాక్షి, అమరావతి: వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఆయనకు నదుల అనుసంధానం సలహా ఇచ్చింది తానేనని సీఎం చంద్రబాబు చెప్పారు. తాను చెప్పాకే నదుల అనుసంధానంపై సురేష్‌ ప్రభు నేతృత్వంలో ఒక కమిటీ వేశారని, కానీ అది ఆచరణలోకి రాలేదన్నారు. అలాగే అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది కూడా తానేనని చెప్పుకొచ్చారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలో వృద్ధి ఆగిపోయిందన్నారు. పెట్రోల్‌ ధర రూ.వందకు చేరేలా ఉందని.. రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతోందన్నారు. 

నోట్ల రద్దుపై నా మాట వినలేదు..!
నోట్ల రద్దుతో ఏం సాధించారని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దానివల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. తాను రూ.2 వేలు, రూ.500 నోట్లు రద్దు చేయాలని చెప్పానన్నారు. అదే సమయంలో డిజిటల్‌ కరెన్సీ, రూ.100, రూ.200 నోట్లు ఎక్కువ తేవాలని సూచన చేశానని.. కానీ కేంద్రం తన మాట వినలేదన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశారని విమర్శించారు. వేరే ఏ ప్రభుత్వమున్నా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదన్నారు. ప్రధాని మోదీకి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అవినీతిపరులను ప్రోత్సహిస్తూ ఆ మాటలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. 

ఎథికల్‌ హ్యాకింగ్‌ను ప్రోత్సహిస్తాం..
సైబర్‌ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని, ఎథికల్‌ హ్యాకింగ్‌ను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ–ప్రగతి ప్రాజెక్టుపై సోమవారం వెలగపూడిలోని ఆర్టీజీ సెంటర్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంట్లో కూర్చునే అన్ని పనులు జరిగేలా ఉండాలన్నారు. ఈ–ప్రగతి ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 793 సర్వీసులను ఇంటిగ్రేట్‌ చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. 

సీపీఎస్‌పై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి..
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) విధానం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని, దానిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, హరికృష్ణ మృతి వల్ల ఆలస్యమైందన్నారు. ఉల్లి రైతులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వాస్పత్రుల్లో పడకలు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 15కల్లా అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. నెల రోజుల్లో 12 సాగునీటి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తామని వెల్లడించారు. 45 రోజుల్లో మరో 12 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.58 వేల కోట్ల అంచనాలతో ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్‌ డీపీఆర్‌ పంపించామని.. దాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉందన్నారు. వచ్చే నెలలో ప్రాజెక్టు మొదటి గేటు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెల 17, 18, 19 తేదీల్లో జలసిరికి హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement