న్యూఢిల్లీ: వసూలు కాని రుణాన్ని నిరర్థక ఆస్తిగా (ఎన్‌పీఏలు) గుర్తించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని సూచించారు. వృద్ధి, లాభదాయకత విషయంలో ఇక ముందూ మంచి పనితీరు చూపించాలని కోరారు.
ఆర్థిక మంత్రి అన్ని పీఎస్‌బీల సీఈవోలతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, అత్యవసర రుణ వితరణ పథకం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో నిర్ధేశించిన లక్ష్యాలను ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఏ మేరకు చేరాయన్నది మంత్రి పరిశీలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
రుణ వితరణలో వృద్ధి, ఆస్తుల నాణ్యత, తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యంక్‌ల నిధుల అవసరాలను సమీక్షించినట్టు తెలిపాయి. రుణాల పంపిణీ, లాభదాయకత, ఆస్తుల నాణ్యత, క్యాపిటల అడెక్వెసీ తదితర గణాంకాలన్నీ పీఎస్‌బీల పనితీరు ఎంతో మెరుగుపడినట్టు తెలియజేస్తుండడాన్ని మంత్రి పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నాయి.
త్వరలో గ్రామీణ బ్యాంక్‌ల వంతు..
ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ల పనితీరును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి త్వరలోనే సమీక్షించనున్నారు. ఇందుకోసం గ్రామీణ బ్యాంక్‌ల అధినేతలతో ఆమె భేటీ కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుండడం తెలిసిందే.
సాగు రంగం, దాని అనుబంధ విభాగాలకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)ల జారీని ఆర్థిక మంత్రి సమీక్షించనున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. వీలైనంత ఎక్కువ సంఖ్యలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు అందేలా చూడాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా ఉంది. బలహీనంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లకు నిధుల అవసరాలను కూడా మంత్రి పరిశీలించనున్నారు. టెక్నాలజీ పెంపు, ఎప్‌పీఏల తగ్గింపు విధానాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే
అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment