రాని బాకీల అరాచకం..!
♦ డిసెంబర్ నాటికి రూ.4.38 లక్షల కోట్లకు చేరిన బ్యాంకుల ఎన్‌పీఏలు
♦ ఆర్‌బీఐ నిబంధనల దెబ్బతో బయటపడుతున్న అప్పుల కుప్పలు
♦ గతేడాది 3వ క్వార్టర్లో 39 బ్యాంకుల మొత్తం లాభం రూ.16,807 కోట్లు
♦ ఈ ఏడాది 3వ క్వార్టర్లో వీటి మొత్తం లాభం కేవలం రూ.307 కోట్లు
♦ 24 ప్రభుత్వ బ్యాంకులైతే 6,971 కోట్ల లాభం నుంచి 10,911 కోట్ల నష్టాల్లోకి
కొన్ని కంపెనీలకు పరిస్థితులు ప్రతికూలించాయి. కొన్నయితే ప్రమోటర్ల విలాసాలు, అత్యాశతో దెబ్బతిన్నాయి. ఇంకొన్ని అప్పుల కోసమే వ్యాపారం చేశాయి. కారణాలు ఏవయితేనేం!! ఈ కంపెనీలన్నీ బ్యాంకుల దగ్గర వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాయి. తిరిగి చెల్లించడం మానేశాయి. ఇవి దివాలా తీస్తాయా? లేదా? అన్నది పక్క నబెడితే... ఇపుడు వీటికి అప్పులిచ్చిన బ్యాంకులే దివాలా తీసే పరిస్థితులు దాపురించాయి. ఒకరకంగా ఇది దేశీయ బ్యాంకుల చరిత్రలోనే అత్యంత గడ్డుకాలం. బ్యాంకింగ్ వ్యవస్థకే పెను సవాలు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో; బ్యాంకులు ప్రకటిస్తున్న నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు), నష్టాలను చూసినవారికి కళ్లు తిరుగుతున్నాయి. ఫలితాల దెబ్బకి బ్యాంకుల షేర్లు పాతాళానికి పడిపోతున్నా కొనేవారే లేరు. ఒకవంక ఇన్వెస్టర్లు లబోదిబోమంటుంటే.. అసలు ఈ బ్యాంకులు మనుగడ సాగించగలవా? మన డిపాజిట్లు సేఫ్‌గా ఉంటాయా? అని డిపాజిట్‌దారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి రూ.3.4 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల స్థూల ఎన్‌పీఏల విలువ ఇపుడు రూ.4.38 లక్షల కోట్లకు చేరాయి. ఈ దెబ్బతో చాలా బ్యాంకులు నష్టాల బాట పట్టాయి.
ఎందుకిన్ని నష్టాలు?
2017 మార్చికల్లా బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయాలని, ఈ లోపే ఎన్‌పీఏలను పరిష్కరించుకోవాలని, ప్రొవిజనింగ్ కూడా చేయాలని ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలతో బ్యాంకులు ఆ మేరకు చర్యలు మొదలుపెట్టాయి. ఫలితం... గతేడాది మూడో త్రైమాసికంలో 39 లిస్టెడ్ బ్యాంకులు కలిపి రూ. 16,807 కోట్ల లాభాలు ఆర్జిస్తే ఈ ఏడాది అది రూ.307 కోట్లకు పడిపోయింది. అదే ప్రభుత్వరంగ బ్యాంకులను తీసుకుంటే రూ.6,971 కోట్ల లాభాలకు బదులు రూ.10,911 కోట్ల నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడానే తీసుకుంటే గతేడాది రూ.334 కోట్ల లాభం ప్రకటించగా ఈ ఏడాది ఏకంగా రూ.3,342 కోట్ల నష్టాన్ని బయటపెట్టింది. అంతేకాదు ఇదే కాలంలో ఎన్‌పీఏలు 3.85 శాతం నుంచి 9.68 శాతానికి ఎగబాకాయి.
దీంతో బ్యాంకింగ్ రంగంలో ఏం జరుగుతోందన్న భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ దెబ్బ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌బీహెచ్, ఆంధ్రా బ్యాంకులకు గట్టిగానే తగిలింది. ఆర్‌బీఐ ప్రకటించిన 150 కంపెనీల్లో 15 కంపెనీలకు తాము రూ.853 కోట్ల రుణాలిచ్చామని, వీటికి ఈ త్రైమాసికంలోనే పూర్తిగా ప్రొవిజనింగ్ చేసినట్లు ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శాంతను ముఖర్జీ చెప్పారు. ఆంధ్రాబ్యాంక్ నికర లాభం 83 శాతం క్షీణించి రూ. 202 కోట్ల నుంచి రూ.34 కోట్లకు పడిపోయింది. ఎన్‌పీఏలుగా చూపించాల్సిన ఖాతాలు ఇంకా ఉండటంతో వచ్చే త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్ నష్టాలను ప్రకటించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ రుణాలు భారీగా ఇచ్చిన ఐసీఐసీఐ, ధనలక్ష్మి బ్యాంక్ వంటి ప్రైవేటురంగ బ్యాంకులు కూడా ఎన్‌పీఏలతో విలవిలలాడుతున్నాయి.
ఆ కంపెనీల పేర్లు బయట పెట్టొద్దు...
బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకుని, భవిష్యత్తులోనూ తీర్చలేని పరిస్థితుల్లో పడ్డ 150 కంపెనీలను ఆర్‌బీఐ గుర్తించింది. వీటికి అప్పులిచ్చిన బ్యాంకులు ఆ ఖాతాల్ని ఎన్‌పీఏలుగా ప్రకటించాలంటూ ఆదేశించింది. ఈ ఎన్‌పీఏలకు మార్చిలోగా ప్రొవిజనింగ్‌లు చేయాలని కూడా చెప్పింది. ఈ 150 కంపెనీల పేర్లు మాత్రం ఆర్‌బీఐ బయటకు చెప్పడం లేదు. పేర్లు బయటకొస్తే ఈ కంపెనీల షేర్లు మరింత పతనమై కోలుకునే పరిస్థితులుండవన్నది ఆర్‌బీఐ వాదన. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చిన్న అప్పులకే విల్ ఫుల్ డిఫాల్టర్లు, నేమ్ టు షేమ్ అంటూ పేపర్లలో ఫొటోలు ప్రచురిస్తున్నారని, వేల కోట్లు ఎగ్గొట్టిన వారి పేర్లను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనేది వారి ప్రశ్న.
ఇలాగైతే బ్యాంకుల విలీనం ఖాయం!
చిన్న స్థాయి బ్యాంకులన్నీ నష్టాల్లో ఉండటమే కాక... ఒకో బ్యాంకు సగటు నిరర్థక ఆస్తులు రూ.7,000 కోట్లపైనే ఉన్నాయి. పెద్ద బ్యాంకుల విషయానికొస్తే వీటి సగటు ఎన్‌పీఏలు రూ.30,000 కోట్లు దాటేశాయి. ఎస్‌బీఐ నిరర్థక ఆస్తులైతే డిసెంబర్ నాటికి రూ.72,000 కోట్లు దాటాయి. ఇది ఒక చిన్న బ్యాంకు ఇచ్చిన మొత్తం రుణాలకు సమానం. ఇలాగైతే బ్యాంకుల అవసరాలకు కావల్సిన మూలధనం సమకూర్చుకోవడం కష్టమేనని, ఇది నెమ్మదిగా బ్యాంకుల విలీనాలకు దారితీస్తుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ‘‘సంస్కరణల పేరిట బ్యాంకుల్ని విలీనం చేయటానికే కేంద్రం ఆర్‌బీఐ పేరుతో దొడ్డిదారిన ఈ పనులు చేస్తోంది’’ అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు విమర్శించారు.
ప్రపంచంలో పరువు పోయింది..
ఏ బ్యాంకులోనూ పనిచేయని వ్యక్తిని నేరుగా తీసుకొచ్చి ఆర్‌బీఐ గవర్నర్‌గా కూర్చోబెడితే ఏమౌతుందో దేశానికి తెలిసొచ్చిందంటూ పేరు వెల్లడికావటానికి ఇష్టపడని బ్యాంకింగ్ రంగ నిపుణుడొకరు విమర్శించారు. రోగం ఒకచోట ఉంటే చికిత్స మరోచోట చేసినట్లుందని దుయ్యబట్టారు. మరోవంక రఘురామ్ రాజన్ చర్యలతో దేశ బ్యాంకింగ్ రంగం పరువు పోయిందని బ్యాంకింగ్ నిపుణుడు కె.నరసింహమూర్తి వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచంలో ఇంత చెత్త బ్యాంకు వ్యవస్థ ఇంకెక్కడా లేదని మనకు మనమే ప్రచారం చేసుకున్నట్లయింది. దేశీ బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందనిపిస్తోంది. ఒకసారి ఎన్‌పీఏగా ప్రకటిస్తే ఆ కంపెనీలు రుణాలు తిరిగి చెల్లించడానికి ఇష్టపడవు. గత చరిత్రను చూసినా ఎన్‌పీఏల్లో 25 శాతానికి మించి రికవరీ అయిన సందర్భాలు లేవు’’ అని ఆయన వివరించారు. ఎన్‌పీఏలకు కారణమైన కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోకుండా అద్భుతంగా పనిచేస్తున్న బ్యాంకుల్ని బలిపశువులు చేయడం ఏ మేరకు సమంజసమని రాంబాబు ప్రశ్నించారు.