దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో తగ్గునున్నాయని కేర్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. జీఎన్‌పీఏలు 2.1-2.4 శాతానికి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎన్‌పీఏలు 2.5-2.7 శాతంగా ఉన్నాయని సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో చెప్పింది. పారుబాకీలను ఎన్‌పీఏలుగా పేర్కొనడంతో పాటు, వాటికి తగిన కేటాయింపులు చేసి, వాస్తవ విలువలను చూపించాల్సిందిగా ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని కేర్ రేటింగ్స్ తెలిపింది. అధిక వడ్డీ రేట్లు, నియంత్రణల ప్రభావం, ద్రవ్య లభ్యత, వాతావరణం, అంతర్జాతీయ సమస్యలు బ్యాంకుల జీఎన్‌పీఏలపై ప్రభావం చూపొచ్చనీ విశ్లేషించింది.
2013-14లో బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.8% కాగా, 2015-16లో ఏక్యూఆర్ (ఆర్‌బీఐ ఆస్తుల నాణ్యతా పరిశీలన) కారణంగా 2017-18 నాటికి 11.2 శాతానికి చేరాయి. ఎన్‌పీఏలను గుర్తించడం, వాటిని పునర్‌వ్యవస్థీకరణ చేయడం లాంటివి చేపట్టడంతో చాలా బ్యాంకులు ఒత్తిడికి గురయ్యాయని పేర్కొంది. తదుపరి తీసుకున్న కఠిన చర్యల కారణంగా 2018-19 నుంచి జీఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టాయి. 2022-23 నాటికి దశాబ్ద కనిష్ఠ స్థాయి 3.9 శాతానికి దిగి వచ్చాయి.
ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికం చివరికి ఇవి 3 శాతం వద్ద ఉన్నాయని నివేదిక వెల్లడించింది. రంగాల వారీగా చూస్తే.. 2023 సెప్టెంబరు చివరకు వ్యవసాయ రంగంలో 7% జీఎన్‌పీఏలు ఉన్నాయి. పారిశ్రామిక రుణాల్లో 4.2%, రిటైల్ రుణాల్లో 1.3% జీఎన్‌పీఏలు ఉన్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment