న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు లాభం జూన్ క్వార్టర్‌లో రెట్టింపైంది. స్టాండలోన్‌గా నికర లాభం 94 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం పుంజుకోవడం, మొండి బకాయిలకు (ఎన్‌పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల్లో వృద్ధికి దారితీసింది. బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.19,592 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో యాక్సిస్ బ్యాంకు రూ.1,112 కోట్ల లాభాన్ని, రూ.19,032 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 2021 మార్చి త్రైమాసికంలో (సీక్వెన్షియల్‌గా) ఆదాయం రూ.20,162 కోట్లతో పోలిస్తే తగ్గింది. లాభం కూడా మార్చి త్రైమాసికంలో ఉన్న రూ.2,677 కోట్లతో పోలిస్తే క్షీణించింది. వడ్డీ ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.16,003 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.16,445 కోట్లతో పోలిస్తే క్షీణించింది. బ్యాంకు రుణాలు 12% వృద్ధి చెందాయి.
ఆస్తుల నాణ్యత
రుణ ఆస్తుల నాణ్యత కాస్త మెరుగుపడింది. స్థూల ఎన్‌పీఏలు 3.85 శాతం, నికర ఎన్‌పీఏలు 1.20 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్‌పీఏలు 4.72%, నికర ఎన్‌పీఏలు 1.23% చొప్పున ఉండడం గమనార్హం. ఎన్‌పీఏలకు, కంటింజెన్సీలకు రూ.3,532 కోట్లను పక్కన పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.4,416 కోట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment