ముందస్తు పన్నుల్లో బ్యాం‘కింగ్’లు వెనుకంజ!
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ పేలవ పనితీరు
ముంబై: ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో మూడవ త్రైమాసికంలో అగ్ర బ్యాంకులు వెనకబడ్డాయి. దీంతో అతిపెద్ద రెవెన్యూ జోన్‌గా పేరొందిన ముంబైలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్ల వృద్ధి కేవలం 10%గా నమోదయింది. ఈ ప్రాంతంలోని 43 అతిపెద్ద కార్పొరేట్ల చెల్లింపులు వార్షికంగా చూస్తే, 10% వృద్ధితో రూ.24,811 కోట్ల నుంచి (గత ఏడాది ఇదే త్రైమాసికంలో) రూ.27,321 కోట్లకు పెరిగాయి.
వివిధ సంస్థలను చూస్తే...
⇔ ఎస్‌బీఐ చెల్లింపులు 25% పడిపోయి రూ.1,731 కోట్ల నుంచి రూ.1,282 కోట్లకు పడిపోయాయి.
⇔ ఐసీఐసీఐ బ్యాంక్ విషయంలో ఈ రేటు 27.3% క్షీణించి రూ.1,650 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు దిగింది.
⇔ ఎల్‌ఐసీ నుంచి వసూళ్లు 13% వృద్ధితో రూ.1,977 కోట్ల నుంచి రూ.2,235 కోట్లకు చేరాయి.
⇔ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెల్లింపులు 17% వృద్ధితో రూ.1,970 కోట్ల నుంచి రూ.2,300 కోట్లకు చేరాయి. అలాగే మార్టిగేజ్ లెండర్ హెచ్‌డీఎఫ్‌సీ చెల్లింపులు రూ.810 కోట్ల నుంచి రూ.920 కోట్లకు చేరాయి.
⇔ రిలయన్స్ ఇండస్ట్రీస్ చెల్లింపులు 10% వృద్ధితో రూ.2,600 కోట్లకు చేరాయి.
⇔ టీసీఎస్ చెల్లింపులు స్వల్పంగా రూ.1,600 కోట్ల నుంచి రూ.1,540 కోట్లకు దిగాయి.
⇔ యస్ బ్యాంక్ చెల్లింపులు 44% వృద్ధితో రూ.424 కోట్ల నుంచి రూ.610 కోట్లకు ఎగశాయి.
⇔ టాటా స్టీల్ అడ్వాన్స్ ట్యాక్స్ 11% పడిపోయి రూ.450 కోట్ల నుంచి రూ.400 కోట్లకు దిగింది.
⇔ చమురు రంగానికి వస్తే, ఐఓసీ చెల్లింపులు 140 శాతం పెరిగి రూ.1,830 కోట్లుగా ఉన్నాయి. బీపీసీఎల్ చెల్లింపులు 11 శాతం పెరిగి రూ.480 కోట్లకు ఎగశాయి. హెచ్‌పీసీఎల్ విషయంలో వృద్ధి 164 శాతంగా ఉంది. ఈసంస్థ చెల్లింపులు రూ.603 కోట్లు.