Advance tax payment
-
పన్ను చెల్లింపు దారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 15 ఆఖరి తేదీ!
ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. మరో రెండు రోజుల్లో అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చెల్లించాల్సిన గడువు ముగియనుంది. ట్యాక్స్ పేయర్స్ వెంటనే అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. లేదంటే జరిమానా, అదనంగా వడ్డీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అడ్వాన్స్ ట్యాక్స్ పే అంటే ఏమిటి? రాబోయే ఆదాయాన్ని అంచనా వేసి ముందస్తుగా చెల్లించే పన్నునే అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. ఈ ముందస్తు పన్నును ఒకే సారి సంవత్సరం చివర కాకుండా దశల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ పేని ఎవరు చెల్లించాలి? సెక్షన్ 208 ఇన్ కం ట్యాక్స్ యాక్ట్, 1961 ప్రకారం.. అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయపన్ను రూ.10వేలు లేదా అంత కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ విభాగంలో వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఇలా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ పే ఎవరికి మినహాయింపు ఉంటుంది? ఉద్యోగులకు చెల్లించే జీతంలో టీడీఎస్ కట్ అవుతుంది. అయితే, ఉద్యోగులు జీతం కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పొందుతుంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అనేది తప్పని సరి. 60 సంవత్సరాలు పైబడి ఎలాంటి వ్యాపార, వృత్తిగత ఆదాయం లేని సీనియర్ సిటిజన్స్‌కు కూడా దీని నుంచి మినహాయింపు ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఎలా లెక్కించాలి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-2023) అందే అన్ని రకాల ఆదాయాలను అంచనా వేయాలి. ఇలా అంచనా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను తీసివేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం పన్ను విలువ రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే కట్టాల్సిన జరిమానాలు సెక్షన్ 234బీ,234 సీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స పేమెంట్ చేసేందుకు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సెక్షన్ల కింద నెలకు 1 శాతం లేదా దానిలో కొంత వడ్డీ పడుతుంది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన తేదీలు జూన్ 15 కంటే ముందు : 15 శాతం అడ్వాన్స్ ట్యాక్స్‌ను తప్పని సరిగా చెల్లించాల్సి సెప్టెంబర్ 15 కంటే ముందు : మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 45 శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తం చెల్లించాలి. డిసెంబర్ 15 కంటే ముందు - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 75శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తం చెల్లించాలి. చివరిగా :: మరో రెండు రోజుల్లో అడ్వాన్స్ ట్యాక్స్ పే తేదీ గడువు ముగియనుందని, చెల్లింపు దారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. -
అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానా ఎంతో తెలుసా?
గత వారం ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి ట్యాక్స్ ప్లానింగ్ అమలుపర్చే దారిలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ట్యాక్స్ ప్లానింగ్‌లో ముఖ్యమైన భాగం.. చట్టాన్ని తప్పనిసరిగా సకాలంలో పాటించడమే. నిబంధనలను గౌరవించి అమలుపర్చడమే. పన్ను చెల్లించడం కూడా ప్లానింగ్‌లో ఒక భాగమే! ప్రతి అస్సెస్సీ తన నికర ఆదాయాన్ని ముందుగానే ఊహించడం చేయాలి. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని కనీసం జూన్ మొదటి వారంలోగా అంచనా వేయాలి. ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు కష్టమే. అందునా ఇప్పుడు మనల్ని పీడిస్తున్న అనిశ్చితిలో ఇది మరింత కష్టమే. అయినప్పటికీ ఇది తప్పదు. ఉద్యోగస్తులకు సంబంధించిన పన్ను భారం టీడీఎస్ రూపంలో యజమాని రికవర్ చేస్తారు. కానీ వీరికి జీతం కాకుండా ఇతర ఆదాయం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్ డివిడెండ్లు, వడ్డీ.. ఇలా ఎన్నో ఉండవచ్చు. