ఏటీ చెల్లింపులో పోటాపోటీ
- అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల్లో ఆర్థిక సంస్థల ముందంజ
- ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ రెండంకెల వృద్ధి
ముంబై: మార్చి త్రైమాసికం ముందస్తు పన్ను చెల్లింపుల్లో ఆర్థిక సంస్థలు ముందున్నాయి. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థలు ఈ విషయంలో రెండంకెల వృద్ధి రేటును నమోదుచేశాయి. వివరాల్లోకి వెళితే...
⇒ ఎస్‌బీఐ 23 శాతం అధికంగా రూ.1,794 కోట్ల ముందస్తు పన్ను చెల్లించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ చెల్లింపు రూ.1,456 కోట్లు.
⇒ డిసెంబర్ క్వార్టర్‌లో బ్యాంక్ చెల్లింపులు రూ.1,425 కోట్లు. రుణ వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ ముందుస్తు పన్ను చెల్లింపుల్లో బ్యాంక్ ముందుండడం గమనార్హం.
⇒ ఎల్‌ఐసీ ఈ విషయంలో 15% అధికంగా చెల్లించింది. ఈ విలువ రూ. 1,280 కోట్ల నుంచి రూ.1,470 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో చెల్లింపులు రూ.5,100 కోట్ల నుంచి రూ.5,880 కోట్లకు చేరాయి.
⇒ ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ 23 శాతం తక్కువగా రూ.230 కోట్లను మాత్రమే చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ చెల్లింపు రూ. 298 కోట్లు.
⇒ హెచ్‌డీఎఫ్‌సీ 10 శాతం అధికంగా తమ చెల్లింపులను రూ.500 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పెంచింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 12.8 శాతం వృద్ధితో రూ. 2,160 కోట్ల నుంచి రూ. 2,435 కోట్లకు పెరిగింది.
⇒ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన రుణదాత నాబార్డ్ చెల్లింపులు రూ.370 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఈ విలువ రూ. 1,490 కోట్ల నుంచి రూ.1,560 కోట్లకు ఎగసింది.
⇒ ప్రైవేటు రంగంలోని యస్ బ్యాంక్ చెల్లింపులు రూ. 200 కోట్ల నుంచి రూ. 260 కోట్లకు పెరిగాయి.
⇒ యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ రూ.25 కోట్లు చెల్లించింది.
అడ్వాన్స్ ట్యాక్స్ అంటే..: అధిక ఆదాయ కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు తమ ఆదాయంపై పన్నును ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగు దఫాలుగా ముందస్తుగా చెల్లించడమే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ వ్యవస్థ. ఒక నిర్ధిష్ట సమయంలో కంపెనీ పనితీరుకు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అద్దం పడుతుంది.