న్యూఢిల్లీ: సుమారు రూ. 3,900 కోట్ల మేర మొండిబాకీలను రాబట్టుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో 8 నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) విక్రయించనుంది. ఇందుకోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్‌సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఎనిమిది ఖాతాల్లో అత్యధికంగా కోల్‌కతాకు చెందిన రోహిత్ ఫెరో టెక్ రూ. 1,320 కోట్లు బాకీ పడింది.
మిగతా లిస్టులో ఇండియన్ స్టీల్ కార్పొరేషన్ (రూ. 929 కోట్లు), జై బాలాజీ ఇండస్ట్రీస్ (రూ. 859 కోట్లు), మహాలక్ష్మి టీఎంటీ (రూ. 410 కోట్లు), ఇంపెక్స్ ఫెర్రో టెక్ (రూ. 201 కోట్లు), కోహినూర్ స్టీల్ (రూ. 111 కోట్లు), మోడర్న్ ఇండియా కాన్‌కాస్ట్ (రూ. 71 కోట్లు), బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ (రూ. 47 కోట్లు) ఉన్నాయి. ఆసక్తి వ్యక్తీకరణ పత్రం సమర్పించి, నిర్దిష్ట ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత బిడ్డింగ్ చేసే సంస్థలు ఆయా సంస్థల ఆస్తులను మదింపు చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది.
ఈ పద్దుల విక్రయానికి సెప్టెంబర్ 26న ఈ–బిడ్డింగ్ జరుగుతుందని తమ వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రకటనలో పేర్కొంది. గత నెలలోనే ఎస్‌బీఐ సుమారు రూ.2,490 కోట్ల బకాయిలకు సంబం ధించి రెండు ఖాతాలను (బాంబే రేయాన్ ఫ్యాషన్స్, శివమ్ ధాతు ఉద్యోగ్) అమ్మకానికి ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment