ఎన్‌పీఏలపై ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు
ముంబై: మొండిబకాయిల సమస్య పరిష్కారం దిశగా రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. నిర్దిష్ట పరిస్థితులను బట్టి సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) విధానం అమలుకు సంబంధించిన నిబంధనలు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి బ్యాంకుల ఆర్థిక గణాంకాలను బట్టి నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని పేర్కొంది.
వీటి ప్రకారం ఆడిటెడ్ వార్షిక ఆర్థిక ఫలితాలు, ఆర్‌బీఐ పర్యవేక్షణలో మదింపు నివేదికను బట్టి ఆయా బ్యాంకులను పీసీఏ విధానం పరిధిలోకి తెస్తారు. అయితే, పరిస్థితులను బట్టి ఏడాదిలో ఎప్పుడైనా కూడా ఆర్‌బీఐ.. పీసీఏని ప్రయోగించవచ్చు. ఒకవేళ బ్యాంకు రిస్కు పరిస్థితి మూడో స్థాయిని కూడా దాటేసిన పక్షంలో దాన్ని వేరే బ్యాంకులో విలీనం చేయొచ్చు లేదా ఇతర బ్యాంక్ టేకోవర్ చేయొచ్చు.
కాగా గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్లలో (ఐఎఫ్‌ఎస్‌సీ) కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టాక్ ఎక్సే్చంజ్‌లు ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ నిర్వహించుకోవచ్చని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. అయితే తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుందని పేర్కొంది. తమ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, అర్హత కలిగిన సంస్థలకు డెరివేటివ్ ట్రేడింగ్ చేయడానికి అర్హత ఉంటుందని వివరించింది. సెబి నియమించిన రిస్క్ మేనేజ్‌మెంట్ రివ్యూ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తన తాజా సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది.