భారీ రుణాలకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
♦ అధికంగా రుణాలు జారీ చేస్తే ప్రత్యేక కేటాయింపులు
♦ ఒక కార్పొరేట్ గ్రూపునకు మూలధనంలో 25 శాతమే రుణం
ముంబై: బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల సమస్య (ఎన్‌పీఏ) పెరిగిపోవడంతో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ రుణాల విషయంలో బ్యాంకులకు కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఇవి 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం ‘స్పెసిఫైడ్ బారోవర్’కు సాధారణ రుణ జారీ పరిమితి (ఎన్‌పీఎల్‌ఎల్)కి మించి రుణాలు జారీ చేయాలంటే అధిక రిస్క్‌ను భరిస్తూ బ్యాంకులు అందుకు తగినట్టు అదనంగా నిధులు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.
ఎన్‌పీఎల్‌ఎల్‌కు మించి జారీ చేసే రుణాలకు అదనంగా 3 బేసిస్ పాయింట్ల మేర నిధులను ప్రత్యేకించాల్సి ఉంటుంది. ఒక సంస్థకు బ్యాంకుల కూటమి కలసి రుణం జారీ చేసినసందర్భంలో ఒక్కో బ్యాంకు విడిగా ఎంత మేర రుణం ఇస్తే ఆ మేర ఈ రేషియోను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన ఏడాది తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఓ కార్పొరేట్ సంస్థకు 25 శాతమే: కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ఏ కార్పొరేట్ గ్రూపునకు కూడా తన మూలధనంలో 25%కి మించి రుణం ఇవ్వరాదు. ఎన్‌పీఏ రిస్క్‌ను దృష్టిలో ఉంచుకున్న ఆర్‌బీఐ ప్రస్తుతమున్న 55 శాతం పరిమితిని 25%కి తగ్గించింది. ఈ పరిమితి అన్నది ప్రస్తుత మూలధన నిధుల ప్రకారం కాకుండా టైర్ 1 మూల ధనంపై వర్తిస్తుందని ఆర్‌బీఐ తన ముసాయిదాలో పేర్కొం ది. దీనిపై ప్రజాభిప్రాయాలకు ఆర్‌బీఐ ఆహ్వానం పలికింది. ఈ నిబంధనలు 2019 మార్చి 31 నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది. ఆర్‌బీఐ ప్రతిపాదనలు బాసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్‌విజన్ (బీసీబీఎస్) సూచనలకు అనుగుణంగానే ఉన్నాయి. బీసీబీఎస్ సైతం బ్యాంకులను వాటి మూల ధనం ఆధారంగా రుణాల జారీని పరిమితం చేయాలని సూచించింది.
ఎస్‌హెచ్‌జీలకు 7% వడ్డీకే రుణాలు: వార్షికంగా ఏడు శాతం వడ్డీకే స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రుణాలు మంజూరు చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరింది. 250 జిల్లాల్లో అన్ని రకాల మహిళా ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకులు రుణాలు అందించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద అన్ని ఎస్‌హెచ్‌జీలు వడ్డీ రాయితీపై ఏడు శాతానికే రుణాలు పొందడానికి అర్హులుగా పేర్కొంది.
మసాలా బాండ్లకు అనుమతి: బ్యాంకులు ద్రవ్య సర్దుబాటు కింద మసాలా బాండ్ల జారీకి, కార్పొరేట్ బాండ్ల స్వీకరణకు ఆర్‌బీఐ అనుమతించింది. ద్రవ్య సరఫరాను మెరుగుపరిచేందుకు, మార్కెట్ అభివృద్ధికి ఈ చర్యలు తోడ్పడతాయని ఆర్‌బీఐ పేర్కొంది.