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంది బ్యాంకులో ఉన్న ఎఫ్డీలకు సంబంధించిన వడ్డీ మీద ఏర్పడ్డ పన్ను భారం .. టీడీఎస్‌తో సరిపోతుందనుకుంటారు. అలా సరిపోదు. ఎందుకంటే బ్యాంకు కేవలం 10 శాతం మాత్రమే రికవర్ చేస్తుంది. మీకు మీ శ్లాబుని బట్టి మరో 10 శాతం లేదా 20 శాతం పడుతుంది. ఈ అదనపు ఆదాయాన్ని మీరు.. అంచనాల్లోకి తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ముందు ముందు వ్యాపారం ఎలా ఉంటుందని ఊహించటం తప్పనిసరి. కనీసం గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయం బేసిస్‌గా తీసుకోండి. ఇది రెసిడెంట్లకు వర్తిస్తుంది. మొత్తం నికర ఆదాయం లెక్కించి, పన్ను భారాన్ని లెక్కించిన తర్వాత నాలుగు వాయిదాల్లో కింద పేర్కొన్న పట్టిక ప్రకారం చెల్లించాలి. 15 జూన్‌లోగా 15 శాతం 15 సెప్టెంబర్‌లోగా 30 శాతం 15 డిసెంబర్‌లోగా 30 శాతం 15 మార్చిలోగా 25 శాతం మార్చి 15 లోగా మొత్తం పన్ను భారం చెల్లించాలి. మీరు ఎస్టిమేట్ చేసినప్పుడు టీడీఎస్ తగ్గించాలి. ఏదేని కారణం వల్ల కట్టకపోతే, చెల్లించేందుకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది. మార్చి 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే అలా చెల్లించనందుకు గాను నెలకు 1 శాతం లోపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది అనవసరపు ఖర్చు. అంతే కాదు. మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్ భారంలో 90 శాతం భాగాన్ని మార్చి 15లోగా చెల్లించకపోతే అదనంగా చెల్లించాల్సిన పన్ను మీద నెలకు 1 శాతం వడ్డీ వడ్డిస్తారు. కాబట్టి వెనువెంటనే 31-3-22కి సంబంధించి నికర ఆదాయాన్ని, పన్ను భారాన్ని లెక్కించండి. అడ్వాన్స్ ట్యాక్స్ భారం రూ.10,000 లోపు ఉన్న వారికి పైన చెప్పిన నిబంధనలు వర్తించవు. (చదవండి: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) -
ముందస్తు పన్నుల్లో బ్యాం‘కింగ్’లు వెనుకంజ!
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ పేలవ పనితీరు ముంబై: ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో మూడవ త్రైమాసికంలో అగ్ర బ్యాంకులు వెనకబడ్డాయి. దీంతో అతిపెద్ద రెవెన్యూ జోన్‌గా పేరొందిన ముంబైలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్ల వృద్ధి కేవలం 10%గా నమోదయింది. ఈ ప్రాంతంలోని 43 అతిపెద్ద కార్పొరేట్ల చెల్లింపులు వార్షికంగా చూస్తే, 10% వృద్ధితో రూ.24,811 కోట్ల నుంచి (గత ఏడాది ఇదే త్రైమాసికంలో) రూ.27,321 కోట్లకు పెరిగాయి. వివిధ సంస్థలను చూస్తే... ⇔ ఎస్బీఐ చెల్లింపులు 25% పడిపోయి రూ.1,731 కోట్ల నుంచి రూ.1,282 కోట్లకు పడిపోయాయి. ⇔ ఐసీఐసీఐ బ్యాంక్ విషయంలో ఈ రేటు 27.3% క్షీణించి రూ.1,650 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు దిగింది. ⇔ ఎల్ఐసీ నుంచి వసూళ్లు 13% వృద్ధితో రూ.1,977 కోట్ల నుంచి రూ.2,235 కోట్లకు చేరాయి. ⇔ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చెల్లింపులు 17% వృద్ధితో రూ.1,970 కోట్ల నుంచి రూ.2,300 కోట్లకు చేరాయి. అలాగే మార్టిగేజ్ లెండర్ హెచ్డీఎఫ్సీ చెల్లింపులు రూ.810 కోట్ల నుంచి రూ.920 కోట్లకు చేరాయి. ⇔ రిలయన్స్ ఇండస్ట్రీస్ చెల్లింపులు 10% వృద్ధితో రూ.2,600 కోట్లకు చేరాయి. ⇔ టీసీఎస్ చెల్లింపులు స్వల్పంగా రూ.1,600 కోట్ల నుంచి రూ.1,540 కోట్లకు దిగాయి. ⇔ యస్ బ్యాంక్ చెల్లింపులు 44% వృద్ధితో రూ.424 కోట్ల నుంచి రూ.610 కోట్లకు ఎగశాయి. ⇔ టాటా స్టీల్ అడ్వాన్స్ ట్యాక్స్ 11% పడిపోయి రూ.450 కోట్ల నుంచి రూ.400 కోట్లకు దిగింది. ⇔ చమురు రంగానికి వస్తే, ఐఓసీ చెల్లింపులు 140 శాతం పెరిగి రూ.1,830 కోట్లుగా ఉన్నాయి. బీపీసీఎల్ చెల్లింపులు 11 శాతం పెరిగి రూ.480 కోట్లకు ఎగశాయి. హెచ్‌పీసీఎల్ విషయంలో వృద్ధి 164 శాతంగా ఉంది. ఈసంస్థ చెల్లింపులు రూ.603 కోట్లు. -
అడ్వాన్స్ పన్ను చెల్లింపుల్లో ఎస్ బీఐ వెనుకంజ
