
పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రతులు..
న్యూఢిల్లీ: ఎంపీ ఆకస్మిక మరణంతో బడ్జెట్ వాయిదా పడుతుందా? లేదా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్న తరుణంలోనే బడ్జెట్ ప్రక్రియకు సంబంధించిన అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో కలిసి బుధవారం ఉదయం రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన చేతిలో బడ్జెట్ సూట్‌కేసు కూడా ఉంది.
ఇదిలాఉంటే, బడ్జెట్ ప్రకటనపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే ‘బడ్జెట్ తప్పక ఉంటుంది’ అంటూ ప్రభుత్వ వర్గాలు చూచాయగా పేర్కొన్నాయి. మరణించిన ఎంపీ అహ్మద్‌కు సభలో నివాళులు అర్పించిన అనంతరం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారని తెలిసింది. అయితే అధికారిక ప్రకటనమాత్రం స్పీకర్ నిర్ణయం తర్వాతే ఉంటుంది.
ఇటు పార్లమెంట్ ఆవరణలోనూ బడ్జెట్ హడావిడి కనిపించింది. ఉదయం 9:30 గంటలకే బడ్జెట్ ప్రతులు ఉంచిన భారీ బాక్సులను సిబ్బంది పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. ఈ పేపర్ ప్రతులను కేవలం ఎంపీలకు మాత్రమే అందజేస్తారు. వార్తాసంస్థలు, ఇతర మాద్యమాలకు డిజిటల్ బడ్జెట్‌ను అందుబాటులో ఉంచుతారు. 92 ఏళ్ల సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రకటించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో కలిపి ప్రకటించనున్నారు.
(ఎంపీ హఠాన్మరణం:కేంద్ర బడ్జెట్ వాయిదా..?)