సీడీఆర్ ప్రక్రియ సమీక్షపై కేంద్రం దృష్టి!
ఎన్‌పీఏల పరిష్కారానికి కసరత్తు
న్యూఢిల్లీ: మొండి బాకాయిల (ఎన్‌పీఏ)ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన కేంద్రం– ఈ దిశలో కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్రక్రియను సమీక్షించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2001లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సీడీఆర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మూడంచలుగా పనిచేసే ఈ వ్యవస్థను మరింత పటిష్టంగా మలచడంపై కేంద్రం దృష్టి సారించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి ఒత్తిడిలో ఉన్న కార్పొరేట్ రుణ సమస్యల పరిష్కారం లక్ష్యంగా సీడీఆర్ వ్యవస్థ సమీక్షకు కేంద్రం శ్రీకారం చుడుతున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి.
బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడం పెద్ద సవాలుగా మారిందని, ’అత్యంత భారీ కార్పొరేట్లే’ ఈ సమస్యకు మూలకారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2016 డిసెంబర్ 31వతేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రూ.6,06,911 కోట్లుకు చేరాయి. ఒత్తిడిలో ఉన్న రుణ పరిమాణం (పునర్‌వ్యవస్థీకరించిన రుణాలు, స్థూల ఎన్‌పీఏలు) మొత్తం రూ. 9.64 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నాటికి ఈ మొత్తం రూ.8,97,000 కోట్లు. అంటే నాలుగు నెలలు గడిచే సరికే ఈ పరిమాణం దాదాపు 7.5 శాతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.