అడ్వాన్స్ పన్ను చెల్లింపుల్లో ఎస్ బీఐ వెనుకంజ
మొండి బకాయిల తీవ్రతకు ప్రతిబింబం
ముంబై: ముందస్తు పన్ను చెల్లింపుల్లో బ్యాంకింగ్ వెనుకబడింది, మొండి బకాయిల సమస్య తీవ్రత దీనికి ప్రధాన కారణమని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచి అడ్వాన్స్ పన్నులు తగ్గినప్పటికీ, ఫార్మా, ఆయిల్ వంటి రంగాలు ఈ విషయంలో మంచి పనితీరును కనబరిచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి క్వార్టర్‌కు అడ్వాన్స్ పన్ను చెల్లింపులకు తుది గడువు 15వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం... కొన్ని ప్రధాన బ్యాంకులు, సంస్థల అడ్వాన్స్ పన్ను చెల్లింపులు ఇలా ఉన్నాయి.
కొన్ని బ్యాంకులను చూస్తే...
2014-15 జనవరి-మార్చి క్వార్టర్‌తో పోల్చి 2015-16 మార్చి త్రైమాసికాన్ని పరిశీలిస్తే... ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం- ఎస్‌బీఐ అడ్వాన్స్ పన్ను చెల్లింపులు 60 శాతం తగ్గాయి. ఈ మొత్తం రూ.1,749 కోట్ల నుంచి రూ.690 కోట్లకు క్షీణించింది. మొత్తం ఏడాదికి చూస్తే... ఎస్‌బీఐ చెల్లింపుల్లో అసలు వృద్ధిలేకపోగా 7 శాతం క్షీణించి, రూ.5,800 కోట్ల నుంచి రూ.5,350 కోట్లకు క్షీణించాయి. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాన్స్ పన్ను చెల్లింపులు స్వల్పంగా రూ.1,295 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు చేరాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక చెల్లింపులు 21% వృద్ధితో రూ.4,500 కోట్ల నుంచి రూ.5,400 కోట్లకు ఎగశాయి. అయితే మొండిబకాయిల సమస్య అంతగాలేని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ త్రైమాసిక అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు 14 శాతం వృద్ధితో రూ.1,400 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు ఎగశాయి. ఈ బ్యాంక్ వార్షిక చెల్లింపులు 23 శాతం రూ.5,300 కోట్ల నుంచి రూ.6,500కు పెరిగాయి. కాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చెల్లింపులు రూ. 1,470 కోట్ల నుంచి రూ.1,647 కోట్లకు ఎగశాయి. వార్షికంగా చూస్తే... ఈ చెల్లింపులు 12 శాతం వృద్ధితో రూ.6,590 కోట్లకు ఎగశాయి.