మొండిబకాయిలు ఆందోళనే... అయితే సమసిపోతుంది: రాజన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య ఆందోళనకరంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంతో ఈ పరిస్థితి మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2013 మార్చిలో రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు అదే ఏడాది సెప్టెంబర్ నాటికి 28 శాతానికి పెరిగి రూ.2.36 లక్షల కోట్లు చేరి విధాన నిర్ణేతలను ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే.
పెట్టుబడులు అవసరం: కొచర్
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ కూడా ఎన్‌పీఏల సమస్యను ప్రస్తావించారు. ఇందుకు విదేశీ అంశాలు ఒక కారణంగా పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 5% దిగువకు పడిపోదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పెట్టుబడులు భారీగా రావాల్సిన అవసరం ఉందన్నారు. సత్వర విధాన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అవసరమన్నారు.
రెపోలో మార్పు ఉండదు: హెచ్‌ఎస్‌బీసీ, ఆర్‌బీఎస్
ఇదిలావుండగా, మంగళవారంనాటి పరపతి సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ పాలసీరేటు-రెపోలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థలు హెచ్‌ఎస్‌బీసీ, ఆర్‌బీఎస్ అంచనావేశాయి. బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 8 శాతంగా ఉంది.
బాసెల్‌పై నిర్ణయం ఊరట: ఇండియా రేటింగ్స్
మరోవైపు బ్యాంకింగ్ మూలధనం పెంపునకు ఉద్దేశించిన బాసెల్ 3 ప్రమాణాల అమలు వాయిదా ఈ రంగానికి పెద్ద ఊరటని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.