సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో ఒక్కసారిగా పెరిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈల) నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత రాష్ట్రంలో రికార్డుస్థాయికి చేరిన ఎంఎస్‌ఎంఈల నిరర్థక ఆస్తుల విలువ పరిస్థితులు చక్కబడటంతో క్రమేపీ దిగివస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల ఎంఎస్‌ఎంఈ ఖాతాలను పరిశీలిస్తే 2020 సెప్టెంబర్ నాటికి రూ.4,098 కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తుల విలువ 2021 సెప్టెంబర్ నాటికి రూ.7,005 కోట్లకు చేరాయి.
ఆ తర్వాత నుంచి కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుండటంతో క్రమేపీ ఎంఎస్‌ఎంఈల నిరర్థక ఆస్తులు తగ్గుముఖం పట్టాయి. గత ఆరునెలల్లో ఈ రంగానికి చెందిన ఎన్‌పీఏలు రూ.1,002 కోట్లు తగ్గాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.7,005 కోట్లుగా ఉన్న ఎన్‌పీఏల విలువలీ ఏడాది మార్చి నాటికి రూ.5,982 కోట్లకు తగ్గింది. మార్చి నాటికి రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు 17,19,611 రుణ ఖాతాలను కలిగి ఉండగా మొత్తం రుణవిలువ రూ.69,361 కోట్లుగా ఉంది.
గత ఆరునెలల్లో బ్యాంకులు ఎంఎస్‌ఎంఈలకు రూ.1,05,028 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేయగా ఇదే సమయంలో రూ.1,002 కోట్ల ఎన్‌పీఏలు తగ్గినట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ నాటికి మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల వాటా 10.54 శాతంగా ఉంటే అది మార్చి నాటికి 8.62 శాతానికి తగ్గింది. ఎంఎస్‌ఎంఈల వృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తుండటంతో రానున్న కాలంలో వీటి నిరర్థక ఆస్తుల విలువ మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు.
తగ్గిన ఎంఎస్‌ఎంఈ ఎన్‌పీఏలు
Published Mon, May 9 2022 3:20 AM | Last Updated on Mon, May 9 2022 3:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment