తప్పిదాలకు ప్రతిబింబం
రెండో మాట
బడా కోటీశ్వరుల నుంచి బ్యాంకులకు చేరవలసిన లక్షల కోట్ల బకాయిలు వసూళ్లు కావు. అయితే ఈ నెపాన్ని పాలకులు బ్యాంకర్ల మీదకి నెడుతున్నారు. బ్యాంకర్లు అవినీతిపరులైన రాజకీయనాయకుల మీదకూ, పాలనా వ్యవస్థ మీదకూ నెడుతున్నారు. దేశంలో దారిద్య్రాన్ని, పేదలను గుర్తించడానికి పంచవర్ష ప్రణాళికలు చాలడం లేదు. అందుకేనేమో, అసలు ప్రణాళికా విధానానికే స్వస్తి చెప్పి, ముక్కూ మొహం లేని నీతి ఆయోగ్ అనే నిర్వీర్యపు వ్యవస్థను ఆవిష్కరించారు బీజేపీ పాలకులు.
‘2017–2018 కేంద్ర బడ్జెట్ అసంఘటిత రంగంలోని కోట్లాదిమంది కార్మికులకు సహాయంగా, వెన్నుదన్నుగా నిలబడడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం ఆకస్మికంగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో వీరు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడి వాటాలను తెగనమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైగా విదేశీ పెట్టుబడుల నియంత్రణ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మరింత విస్మయం కలిగించింది. అన్నింటికీ మించి కార్మిక చట్టాలను సవరించే ప్రతిపాదన కోసం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఇది మరింత అసమంజస చర్య. పైగా ఏ దేశ ప్రజలంతా నోట్ల రద్దు చర్యను సమర్థించారని ప్రభుత్వం చెబుతోందో, ఆ పేదలే ఆ కార్మికవర్గాలే నోట్ల రద్దు భారాన్నీ, బాధలనీ అనుభవించాల్సి వచ్చిందని మరువరాదు.’- విరజేశ్ ఉపాధ్యాయ (ఆరెస్సెస్–బీజేపీ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి, 4–2–2017)
వివాదాస్పద ప్రకటనలకు, అధికారంలో ఉన్నా లేకున్నా పెక్కుసార్లు సమాజంలో అశాంతి పరిస్థితులకు కేంద్రంగా ఉండే ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం నుంచి వెలువడిన ప్రకటన ఇది. దీనిని ప్రజలు నమ్మవచ్చా? కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంస్థలు కూడా గతంలోనూ ఇప్పుడూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్రకటనలు గుప్పించడం, వాటితో ప్రమేయం లేనట్టు యథా ప్రకారం పార్టీ ఎన్నికల హామీలను చెత్తబుట్టలోకి విసరడమూ ప్రజాబాహుళ్యానికి అనుభవమే. పాలకపక్షాలకు అనుబంధ సంస్థలుగా వర్ధిల్లుతున్న కుహనా ‘కార్మిక, కిసాన్’ సంఘాల లక్ష్యం కూడా రాజకీయ పార్టీల, వాటి నాయకుల ఉనికిని కాపాడేందుకే. అంతేతప్ప, స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన త్యాగాలను గౌరవించడానికి, వలస దోపిడీ అవలక్షణాలను తుడిచిపెట్టగల సామాజిక వ్యవస్థను పాదుకొల్పడానికి మాత్రం కాదు. మన పాలకులు కూడా వలస పాలన అవశేషాలను వీడి ప్రజానుకూలమైన పాలనా వ్యవస్థను ఆశ్రయించడానికి సిద్ధపడలేక ప్రజల ముందు నిలబడలేకపోతున్నారు.
తప్పు వెంట తప్పు
ఈ పరిణామక్రమంలోనే తమ పాలకపక్షాన్ని రక్షించుకునేందుకు బీజేపీ అనుబంధ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి హోదాలో విరజేశ్ ఉపాధ్యాయ ఇలాంటి ప్రకటన చేయక తప్పలేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేద ప్రజలకు, కార్మికులకు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన అపకారాన్ని గుర్తు చేయక తప్పలేదు కూడా. కాబట్టి నోట్ల రద్దును ప్రజలంతా స్వాగతించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం అంటే, ఒక తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేయడమే. నోట్ల రద్దును విదేశీయులు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పి, మోదీ తప్పు మీద తప్పు చేశారు. ఈ చర్య తరువాత బ్యాంకులు, ఏటీఎంల దగ్గర బారులు తీరిన జనాల ఇక్కట్లను, సంభవించిన దుర్మరణాలను ఇంకా ఎవరూ మరచిపోలేదు. అయితే ఇలాంటి వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పే సంస్కారాన్ని కూడా ప్రభుత్వం ప్రదర్శించలేకపోయింది. అంతేకాదు, నోట్ల రద్దు కర్మకాండ తరువాత ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో కూడా అధికారంలోకి వచ్చే ఉద్దేశంతో ఎన్నికలలో ఇచ్చిన హామీలను బీజేపీ పక్కన పెట్టింది. మోదీ, ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ పాలనను తూర్పార పడుతూ చేసిన ప్రకటనలు కూడా రూటు మార్చుకున్నాయి. ఆధార్ ప్రక్రియను పౌర సేవలకు వినియోగించడానికి వీలులేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా బీజేపీ ప్రభుత్వం గౌరవించలేదు. పైగా ఆ ప్రక్రియను మరింత విస్తృతం చేసింది.
ఇలాంటి అవకతవక నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. బడ్జెట్ కూడా ఇందుకు ఒక ఉదాహరణ. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పనిని నెలరోజులు ముందుకు తెచ్చింది. ఫిబ్రవరి–మార్చిలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరగనున్నందున బడ్జెట్ ప్రతిపాదనల ప్రభావాన్ని తమకు సానుకూలంగా మలుచుకునేందుకే, ఓటర్లను ప్రభావితం చేసేందుకే బీజేపీ ఈ చర్యకు ఉపక్రమించింది. ఎప్పుడూ ప్రత్యేకంగా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం కూడా ఇందుకే. బడ్జెట్ ప్రతిపాదనలకు అవసరమైన ఆదాయ వనరుల లోటు, ద్రవ్య వనరుల లోటు ముమ్మరిస్తున్నందునే ఈ సాకు వెనుక దాగవలసి వచ్చింది. ప్రత్యక్ష పన్నుల మీద రాయితీ ప్రకటించి, ప్రజా బాహుళ్యం మీద విధించే పరోక్ష పన్నులు పెంచే పద్ధతిని ఆలోచించారు. ఇందుకు ఫెడరల్ వ్యవస్థ స్వభావాన్ని మార్చి, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ద్వారా రాష్ట్రాల అధికారాలను కుంచింప చేశారు. పన్నులు పెంచడానికి కూడా వెసులుబాటు కల్పించుకున్నారు. ఉన్నంతలో తక్కువ సాలుసరి ఆదాయం పొందేవారికి రూ. 5 లక్షల లోపు ఆదాయం మీద ప్రస్తుతం విధిస్తున్న 10 శాతం పన్నును ఐదు శాతానికి తగ్గించడమొక్కటే బీజేపీ సర్కారు చేసిన మేలు.
త్రిశంకు స్వర్గంలో ఉన్న టెక్ నిపుణులు
ఇక కార్పొరేట్లు, బడా కంపెనీలు గంప గుత్తగా సాధించే లాభాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కూ, మన పాలకులకూ పెద్ద తేడాలేదు. భారత ఐటీ కంపెనీల ఉనికి పూర్తిగా అమెరికా పాలకుల దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉన్నందున ప్రస్తుత వాతావరణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారో, అవి ఎలాంటి ఏర్పాట్లో తెలియని అయోమయ స్థితిలో మన టెక్ నిపుణులు తేలియాడుతున్నారు. వీటి మీద ఇప్పటిదాకా ఆశలు పెట్టుకుని ఉన్న మన నిపుణులు అక్షరాలా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. కానీ ఈ అంశం మీద పాలకులకు విధాన నిర్ణయమేదీ లేదన్నది వాస్తవం.
మోదీ ఒక పక్క నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజామోదం ఉందన్నారు. మరోసారి ఈ నిర్ణయం తరువాత తనను చంపినా చంపవచ్చునంటూ మాట్లాడారు. దేశంలో అవినీతినీ, నల్లధనాన్నీ రూపుమాపేందుకు సంకల్పించిన తనను చంపే అవకాశం ఉందని ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రకటించిన మోదీ, నోట్ల రద్దు ద్వారా అవినీతి, నల్లధనం ఏ మేరకు అదుపులోనికి వచ్చాయో మాత్రం వెల్లడించలేదు. రిజర్వు బ్యాంకు కూడా అంతే. స్విస్ బ్యాంకులలోను, పనామా పత్రాల వెల్లడితోనూ బయటపడిన రూ. 24 లక్షల కోట్ల గుప్తధనాన్ని ఇంతవరకు ఎందుకు వెనక్కి రప్పించలేకపోయారో కూడా ప్రభుత్వం చెప్పలేదు. నిరుపేద కుటుంబాల కోసమని మోదీ ఆదిలో తెరిపించిన జన్‌ధన్ ఖాతాల ప్రస్తుత పరిస్థితి ఏమిటో కూడా తెలియదు. ఇంతకీ ఎన్నికల కోసమని ప్రకటించిన నల్లధనం మీద దండోరా ఫలితం– దొంగచాటుగా బ్యాంకు ఖాతాలలో జమపడిన డబ్బు, జన్‌ధన్ ఖాతాలలోకే చేరినందున అదంతా పేదలదేనని నాయకులు ఉచిత ప్రకటనలు చేయడమే.
అయితే ఈ ఉచిత ప్రకటనలు కూడా మోసమే. బ్యాంకులకు చేరినవన్నీ రద్దయిన నోట్లనీ, అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని నాయకులే చెప్పిన మాటలు వాస్తవాలని ప్రజలకు క్రమంగా గాని తెలిసిరాదు. ఈలోగా, ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైన కనీస ఆదాయాన్ని ప్రతి పౌరుడికీ కల్పించడం అవసరమని బీజేపీ పాలకులు తమ ఆదర్శంగా ప్రకటన అయితే చేశారు. ఇంకేముంది? ఫ్రెంచ్ వాడు ప్రతిపాదించిన ఈ ప్రచార చొరవను పేదసాదలకు, రైతులకు, వృత్తి పనివారికి ఉద్దేశించిన సబ్సిడీలను ప్రపంచ బ్యాంక్ సంస్కరణల పుణ్యమా అని రద్దు చేసేందుకు వర్ధమాన దేశాల పాలకులు అవకాశంగా మలుచుకున్నారు. కనుకనే కాంగ్రెస్ పాలకులతో ప్రారంభమైన పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలు, సబ్సిడీల కోత వయా వాజ్‌పేయి హయాం మీదుగా మోదీ దాకా కొనసాగుతున్నాయి.
యూబీఐ పగటి కల
సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (యూబీఐ) ఒక కొత్త కల. వర్ధమాన దేశాలు ఎదిగేవరకు వర్తింప చేయవలసిన సబ్సిడీలను క్రమంగా తొలగించడానికి ఉద్దేశించినదే ఈ పగటి కల. మోదీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం దృష్టిలో యూబీఐ ‘విప్లవాత్మక ఆలోచన’ కావడం కూడా ఇందుకే. దారిద్య్ర నిర్మూలను అవసరమైన సబ్సిడీకి యూబీఐ సరైన ప్రత్యామ్నాయం కూడా అయిపోయింది. కానీ ఆర్థిక నిపుణుల దృష్టిలో ఈ యూబీఐ ప్రకారం పేదలలో ప్రతి వ్యక్తికి ఏడాదికి బేసిక్ ఆదాయ వనరుగా రూ. 14,000 సమకూర్చే హామీ ఇవ్వాలంటే (లేదా నెలకు రూ. 1,200 ఏర్పాటు కావాలంటే) జనాభాలో నాలుగో వంతు పేదలకు మాత్రమే ఆ మేరకు అవకాశం వస్తుంది. ఈ లెక్కన సార్వత్రిక ప్రాథమిక ఆదాయ వనరు పేద జనాభాకు అందించాలంటే ఏడాదికి మొత్తం రూ. 6,93,000 వేలు అవసరమవుతుంది. అంటే 2017–18 సంవత్సరపు వ్యయం కాగల బడ్జెట్‌లో ఈ మొత్తం 35 శాతంగా ఉండాలి. అయితే బడ్జెట్‌లో ఎక్కువ వాటా బడా కార్పొరేట్‌లను సాకడానికి వ్యయ మవుతున్నందున పేదలకు బడ్జెట్ ద్వారా అందేది నామమాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
మభ్యపరిచే రాజకీయాలు మనకు వద్దు. బడా కోటీశ్వరుల నుంచి బ్యాంకులకు చేరవలసిన లక్షల కోట్ల బకాయిలు వసూళ్లు కావు. అయితే ఈ నెపాన్ని పాలకులు బ్యాంకర్ల మీదకి నెడుతున్నారు. బ్యాంకర్లు అవినీతిపరులైన రాజకీయనాయకుల మీదకూ, పాలనా వ్యవస్థ మీదకూ నెడుతున్నారు. దేశంలో దారిద్య్రాన్ని, పేదలను గుర్తించడానికి పంచవర్ష ప్రణాళికలు చాలడం లేదు. అందుకేనేమో, అసలు ప్రణాళికా విధానానికే స్వస్తి చెప్పి, ముక్కూ మొహం లేని నీతి ఆయోగ్ అనే నిర్వీర్యపు వ్యవస్థను ఆవిష్కరించారు బీజేపీ పాలకులు. చివరకు ప్రణాళికా వ్యవస్థ ద్వారా కార్మికులు, వ్యవసాయ కార్మికులకు ఉద్దేశించిన చట్టాలను కూడా చాప చుట్టేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా – దేశంలోనే ఉత్పత్తి జరగాలన్న నినాదం, శ్రమయేవ జయతే నినాదంతో పాటు శ్రమ సువిధ పేరిట వెబ్‌ను పెట్టారే గాని, ఆచరణ మాత్రం పక్కదారి పట్టింది. పరిశ్రమలలో తనిఖీ పద్ధతి ఎత్తివేసి యాజమాన్యాలే ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా తమకు తామే స్వయంగా కితాబులు ఇచ్చుకునే అవకాశాన్ని కూడా మోదీ పాలన కల్పించింది. స్వయం ఉపాధి అంటే ఇదేనేమో! అందుకే పేదరికం బాధను అనుభవించి పలవరించిన యువకవి అలిసెట్టి అన్నాడు, ‘‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణి / వేరు చేస్తే శ్రమ విలువేదో తెలిసిపోదూ!’ అని.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in