మొండి బకాయిల తీవ్రతకు ప్రతిబింబం ముంబై: ముందస్తు పన్ను చెల్లింపుల్లో బ్యాంకింగ్ వెనుకబడింది, మొండి బకాయిల సమస్య తీవ్రత దీనికి ప్రధాన కారణమని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచి అడ్వాన్స్ పన్నులు తగ్గినప్పటికీ, ఫార్మా, ఆయిల్ వంటి రంగాలు ఈ విషయంలో మంచి పనితీరును కనబరిచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి క్వార్టర్‌కు అడ్వాన్స్ పన్ను చెల్లింపులకు తుది గడువు 15వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం... కొన్ని ప్రధాన బ్యాంకులు, సంస్థల అడ్వాన్స్ పన్ను చెల్లింపులు ఇలా ఉన్నాయి. కొన్ని బ్యాంకులను చూస్తే... 2014-15 జనవరి-మార్చి క్వార్టర్‌తో పోల్చి 2015-16 మార్చి త్రైమాసికాన్ని పరిశీలిస్తే... ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం- ఎస్బీఐ అడ్వాన్స్ పన్ను చెల్లింపులు 60 శాతం తగ్గాయి. ఈ మొత్తం రూ.1,749 కోట్ల నుంచి రూ.690 కోట్లకు క్షీణించింది. మొత్తం ఏడాదికి చూస్తే... ఎస్బీఐ చెల్లింపుల్లో అసలు వృద్ధిలేకపోగా 7 శాతం క్షీణించి, రూ.5,800 కోట్ల నుంచి రూ.5,350 కోట్లకు క్షీణించాయి. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాన్స్ పన్ను చెల్లింపులు స్వల్పంగా రూ.1,295 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు చేరాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక చెల్లింపులు 21% వృద్ధితో రూ.4,500 కోట్ల నుంచి రూ.5,400 కోట్లకు ఎగశాయి. అయితే మొండిబకాయిల సమస్య అంతగాలేని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్రైమాసిక అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు 14 శాతం వృద్ధితో రూ.1,400 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు ఎగశాయి. ఈ బ్యాంక్ వార్షిక చెల్లింపులు 23 శాతం రూ.5,300 కోట్ల నుంచి రూ.6,500కు పెరిగాయి. కాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చెల్లింపులు రూ. 1,470 కోట్ల నుంచి రూ.1,647 కోట్లకు ఎగశాయి. వార్షికంగా చూస్తే... ఈ చెల్లింపులు 12 శాతం వృద్ధితో రూ.6,590 కోట్లకు ఎగశాయి. -
ఏటీ చెల్లింపులో పోటాపోటీ
- అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల్లో ఆర్థిక సంస్థల ముందంజ - ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ రెండంకెల వృద్ధి ముంబై: మార్చి త్రైమాసికం ముందస్తు పన్ను చెల్లింపుల్లో ఆర్థిక సంస్థలు ముందున్నాయి. ఎస్బీఐ, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ వంటి సంస్థలు ఈ విషయంలో రెండంకెల వృద్ధి రేటును నమోదుచేశాయి. వివరాల్లోకి వెళితే... ⇒ ఎస్బీఐ 23 శాతం అధికంగా రూ.1,794 కోట్ల ముందస్తు పన్ను చెల్లించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ చెల్లింపు రూ.1,456 కోట్లు. ⇒ డిసెంబర్ క్వార్టర్లో బ్యాంక్ చెల్లింపులు రూ.1,425 కోట్లు. రుణ వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ ముందుస్తు పన్ను చెల్లింపుల్లో బ్యాంక్ ముందుండడం గమనార్హం. ⇒ ఎల్ఐసీ ఈ విషయంలో 15% అధికంగా చెల్లించింది. ఈ విలువ రూ. 1,280 కోట్ల నుంచి రూ.1,470 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో చెల్లింపులు రూ.5,100 కోట్ల నుంచి రూ.5,880 కోట్లకు చేరాయి. ⇒ ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ 23 శాతం తక్కువగా రూ.230 కోట్లను మాత్రమే చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ చెల్లింపు రూ. 298 కోట్లు. ⇒ హెచ్డీఎఫ్సీ 10 శాతం అధికంగా తమ చెల్లింపులను రూ.500 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పెంచింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 12.8 శాతం వృద్ధితో రూ. 2,160 కోట్ల నుంచి రూ. 2,435 కోట్లకు పెరిగింది. ⇒ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన రుణదాత నాబార్డ్ చెల్లింపులు రూ.370 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఈ విలువ రూ. 1,490 కోట్ల నుంచి రూ.1,560 కోట్లకు ఎగసింది. ⇒ ప్రైవేటు రంగంలోని యస్ బ్యాంక్ చెల్లింపులు రూ. 200 కోట్ల నుంచి రూ. 260 కోట్లకు పెరిగాయి. ⇒ యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ రూ.25 కోట్లు చెల్లించింది. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే..: అధిక ఆదాయ కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు తమ ఆదాయంపై పన్నును ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగు దఫాలుగా ముందస్తుగా చెల్లించడమే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ వ్యవస్థ. ఒక నిర్ధిష్ట సమయంలో కంపెనీ పనితీరుకు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అద్దం పడుతుంది.