non performing assets
-
తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే..
దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో తగ్గునున్నాయని కేర్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. జీఎన్‌పీఏలు 2.1-2.4 శాతానికి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎన్‌పీఏలు 2.5-2.7 శాతంగా ఉన్నాయని సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో చెప్పింది. పారుబాకీలను ఎన్పీఏలుగా పేర్కొనడంతో పాటు, వాటికి తగిన కేటాయింపులు చేసి, వాస్తవ విలువలను చూపించాల్సిందిగా ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని కేర్ రేటింగ్స్ తెలిపింది. అధిక వడ్డీ రేట్లు, నియంత్రణల ప్రభావం, ద్రవ్య లభ్యత, వాతావరణం, అంతర్జాతీయ సమస్యలు బ్యాంకుల జీఎన్పీఏలపై ప్రభావం చూపొచ్చనీ విశ్లేషించింది. 2013-14లో బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.8% కాగా, 2015-16లో ఏక్యూఆర్ (ఆర్బీఐ ఆస్తుల నాణ్యతా పరిశీలన) కారణంగా 2017-18 నాటికి 11.2 శాతానికి చేరాయి. ఎన్పీఏలను గుర్తించడం, వాటిని పునర్వ్యవస్థీకరణ చేయడం లాంటివి చేపట్టడంతో చాలా బ్యాంకులు ఒత్తిడికి గురయ్యాయని పేర్కొంది. తదుపరి తీసుకున్న కఠిన చర్యల కారణంగా 2018-19 నుంచి జీఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టాయి. 2022-23 నాటికి దశాబ్ద కనిష్ఠ స్థాయి 3.9 శాతానికి దిగి వచ్చాయి. ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికం చివరికి ఇవి 3 శాతం వద్ద ఉన్నాయని నివేదిక వెల్లడించింది. రంగాల వారీగా చూస్తే.. 2023 సెప్టెంబరు చివరకు వ్యవసాయ రంగంలో 7% జీఎన్‌పీఏలు ఉన్నాయి. పారిశ్రామిక రుణాల్లో 4.2%, రిటైల్ రుణాల్లో 1.3% జీఎన్‌పీఏలు ఉన్నాయని తెలిపింది. -
మోసాలు, ఎగవేతలపై వేగంగా స్పందించాలి
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలు) తగ్గించుకునేందుకు మోసాలు, ఉద్దేశ పూర్వక రుణ ఎగవేత కేసుల్లో వేగవంతంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. వృద్ధి మార్గాన్ని ఇదే మాదిరిగా ఇకముందూ కొనసాగించాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీఎస్‌బీలు 2021–22 వరకు క్రితం ఆరేళ్లలో రూ.11.17 లక్షల కోట్ల ఎన్పీఏలను మాఫీ చేశాయి. నాలుగేళ్ల కాలం పాటు ఎన్పీఏలుగా కొనసాగి, వాటికి నూరు శాతం కేటాయింపులు చేసిన వాటిని బ్యాంక్‌లు మాఫీ చేసి, బ్యాలన్స్ షీట్ల నుంచి తొలగిస్తుంటాయి. అయినా కానీ, ఆ తర్వాత కూడా వాటి వసూలుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటాయి. ఇటీవలే పీఎస్‌బీల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత రిస్‌్కలను అధిగమించేందుకు, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని కూడా ఆర్థిక మంత్రి కోరారు. బలమైన అంతర్గత ఆడిట్ కార్యాచరణను అనుసరించాలని సూచించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు రుణాలు, తక్కువ వ్యయ డిపాజిట్ల విషయంలో క్రమంగా తమ మార్కెట్ వాటాను కోల్పోతుండడం తదితర సవాళ్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నికర వడ్డీ మార్జిన్లపైనా ఆందోళన వ్యక్తమైనట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అధిక ఈల్డ్ వచ్చే రుణ విభాగాలపై దృష్టి సారించాలని, ఫీజులు పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలన్న సూచన వచి్చనట్టు తెలిపాయి. -
పారదర్శకంగా ఎన్పీఏల గుర్తింపు
న్యూఢిల్లీ: వసూలు కాని రుణాన్ని నిరర్థక ఆస్తిగా (ఎన్పీఏలు) గుర్తించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని సూచించారు. వృద్ధి, లాభదాయకత విషయంలో ఇక ముందూ మంచి పనితీరు చూపించాలని కోరారు. ఆర్థిక మంత్రి అన్ని పీఎస్‌బీల సీఈవోలతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, అత్యవసర రుణ వితరణ పథకం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో నిర్ధేశించిన లక్ష్యాలను ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఏ మేరకు చేరాయన్నది మంత్రి పరిశీలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రుణ వితరణలో వృద్ధి, ఆస్తుల నాణ్యత, తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యంక్‌ల నిధుల అవసరాలను సమీక్షించినట్టు తెలిపాయి. రుణాల పంపిణీ, లాభదాయకత, ఆస్తుల నాణ్యత, క్యాపిటల అడెక్వెసీ తదితర గణాంకాలన్నీ పీఎస్‌బీల పనితీరు ఎంతో మెరుగుపడినట్టు తెలియజేస్తుండడాన్ని మంత్రి పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నాయి. త్వరలో గ్రామీణ బ్యాంక్‌ల వంతు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ల పనితీరును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి త్వరలోనే సమీక్షించనున్నారు. ఇందుకోసం గ్రామీణ బ్యాంక్‌ల అధినేతలతో ఆమె భేటీ కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుండడం తెలిసిందే. సాగు రంగం, దాని అనుబంధ విభాగాలకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)ల జారీని ఆర్థిక మంత్రి సమీక్షించనున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. వీలైనంత ఎక్కువ సంఖ్యలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు అందేలా చూడాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా ఉంది. బలహీనంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లకు నిధుల అవసరాలను కూడా మంత్రి పరిశీలించనున్నారు. టెక్నాలజీ పెంపు, ఎప్పీఏల తగ్గింపు విధానాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం!
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న సంస్థల తీవ్ర మొండిబకాయిలు (ఎన్పీఏ) భారీ రాయితీలతో పరిష్కారం ఒకవైపు, యస్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు ‘బెయిల్ అవుట్లు’ మరోవైపు... ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ తీవ్ర సవాళ్లలో కూరుకుపోతోందని యూఎఫ్‌బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) విమర్శించింది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్బీ) ప్రైవేటీకరణ, విలీనాల వంటి ప్రతికూల నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. ఆయా విధానాలకు నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మ తప్పదని పేర్కొంది. ఈ మేరకు యూఎఫ్‌బీయూ కన్వీనర్ బీ రాంబాబు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని యూఎఫ్‌బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ► 13 కార్పొరేట్ల రుణ బకాయిలు రూ.4,86,800 కోట్లు. అయితే భారీ రాయితీలతో రూ.1,61,820 కోట్లకే రుణ పరిష్కారం జరిగింది. వెరసి బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ► సంక్షోభంలో ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకులను నిధుల పరంగా గట్టెక్కించడానికి (బెయిల్ అవుట్) గతంలోనూ, వర్తమానంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులనే వినియోగించుకోవడం జరిగింది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాద్‌లు ఇందుకు గత ఉదాహరణలుకాగా, ఇప్పుడు యస్‌బ్యాంక్‌ను రక్షించడానికి ప్రభుత్వ రంగ ఎస్బీఐని వినియోగించుకోవడం జరిగింది. ప్రైవేటు రంగ దిగ్గజ ఎన్బీఎఫ్సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బెయిల్ అవుట్‌కు ఎస్బీఐ, ఎల్ఐసీలను వినియోగించుకోవడం జరిగింది. ► ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న యోచన సరికాదు. జన్ ధన్, నిరుద్యోగ యువత కోసం ముద్ర, వీధి వ్యాపారుల కోసం స్వధన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విజయవంతానికి మెజారిటీ భాగస్వామ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం గమనార్హం. ► ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ► బ్యాంకులను ప్రైవేటీకరించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే పక్షంలో, బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెతో ఎటువంటి చర్యలకైనా దిగేందుకు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సిద్ధమవుతారు. ప్రైవేటీకరణ విధానం ప్రజల ప్రయోజనాలకు మంచిదికాదు. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ లాభాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు తీవ్రమైన భారీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌పీఏల్లో ప్రధాన వాటా పెద్ద కార్పొరేట్‌దే కావడం గమనార్హం. -
బ్యాంకులకు భారీ షాక్ ? గాలిలో దీపంగా మారిన రూ. 28 వేల కోట్లు
SREI Infrastructure Finance Limited: చైనా ఎవర్‌గ్రాండ్ ఉదంతం పతాక శీర్షికల్లో ఉండగానే ఆ తరహా ఉపద్రవమే మన దగ్గర ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రియాల్టీ, ఫైనాన్స్ రంగాల్లో దేశవ్యాప్తంగా పేరున్న ఓ సంస్త ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని సమాచారం. భారీగా రుణాలు కోల్‌కతాకు చెందిన శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ దేశ వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అంతేకాదు ఫైనాన్స్‌లో కూడా కాలు మోపింది. ఈ సంస్థ పనితీరుని నమ్మి యూకోబ్యాంకు, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో పాటు ప్రైవేటు , ప్రభుత్వ బ్యాంకులు భారీగా రుణాలు అందించాయి. పేలవ పనితీరు గడిచిన కొన్నేళ్లుగా శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్(SREI) నిర్వాహాణా లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు కోవిడ్ పంజా కూడా ఈ కంపెనీపై పడింది. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా కటకటలాడే స్థికి చేరుకుంది. దీంతో ఈ నెల ఆరంభంలో ఆ కంపెనీ సీఈవో సైతం రాజీనామా చేశాడు. నిరర్థకమేనా ? ఇప్పటికే శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ సంస్థకు అప్పులు చెల్లించిన బ్యాంకులు ఈ సంస్థని నిరర్థక సంస్థగా గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాయంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగి తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తంగా శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ కంపెనీ పేరు మీద రూ. 30,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఇందులో రూ. 28,000 కోట్ల అప్పులు అంటే దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల వరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించినవే ఉన్నాయి. ఆస్తుల వేలం మొత్తం అప్పుల్లో బ్యాంకుల నుంచి నేరుగా తీసుకున్న అప్పులు రూ. 18,000 కోట్లు ఉండగా మిగిలిన రూ. 10,000 కోట్లను ష్యూరిటీలు, బాండ్ల తదితర రూపాల్లో శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ సంస్థ సేకరించింది. ప్రస్తుతం అప్పుల్లో ఉన్న మాట వాస్తవమే అయినా కొంత సమయం ఇస్తే అప్పులు చెల్లించేందుకు సంస్థ సిద్ధంగా ఉందంటూ ఆ కంపెనీ ప్రతినిధులు హామీ ఇస్తున్నారు. తదుపరి చర్యలు ఇప్పటికే శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ సంస్థ పనితీరుపై బ్యాంకులు అసంతృప్తిగా ఉన్నాయి. నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్ ట్యాగ్‌ను ఇప్పటికే తగిలించాయి. ఈ సంస్థపై తదుపరి చర్యలకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మోహుల్ ఛోక్సీ ఉదంతాలతో దెబ్బ తిన్న బ్యాంకింగ్ సెక్టార్‌పై కోవిడ్ మహమ్మారి మరో పోటు వేసింది. ఇంకా పూర్తిగా ఆ వ్యవస్థ గాడిన పడకముందే శ్రేయ్ రూపంలో మరో ముప్పు ఎదురైంది. చదవండి: ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి -
ఆ ఖాతాలకు సుప్రీం రక్షణ
న్యూఢిల్లీ: ఆగస్ట్ 31 వరకు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ)గా గుర్తించని ఖాతాలకు సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ ఖాతాలను తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ‘ఎన్పీఏ’లుగా ప్రకటించవద్దని బ్యాంకులను ఆదేశించింది. కోవిడ్–19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఉద్దేశించిన మారటోరియం సమయంలోనూ.. రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పై ఆదేశాలిచ్చింది. కనీసం 2 నెలల పాటు ఏ ఖాతాను కూడా ఎన్పీఏగా నిర్ధారించబోమని బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. ఆర్థిక రంగానికి బ్యాంకింగ్ వ్యవస్థ వెన్నెముక వంటిదని, కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలై ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. ఆర్థిక రంగ పునరుత్తేజాన్ని రుణాల వడ్డీ మాఫీ నిర్ణయం దెబ్బతీస్తుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన విషయమన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తమ ఆందోళన అంతా వడ్డీపై వడ్డీకి సంబంధించి అని స్పష్టం చేసింది. వాదనల అనంతరం తదుపరి విచారణను 10కి వాయిదా వేసింది. మారటోరియం సందర్భంగా ఇన్స్టాల్మెంట్ చెల్లింపులను వాయిదా వేసుకున్న ఖాతాలపై వడ్డీ మాఫీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకమని గతంలో కేంద్రం తెలిపింది. -
బ్యాంకింగ్ ‘బాండ్’!
న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణం రూపంలో మోసం చేసినట్టు వెలుగు చూడడం, కంపెనీల ఆర్థిక అంశాలపై కచ్చితమైన సమాచారం విషయంలో రేటింగ్ ఏజెన్సీలు విఫలమవుతున్న నేపథ్యంలో... ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో కంపెనీల ఖాతాలపై సర్వే కోసం ఏజెన్సీలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని రెండు అగ్ర స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే కన్సార్షియం కింద రుణాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులు... ప్రధానంగా రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్‌లు, కంపెనీలు ఇచ్చే సమాచారానికే పరిమితం అవుతున్నాయి. వీటి ఆధారంగానే ఆయా కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్థాయిలో చర్చ జరిగిందని, అకౌంటింగ్ సంస్థలను నియమించుకోవడం ఈ ప్రతిపాదనలో భాగమని బ్యాంకరు తెలిపారు. ఇప్పటికే ఐబీఏ 75 సంస్థలను కూడా గుర్తించి బ్యాంకుల స్థాయిలో పంపిణీ చేయడం జరిగినట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో... ‘‘ఇది నూతన యంత్రాంగం. ఇప్పటికే అకౌంటింగ్ సంస్థలను గుర్తించాం. తీసుకున్న రుణాలను కంపెనీలు వినియోగించే తీరుపై ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షణ నిర్వహిస్తాయి. అలాగే, క్రమం తప్పకుండా బ్యాంకులకు నివేదికల రూపంలో తెలియజేస్తాయి’’ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో అశోక్ కుమార్ ప్రధాన్ తెలిపారు. ఇప్పటికైతే తాము అందుకున్న స్టేట్మెంట్స్పై ఎక్కువగా వివరాలు వెల్లడించలేమంటూ... సంబంధిత ఆడిటింగ్ సంస్థలు కంపెనీల పుస్తకాలను పరీక్షిస్తాయని, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో ఉంటుందన్నారు. కంపెనీల పుస్తకాల్లోని లోపాలను గుర్తించే విషయంలో రేటింగ్ ఏజెన్సీలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పరిణామంతో వెలుగు చూసింది. రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థ వరుసగా విఫలం కావడం, రేటింగ్ ఏజెన్సీలు ముందుగా ఈ విషయాలను గుర్తించలేకపోయిన విషయం తెలిసిందే. ఖాతాల్లోని ఆర్థిక ఇబ్బందులు రేటింగ్‌ల్లో ప్రతిఫలించకుండా ఉండేందుకు ఐఎల్ఎఫ్ఎస్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు, రేటింగ్ ఏజెన్సీల ఉద్యోగులను ప్రలోభపెట్టినట్టు గ్రాంట్ థార్న్టన్ ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా వెలుగు చూసింది. ‘‘పర్యవేక్షణ బాధ్యత అన్నది రేటింగ్ ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రేటింగ్‌లు బ్యాంకులతోపాటు వాటాదారులకూ ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఇప్పుడున్న విధానంలో ఇది ఫలితాలను ఇవ్వడం లేదు. ఎక్స్టర్నల్ ఏజెన్సీలను నియమించుకోవాలని ఐబీఏ యోచిస్తుండడం వెనుక కారణం ఇదే. భూషణ్ పవర్ మోసం వెలుగు చూడడంతో ఈ విధానాన్ని వెంటనే అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిండికేట్ బ్యాంకు ఎండీ, సీఈవో మృత్యుంజయ మహపాత్ర పేర్కొన్నారు. -
30వేల కోట్ల రుణాలను రద్దు చేసిన బ్యాంకు
సాక్షి,ముంబై : మొండిబకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంక్ గత మూడున్నర సంవత్సరాల్లో రూ 30,000 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు వెల్లడించింది. నిరర్ధక ఆస్తులు పెరగడంతో రుణాల జారీపై ఐడీబీఐ బ్యాంకును ఆర్బీఐ నియంత్రించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ప్రధమార్ధంలో రూ 9052 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బ్యాంకు నివేదించింది. రద్దు చేసిన రుణాల్లో అత్యధికం మౌలిక, మెటల్స్ రంగాలకు చెందినవేనని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. నిరర్ధక ఆస్తులపై ఆర్బీఐ ప్రవేశపెట్టిన అసెట్ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్) అనంతరం ఆయా రుణాలను రద్దు చేసినట్టు పార్లమెంటరీ కమిటీకి ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. 2015-16లో బ్యాంకు నిరర్ధక ఆస్తులు 7.79 శాతం నుంచి ఈ ఏడాది మార్చి నాటికి 11,8 శాతానికి పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసంలో బ్యాంకు జారీ చేసిన మొత్తం రుణాల్లో 31 శాతం మేర రూ 60,875 కోట్లకు నిరర్ధక రుణ బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించింది. -
చావుబాకీలు రూ. 8 లక్షల కోట్లపైనే!
దేశంలోని అన్ని రకాల బ్యాంకులకు ఉన్న చావుబాకీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల పైమాటేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తగినన్ని నిధులు సమకూరుస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మనకున్న మొత్తం వ్యవస్థలో 11.25 శాతం ఈ చావుబాకీలేనని, అయితే ఈ సమస్యను తగిన విధంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో రూ. 25వేల కోట్లను కేటాయించారు. ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో రూ. 25వేల కోట్ల చొప్పున, ఆ తర్వాత 2017-18, 2018-19 సంవత్సరాల్లో రూ. 20 వేల కోట్ల చొప్పున కేటాయిస్తామని జయంత్ సిన్హా చెప్పారు.